Indian Rupee: రూపాయి క్షీణతను నివారించాలంటే...
అదేసమయంలో పెట్రోల్, వంటనూనెలు వంటి నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి జనాలు నానా యాతనా పడుతున్నారు. ద్రవ్యం విలువ పడిపోవడం దేశ కరెంట్ ఖాతా లోటు పెరిగిపోవడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగి అధిక శాతం జనాభా కనీసావసరాలను తీర్చుకోలేక ఇబ్బందుల పాలవుతారు. ఇంత ఇబ్బందికరమైన రూపాయి విలువలో వచ్చే హెచ్చు తగ్గులకు అనేక అంతర్గత, బాహ్య పరిస్థితులు కారణాలుగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని భారతీయ కరెన్సీ క్షీణతను ఆర్‌బీఐ అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాలి.
గత కొన్ని నెలలుగా రూపాయి విలువ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇది 2022 జూలై 20 నాటికి డాలర్‌తో పోలిస్తే 80.05 రూపాయల కనిష్ఠానికి చేరుకుంది. 2022 ఆగస్టు 2కు 78.72 రూపాయలకు బలపడింది. ఇలా ఎందుకు జరుగుతోంది? రూపాయి విలువ పడిపోవడాన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. రూపాయి విలువ తగ్గింపు వల్ల... అంటే ఇతర కరెన్సీలతో అధికారిక మారకపు రేటులో ఉద్దేశ పూర్వకంగా మన రూపాయిని తగ్గించడం (మూల్య హీనీకరణ) ఒకటి. ఇది 1949, 1966, 1991 సంవత్సరాలలో జరిగింది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ స్థానం ఏమిటి?
డాలర్‌తో రూపాయి విలువ తగ్గడాన్ని సూచించే రూపాయి విలువ క్షీణత మరొ కటి. ఇది ఆర్థిక ఒడిదుడుకులవల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనంగా మారిందని సూచిస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఈక్విటీ అమ్మకాలు, డాలర్ తిరుగు ప్రవాహం, ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడానికి ఆర్‌బీఐ తీసు కున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కఠినతరం వంటి కారకాలు ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణాలు.
Also read: Weekly Current Affairs (Science and Technology) Bitbank: ఏ దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ పిండాలను సిద్ధం చేశారు?
బలహీన రూపాయి వల్ల సైద్ధాంతికంగా భారతదేశ ఎగుమతు లకు ప్రోత్సాహం లభిస్తుంది. భారతదేశానికి ప్రయాణం చౌకగా ఉంటుంది. స్థానిక పరిశ్రమ లాభపడవచ్చు, విదేశాలలో పని చేసే వారు తమ స్వదేశానికి డబ్బు పంపడం ద్వారా ఎక్కువ లాభం పొంద వచ్చు. కరెంట్ ఖాతా లోటు తగ్గే అవకాశం ఉంది. ఇక నష్టాల సంగతి కొస్తే... ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో ఎక్కువ కాలం కొనసాగించడాన్ని కష్టతరం చేస్తుంది. భారత్ తన దేశీయ చమురు అవసరాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. బలహీనమైన కరెన్సీ వల్ల దిగుమతి చేసుకున్న వంట నూనెల ధరలు మరింతగా పెరుగుతాయి. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుంది. రూపాయి కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు విస్తరిస్తుంది. విదేశీ ప్రయాణాలకూ, విదేశీ విద్యార్జనకూ ఎక్కువ ఖర్చు అవుతుంది. విదేశీ రుణంపై వడ్డీ భారం పెరుగుతుంది.
Also read: Weekly Current Affairs (International) Bitbank: US సెనేట్ ద్వారా NATOలో చేరడానికి ఏ రెండు దేశాలు ఆమోదించబడ్డాయి?
ఇప్పటి వరకు సంవత్సరానికి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు 7 శాతం పడిపోయింది. ఓవర్–ది–కౌంటర్, డెరి వేటివ్స్ మార్కెట్‌లలో రూ. 80 మార్క్‌ను దాటింది. ఈ క్యాలెండర్ సంవత్సరం మూడో త్రైమాసికంలో డాలర్‌తో పోలిస్తే రూ. 82కి తగ్గుతుందని నోమురా సంస్థ అంచనా వేస్తోంది. ముడి చమురు ధరలు పుంజుకోవడం, డాలర్ తక్షణ కాలంలో సాపేక్షంగా బలంగా ఉంటుందనే అంచనాల మధ్య, 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూపాయి 81కి బలహీనపడవచ్చని భావిస్తున్నారు. సమీప కాలంలో రూపాయి ఒత్తిడికి లోనవుతుందని క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీ సెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) అంచనా వేసింది. అంతే కాకుండా వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వెనక్కి పోవడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి కారణాల వల్ల సమీప కాలంలో రూపాయి–డాలర్ మారకం అస్థిరంగా ఉంటుందని అంచనా వేసింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్ల పెంపుదల, భౌగోళిక రాజకీయ అస్థిరతల మధ్య డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడవచ్చని అంచనా వేసింది.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: ఫార్చ్యూన్ 500 గ్లోబల్ లిస్ట్ 2022లో భారతదేశంలో అత్యధిక ర్యాంక్ పొందిన కంపెనీ ఏది?
ప్రస్తుతం రూపాయి విలువ బాగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో కొన్ని పరిణామాలకు దారితీసింది. భారతదేశ ఫార్మసీ రంగం 2022 సంవత్సరంలో 22.5 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఈ కంపెనీలు అమెరికా నుండి అత్యధిక ఆదా యాన్ని పొందుతున్నాయి. నికర ఎగుమతిదారు అయిన వస్త్ర (టెక్స్ టైల్) పరిశ్రమ బలహీనమైన రూపాయి నుండి ప్రయోజనం పొందు తోంది. రత్నాలు, ఆభరణాల రంగం విషయానికొస్తే రూపాయి క్షీణత దాని యూనిట్లకు వ్యయ ప్రయోజనాన్ని ఇస్తోంది. ఐటీ సేవలు, సాంకేతిక పరిశ్రమ అమెరికా ఆదాయాలలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయి కాబట్టి... క్షీణిస్తున్న రూపాయి అతిపెద్ద లాభాల్లో ఒకటిగా ఉంటుంది. రూపాయిలో ప్రతి 1 శాతం పతనానికీ వస్త్ర ఎగుమతులకు 0.25–0.5 శాతం లాభం పెరుగుతుంది. భారతదేశం తేయాకు(టీ) లాభాల ఎగుమతులు 5–10 శాతం పెరుగుతాయని అంచనా.
Also read: Weekly Current Affairs (National) Bitbank: భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో ఏ నగరంలో ప్రారంభించబడుతుంది?
సరఫరా కొరత కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలతో, ఎగుమతిదారులకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇది వారి లాభాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదిలావుండగా, విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు భారతీయ మార్కెట్ల నుండి 19 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ముడి చమురు ఫ్యూచర్స్ ధరలో ఒక డాలర్ పెరుగుదలతో... భారత్ ముడి చమురు దిగుమతులు 1.703 మిలియన్ టన్నులు పెరిగాయని అంచనా. ప్రతి ఒక మిలియన్ టన్ను ముడి చమురు దిగుమతి... డాలర్‌ను మన రూపాయితో పోలిస్తే 0.266 బలపరుస్తుంది. జూలై 15తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 7.5 బిలియన్లు తగ్గి 572.71 బిలియన్లకు పడిపోయాయి. ఇది 20 నెలల కనిష్ఠ స్థాయి. భారతదేశ కరెంట్ ఖాతా లోటు 2022లో జీడీపీలో 1.5 శాతం నుండి 3 శాతం వరకు పెరుగు తుందని అంచనా.
Also read: World Badminton Championship 2022 : ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో..
అమెరికా డాలర్‌తో పోలిస్తే అనేక కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఫలితంగా, భారతదేశంతో సహా వివిధ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నుండి విదేశీ మూలధన ప్రవాహం జరుగుతోంది. వారి దేశీయ కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. అమెరికా డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం... ఇతర ప్రధాన ప్రపంచ కరెన్సీలైన యూరో, బ్రిటిష్ పౌండ్, జపనీస్ ఎన్‌ల కంటే తక్కువగా ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. ప్రధాన కరెన్సీలకు వ్యతిరేకంగా అమెరికా యూనిట్ ఈ ఏడాది 11 శాతం ర్యాలీ చేసి రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల స్థిరమైన తరుగుదలకి కారణమైంది. ఫలితంగా, భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 80 మార్క్‌ను దాటి రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 2022లో రూపాయి దాదాపు 7 శాతం నష్టపోయినప్పటికీ, కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలు మన రూపాయి కన్నా చాలా దారుణంగా క్షీణించాయి. యూరో 13 శాతం, బ్రిటిష్ పౌండ్ 11 శాతం, జపనీస్ ఎన్ 16 శాతం తగ్గాయి. ఫలితంగా ఈ కరెన్సీలతో రూపాయి విలువ పెరిగింది. దక్షిణ కొరియా వాన్, ఫిలిప్పైన్ పెసో, థాయ్‌లాండ్ బాట్, తైవాన్ డాలర్‌లు... అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి కంటే ఎక్కువగా పడిపోయాయి. అందువల్ల ఆయా దేశాల నుంచి మనం చేసుకునే దిగుమతులు మనకు లాభదాయకంగా ఉంటాయి.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఇప్పుడు భారతీయ కరెన్సీ క్షీణతను ఆర్‌బీఐ ఎలా అదుపు చేయగలదో చూద్దాం. ఫారెక్స్ మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలి.నాన్ రెసిడెంట్ ఇండియన్ బాండ్లను విక్రయించాలి. సావరిన్ బాండ్ల జారీని నిర్వహించాలి. భారతదేశం తన మొత్తం కరెంట్ ఖాతా లోటును తగ్గించుకోవడంపై దృష్టి సారించి, రష్యా వంటి స్నేహ పూర్వక దేశాలతో రూపాయి చెల్లింపు విధానాన్ని లాంఛనప్రాయంగా పరిగణించాలి. ఇది అమెరికా డాలర్‌పై రూపాయి ఆధారపడటాన్ని తగ్గించడానికి మార్గం సుగమం చేస్తుంది. పారిశ్రామిక వృద్ధికి ప్రాధా న్యత ఇవ్వాలి. తద్వారా వస్తువుల విక్రయానికి రూపాయి మార్పిడి అవసరం అవుతుంది. ఇది చివరికి అంతర్జాతీయ మార్కెట్లలో సంస్థా గతీకరణకు దారి తీస్తుంది. రూపాయిలో నల్లధనం లావాదేవీలను అరికట్టడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం కూడా చాలా అవసరం. రూపాయి బహు పాక్షిక స్వభా వాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి వినియోగాన్ని పెంచాలి. ఎలా చూసినా కరెన్సీ విలువ పడి పోకుండా రక్షించేది ఆర్థికాభివృద్ధి మాత్రమే. కాబట్టి ప్రభుత్వం ఆ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాలి.
Also read: Quiz of The Day (September 02, 2022): భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
వ్యాసకర్త మేనేజ్‌మెంట్ స్టడీస్ నిపుణులు
డాక్టర్ పీఎస్ చారి