TSPSC Group 1 Guidance: టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్..
- టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 తాజా నోటిఫికేషన్
- మొత్తం 563 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ
- జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ
- విశ్లేషణాత్మక అధ్యయనమే విజయానికి మార్గం
గత గ్రూప్–1 నోటిఫికేషన్‌తో పోల్చుకుంటే.. తాజా నోటిఫికేషన్‌లో పోస్ట్‌ల సంఖ్య పెరగడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. గత నోటిఫికేషన్‌లో 503 పోస్ట్‌లను పేర్కొనగా.. తాజా నోటిఫికేషన్‌లో మొత్తం 563 పోస్ట్‌లను ప్రకటించారు. అంటే.. 60 పోస్ట్‌లు పెరిగాయి.
అర్హతలు
- ఫిబ్రవరి 19, 2024 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్(ట్రెజరీ అండ్ అకౌంట్స్ సర్వీస్) పోస్ట్‌లకు కామర్స్/ మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్ సబ్జెక్ట్‌తో కనీసం ద్వితీయ శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అదేవిధంగా ఆర్‌టీఓ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు
- జూలై 1, 2024 నాటికి 18–46 ఏళ్లు ఉండాలి(డీఎస్పీ/అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్ట్‌లకు 21–35 ఏళ్లు; ఆర్‌టీఓ పోస్ట్‌లకు 21–46 ఏళ్లు; డీఎస్పీ–జైల్స్ పోస్ట్‌లకు 18–35 ఏళ్లు). రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
రెండు దశల రాత పరీక్ష
టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు దశల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. అవి ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్.
చదవండి: TSPSC Groups Exams Guidance
ప్రిలిమినరీ పరీక్ష
గ్రూప్–1 సర్వీసుల ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఒకే పేపర్‌గా నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేరిట ఈ పరీక్ష ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలతో–150 మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. పరీక్షకు అందుబాటులో ఉండే సమయం రెండున్నర గంటలు.
900 మార్కులకు మెయిన్స్
గ్రూప్–1 మెయిన్ ఎగ్జామినేషన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఆరు పేపర్లుగా 900 మార్కులకు నిర్వహించనున్నారు. దీంతోపాటు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ కూడా ఉంటుంది. ఈ పేపర్‌ను కేవలం అర్హత పరీక్షగానే నిర్దేశించారు. జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఎస్సే 150 మార్కులకు; పేపర్ 2లో హిస్టరీ, కల్చర్–జాగ్రఫీ 150 మార్కులకు; పేపర్–3లో ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన 150 మార్కులకు; పేపర్–4లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 150 మార్కులకు; పేపర్ 5లో సైన్స్–టెక్నాలజీ–డేటా ఇంటర్‌ప్రిటేషన్ 150 మార్కులకు; పేపర్–6లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 150 మార్కులకు ఉంటాయి.
సిలబస్‌పై అవగాహన
ప్రిపరేషన్‌ను ప్రారంభించే ముందు అభ్యర్థులు సిలబస్‌ను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్షలో పేర్కొన్న అన్ని అంశాలకు సంబంధించి నిర్దేశించిన సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దాని ఆధారంగా చదవాల్సిన ముఖ్యమైన అంశాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ప్రిపరేషన్‌లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ ఇటీవల కాలంలో నిర్వహించిన ఇతర నియామక పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్లను పరిశీలించడం కూడా మేలు చేస్తుంది.
చదవండి: Syllabus
సమయ పాలన
గ్రూప్–1 అభ్యర్థులు ప్రిపరేషన్‌లో సమయ పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అంటే.. గరిష్టంగా మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా సమయ పాలన పాటించాలి. ప్రిలిమినరీ సిలబస్‌లో మొత్తం 13 అంశాలను పేర్కొన్నారు. వీటిలో కొన్నింటిని ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. మొత్తంగా ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.
లోకల్ టు ఇంటర్నేషనల్
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అంతర్జాతీయ పరిణామాలు మొదలు.. స్థానిక అంశాల వరకు అన్నింటిపైనా దృష్టిపెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాలను ఔపోసన పట్టాలి. తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవి ర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలి.
ప్రభుత్వ విధానాలు
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు; వాటిపై ప్రభుత్వాలు చేసిన విధానాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, ఎస్సీ/ఎస్టీలు, బాలలు, వృద్ధులు, గిరిజన సంక్షేమం కోసం విధానాలు తెచ్చారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు..నూతన విద్యా విధానం..ఇప్పటి వరకు తీసుకొచ్చిన విద్యా విధానాలు,ప్రస్తుత విధానానికి వాటికి మధ్య ఉన్న వ్యత్యాసం,ఉద్దేశం, లక్ష్యాలు ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.
చదవండి: Study Material
తెలంగాణపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న అంశాల నుంచి పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ముందుగా తెలంగాణ పాలసీలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు.. దానికి సంబంధించి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వంటి అంశాలపై ఎలాంటి విధానాలు తెచ్చారన్నది తెలుసుకోవాలి. అదే విధంగా రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన పెంచుకోవాలి.
సొసైటీకి ఇలా
భారతీయ సమాజం, తెలంగాణ సమాజంలో ప్రత్యేక అంశాలు (వెట్టి, జోగిని వంటివి), సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా వర్గాల నిర్వచనంతోపాటు వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటినీ చదవాలి. అప్పుడే ఆయా అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
డిస్క్రిప్టివ్ విధానం
డిస్క్రిప్టివ్ విధానంలో ప్రిపరేషన్ సాగిస్తే.. ఆయా అంశాలపై అన్ని కోణాల్లో సమగ్ర అవగాహన పెంచుకునేందుకు వీలుంటుంది. ఫలితంగా ప్రశ్న ఎలా అడిగినా జవాబు గుర్తించగలుగుతారు. ఇది భవిష్యత్తులో మలి దశలో ఉండే మెయిన్ పరీక్షకు కూడా ఉపయుక్తంగా నిలుస్తుంది. ఎంపిక చేసుకున్న ప్రామాణిక పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
మెయిన్స్‌తో అనుసంధానం
గ్రూప్–1 అభ్యర్థుల్లో చాలా మందిలో నెలకొనే సందేహం.. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌కు చదివే వీలుందా? అనేది. ప్రస్తుత సిలబస్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ అవకాశం ఉందనే చెప్పాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో, ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మెయిన్స్, ప్రిలిమ్స్ అంశాల సిలబస్‌ను బేరీజు వేసుకుని.. డిస్క్రిప్టివ్ విధానంలో చదివే నేర్పు సొంతం చేసుకుంటే ఒకే సమయంలో రెండింటికీ సన్నద్ధత లభిస్తుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024, మార్చి14
- దరఖాస్తుల సవరణ అవకాశం: మార్చి 23 – మార్చి 27
- హాల్ టికెట్ డౌన్‌లోడ్: పరీక్షకు వారం రోజుల ముందు నుంచి
- ప్రిలిమినరీ పరీక్ష: 2024, జూన్ 9
- మెయిన్ ఎగ్జామినేషన్: సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
చదవండి: TSPPC Groups Practice Test
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- TSPSC
- TSPSC Exams
- TSPSC Group 1 Notification
- TSPSC Group 1 Preparation
- Prelims
- Mains
- TSPSC Group 1 Exam Pattern
- tspsc group 1 syllabus
- TSPSC Latest Notification
- Competitive Exams
- Competitive Exams Bit Banks
- Current Affairs
- Current Affairs Quiz
- sakshi current affairs
- Sakshi Bhavitha
- Recruitment Details
- Preparation Tips
- application process
- Eligibility Criteria for TSPSC Group-1 Posts