Skip to main content

Tesla Shares: మస్క్‌.. టెస్లాకు ‘ట్విటర్‌’షాక్‌.. ఏడాదిలో టెస్లా షేరు 70% కుదేలు!

అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా షేరు ఏడాది క్రితం దాకా బ్రేకుల్లేని బండిలా రివ్వున దూసుకెళ్లిపోయింది. కంపెనీ బాసు ఎలాన్‌ మస్క్‌ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి స్థానంలో కూర్చోబెట్టింది.

కానీ ఇప్పుడదే షేరు ఏకంగా 70 శాతం పడిపోయి.. నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మస్క్‌ సంపదా భారీగా హరించుకుపోయింది. చరిత్రలోనే అత్యంత వేగంగా భారీ సంపదను పోగొట్టుకున్న కుబేరుడిగా రికార్డును కూడా మూటగట్టుకున్నారు. ముచ్చట పడి, పంతం పట్టి కొనుక్కున్న ట్విటర్‌కే సమయం అంతా వెచ్చిస్తూ టెస్లాను మస్క్‌ పట్టించుకోకపోతూ ఉండటమే ఇన్ని అనర్ధాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. అయితే, అదొక్కటే కాకుండా టెస్లాకు మార్కెట్లో పోటీ పెరిగిపోతుండటం, డిమాండ్‌ తగ్గుతుండటం, కంపెనీపై ఇన్వెస్టర్లకు నమ్మకం సడలుతుండటం మొదలైనవి మరికొన్ని కారణాలని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా ఒక దశ మాత్రమేనని, మళ్లీ పుంజుకునే సామర్థ్యాలు టెస్లాకు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Elon Musk: పేరుకే ప్ర‌పంచ కుబేరుడు.. ఆఫీసు అద్దె కూడా క‌ట్ట‌లేడు

ట్విటర్‌తో కష్టాలు.. 
మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విటర్‌ను కొనడంతోనే అటు టెస్లాకు ఇటు మస్‌్కకు కష్టాలు వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొంటానంటూ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించిన మస్క్, బోలెడంత ఊగిసలాట తర్వాత అక్టోబర్‌లో ఎట్టకేలకు కొన్నారు. డీల్‌ గురించి ప్రకటించిన దగ్గర్నుంచి ఆయన 23 బిలియన్‌ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను అమ్మేశారు. ట్విటర్‌ను కొన్నప్పటి నుంచి గరిష్టంగా దానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని, టెస్లాను పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో మిగతా షేర్‌హోల్డర్లూ అదే బాట పట్టారు. ఇవన్నీ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావం చూపాయన్న అభిప్రాయం ఉంది.  
డిమాండ్‌ డౌన్‌..  
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కారణంగా టెస్లా కార్లకు డిమాండ్‌ బలహీనపడుతోంది. కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టెస్లా తొలిసారిగా డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముందు 3,750 డాలర్ల డిస్కౌంటు ఇస్తామని ప్రకటించిన టెస్లా.. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆ తర్వాత దాన్ని ఏకంగా 7,500 డాలర్లకు పెంచింది. ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో పోటీ పెరుగుతున్న క్రమంలో కీలకమైన చైనా, అమెరికా మార్కెట్లలో డిమాండ్‌ బలహీనపడుతుండటం టెస్లాకు అర్థమవుతోంది కాబట్టే ఇలా డిస్కౌంట్ల బాట పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇదే కాకుండా అమెరికా ఎకానమీ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకుంటుందని, కార్లకు డిమాండ్‌ పడిపోతుందని వస్తున్న వార్తలూ టెస్లాకు ప్రతికూలంగా ఉంటున్నాయి. అంతేకాకుండా ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్, జీఎం, హ్యుందాయ్‌ వంటి దిగ్గజాలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తూ టెస్లాకు దీటుగా కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను దింపేందుకు కసరత్తు చేస్తుండటమూ కంపెనీకి సవాలుగా మారుతోంది. కీలకమైన అమెరికా ఈవీ మార్కెట్లో టెస్లా వాటా 2020లో 79% కాగా గతేడాది తొలి 9 నెలల్లో 65%కి పడిపోయింది. 2025 నాటికి ఇది 20% దిగువకు పడిపోవచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మొబిలిటీ అంచనా. 

Elon Musk: ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం కోల్పోయిన మస్క్

వేల్యుయేషన్లపై సందేహాలు.. 
అమ్మకాలు అంతంతే అయినా అసాధారణంగా ట్రిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో ట్రేడ్‌ అవడం టెస్లాకు క్రమంగా ప్రతికూలంగా మారింది. ఒక దశలో టెస్లా వేల్యుయేషన్‌.. ప్రపంచంలోనే టాప్‌ 12 భారీ ఆటో దిగ్గజాలన్నింటినీ మించి పలికింది. కానీ వాటి అమ్మకాలతో పోలిస్తే టెస్లా విక్రయాలు తూగడం లేదు. ఇదంతా మార్కెట్‌కు అవగతమయ్యే కొద్దీ కంపెనీ వేల్యుయేషన్‌ ట్రిలియన్‌ డాలర్ల నుంచి ప్రస్తుతం దాదాపు 400 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అంతే గాకుండా మస్క్‌ చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండకపోతుండటం కూడా ఇన్వెస్టర్లలో అపనమ్మకం కలిగిస్తోంది.
ఏదేదో చేసేస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసే మస్క్‌ .. వాటిని ఆచరణలో మాత్రం చూపడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు నాలుగేళ్ల క్రితం ఆవిష్కరించిన సైబర్‌ట్రక్‌ ఉత్పత్తి 2021లో మొదలుపెడతామని మస్క్‌ చెప్పినప్పటికీ ఈ ఏడాది వరకూ వాయిదా పడుతూ వచ్చింది. 2024లో గానీ పూర్తి స్థాయిలో తయారీ పుంజుకోదు. ఫోర్డ్, రివియన్‌ లాంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ పికప్‌లను అమ్మేస్తుండగా టెస్లా ఎప్పటికి పుంజుకుంటుందనేది సందేహంగా మారింది.

• టెస్లా మార్కెట్‌ విలువ ఏడాది క్రితం 1 ట్రిలియన్‌ డాలర్లు 
• ప్రస్తుతం 389 బిలియన్‌ డాలర్లు
• మస్క్‌ సంపద ఏడాది క్రితం 320 బిలియన్‌ డాలర్లు 
• ప్రస్తుతం 132 బిలియన్‌ డాలర్లు

Elon Musk: ట్విట్టర్‌ సీఈవోగా మస్క్ తప్పుకోవాలని 57.5 శాతం ఓట్లు

సంపద సృష్టిలోనూ.. కోల్పోవడంలోనూ రికార్డే!
టెస్లా షేరు 2021 ఆఖర్లో దాదాపు 409 డాలర్ల రికార్డు స్థాయిని తాకింది. దానికి అనుగుణంగానే అందులో సుమారు 21 శాతం వాటాలున్న కంపెనీ చీఫ్‌ మస్క్‌ 320 బిలియన్‌ డాలర్ల సంపదతో సంపన్నుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నంబర్‌ వన్‌గా ఉండేవారు. అయితే, గట్టిగా ఏడాది తిరిగేసరికి టెస్లా షేరు 123 డాలర్లకు పడిపోయింది. మస్క్‌– ట్విటర్‌ డీల్‌ నేపథ్యంలో గత మూడు నెలల్లో భారీగా పతనమైంది. వెరసి 2022 మొత్తం మీద దాదాపు 65 శాతం క్షీణించింది.
దానికి తగ్గట్లే కంపెనీలో 13.4 శాతం (ప్రస్తుతం) వాటాలు ఉన్న మస్క్‌ సంపద కూడా ఏకంగా 188 బిలియన్‌ డాలర్ల మేర పడిపోయింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ప్రస్తుతం మస్క్‌ సంపద విలువ 132 బిలియన్‌ డాలర్లు. ఇంత స్వల్ప కాలంలో ఇంత భారీగా సంపద కోల్పోవడంలో మస్క్‌ రికార్డు సృష్టించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ రికార్డు జపాన్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ అధినేత మసయోషి సన్‌ పేరిట ఉండేది. 2000 ఐటీ బబుల్‌ బరస్ట్‌  అయినప్పుడు ఆయన ఏకంగా 58.6 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Published date : 13 Jan 2023 05:27PM

Photo Stories