GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి ‘జీఎస్టీ’ గురించి చర్చ జరిగింది. కానీ 2017లో మాత్రమే అది అమలులోకి రాగలిగింది. తొలుత కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా, ఐదేళ్ల తర్వాత అది శక్తిమంతమైంది. వచ్చిన ఏడాదే 63.9 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఇందులోకి మళ్లారు. 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపయింది. కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. గతంలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. నిజంగానే జీఎస్టీ, భారతదేశాన్ని సింగిల్ మార్కెట్‌ను చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని చెప్పడంలో ఏ సందేహమూ లేదు.
Also read: Indian Air Force: భారత వాయుసేనలో తండ్రీ తనయ రికార్డ్
భారతదేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టి జూలై 1తో అయిదేళ్లు పూర్తయింది. 2003 సంవత్సరంలో పరోక్ష పన్నులపై కేల్కర్ టాస్క్‌ఫోర్స్ నివేదికలో జీఎస్టీ గురించి తొలిసారిగా చర్చించారు. కానీ దానికి తుదిరూపు ఇవ్వడానికి చాలా కాలం పట్టింది. ప్రవేశపెట్టింది మొదలుకొని జీఎస్టీ సహజంగానే పెను సమస్యలను ఎదుర్కొంది. అయితే కోవిడ్–19 కల్లోలాన్ని ఎదుర్కొని, దాని ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, జీఎస్టీ శక్తిమంతంగా ఆవిర్భవించింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో సరిపెట్టుకోకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ మార్గంలోకి నడిపిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకున్నా యంటే ఆ ఘనత జీఎస్టీ కౌన్సిల్‌కే దక్కుతుంది. ఈ రకమైన పరస్పర కృషి వల్లే భారత్ ప్రపంచంలోనే అత్యంతవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఆవిర్భవించింది.
Also read: Rajya Sabhaకు పీటీ ఉష, ఇళయరాజా, వీరేంద్ర హెగ్గడే, విజయేంద్ర ప్రసాద్
భారత్‌లో జీఎస్టీ 2017లో అమల్లోకి వచ్చింది కానీ, చాలా దేశాలు అంతకుముందే జీఎస్టీ విధానం వైపు మళ్లాయి. కేంద్రమూ, రాష్ట్రాలూ పన్నుల మీద స్వతంత్రతను అనుభవించిన అర్ధ–సమాఖ్య వ్యవస్థ చాలాకాలంగా ఏకీకృత పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన జీఎస్టీ మండలి, భారత్‌కే ప్రత్యేకమైన జీఎస్టీ సొల్యూషన్ (ద్వంద్వ జీఎస్టీ) దీనికి సమాధానాలుగా నిలి చాయి. దేశంలో విభిన్న పరిమాణాలతో, విభిన్న అభివృద్ధి దశలతో కూడిన రాష్ట్రాలు, వాటి వారసత్వ పన్నుల వ్యవస్థను మిళితం చేసి జీఎస్టీ పరిధిలోకి తేవలసి వచ్చింది. కొన్ని మినహాయింపులతో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్నులను జీఎస్టీలో కలపడం జరిగింది. ఈ క్రమంలో 17 రకాల పన్ను చట్టాలను మేళవించి జీఎస్టీ ద్వారా ఏకీకృత పన్నుల వ్యవస్థను అమల్లోకి తేవడం జరిగింది.
Also read: Defence Minister Rajnath Singh introduces the 'Agnipath' scheme: రక్షణ నియామకాల్లో అగ్నిపథ్
పన్ను రేట్లు, మినహాయింపులు, వాణిజ్య ప్రక్రియ, ఐటీసీ చలనం వంటి కీలక అంశాలపై జాతీయ ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. దేశంలోని 63.9 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు 2017 జూలైలో జీఎస్టీలోకి మళ్లారు. 2022 జూన్ నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1.38 కోట్లకు చేరుకుంది. 41.53 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు, 67 వేల మంది ట్రాన్స్ పోర్టర్లు ఈ–వే పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. నెలకు సగటున 7.81 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రారం భమైంది మొదలు 292 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. ఇందులో 42 శాతం అంతర్రాష్ట్ర సరకుల రవాణాకు సంబంధించినవి. ఈ సంవత్సరం మే 31న ఒకేరోజు అత్యధికంగా 31,56,013 ఈ–వే బిల్స్ జనరేట్ కావడం ఒక రికార్డు.
నెలవారీ సగటు వసూళ్లు కూడా 2020–21లో రూ. 1.04 లక్షల కోట్ల నుంచి, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో సగటు వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ధోరణి పెరుగుతుందని చెప్పడం హేతు పూర్వకమైన, న్యాయమైన అంచనా అవుతుంది. సీఎస్టీ, వీఎటీ వ్యవస్థలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. బోర్డర్ చెక్‌పోస్టులు, సరుకులు లోడ్ చేసిన ట్రక్కులను నిలబెట్టి మరీ తనిఖీ చేయడంతో కూడిన గతంలోని నియంత్రణ వ్యవస్థ కల్లోలం సృష్టించి కాలాన్నీ, ఇంధనాన్నీ వృథా చేసేది. దీంతో లాజిస్టిక్స్ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోయింది. సరుకుల ధరలో 15 శాతం వరకూ దీని ఖర్చులే ఉండేవని అంచనా.
Also read: 2018–19 భారత ఆర్థిక సర్వే– కీలకాంశాలు
జీఎస్టీకి మునుపటి వ్యవస్థలో అనేక సరుకులపై కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి రేట్లు 31 శాతం కంటే ఎక్కువగానే ఉండేవి. కానీ ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థ కింద 400 సరకులు, 80 సేవలపై పన్నులను బాగా తగ్గించడమైనది. అత్యధికంగా 28 శాతం రేటు ఇప్పుడు విలాస వస్తువులపై మాత్రమే ఉంది. గతంలో 28 శాతం పన్ను రేటు ఉన్న 230 సరుకుల్లో సుమారు 200 సరుకులను పన్ను తక్కువగా ఉండే శ్లాబ్‌లకు మార్చడమైనది.
Also read: Mathura: శ్రీకృష్ణ జన్మభూమిపై రాజుకున్న వివాదం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ద తీసుకుంది. వీటిపై పన్ను రేట్లు బాగా కుదించింది. పైగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనం కోసం ఈ సంస్థలను సప్లయ్ చైన్స్‌తో అనుసంధానించడం జరిగింది. ఈ క్రమంలో రెండు కీలకమైన చర్యలను కేంద్రం తీసుకుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను మినహాయింపు 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెరిగింది. కాగా, త్రైమాసిక రిటర్న్‌లు, నెల వారీ చెల్లింపుల పథకం ప్రవేశపెట్టడంతో 89 శాతం పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలిగింది.
జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది ఐటీ ఆధారితంగా, పూర్తి ఆటోమేటిక్ పద్ధతిలో కొనసాగుతోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సామర్థ్యా లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నవీకరిస్తూండటం వల్ల మొత్తం వ్యవస్థను క్రియాశీలంగా ఉంచడం సాధ్యమైంది. జీఎస్టీ వ్యవహారాలపై అనేక వ్యాజ్యాలు... సమన్లు జారీ చేయడం, వ్యక్తులను అరెస్టు చేయడం, రికవరీల కోసం ఆస్తులను జప్తు చేయడంతో సహా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ వంటి అంశాల పైనే వస్తున్నాయి. మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కూడా చాలా ప్రాచుర్యం పొందింది. కానీ జీఎస్టీలోని ప్రాథమిక అంశాలను కోర్టు పక్కన పెట్టలేదని గుర్తించాలి.
Also read: Mathura: శ్రీకృష్ణ జన్మభూమిపై రాజుకున్న వివాదం
దాదాపు 24 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అసీమ్ దాస్‌గుప్తా 2000 నుంచి 2011 సంవ త్సరం దాకా రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. మొట్టమొదటి జీఎస్టీ చట్టాల రూపకల్పన 2009లో జరిగింది. 2017 జూలై 2న ఒక వాణిజ్య పత్రికకు అసీమ్ దాస్‌గుప్తా ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్టీలోని ముఖ్యమైన అంశాలను వక్కా ణించారు. ఆయన చెప్పిన అంశాలు ఇప్పటికీ మార్పు లేకుండా కొనసాగుతున్నాయి: ‘సర్వీస్ టాక్స్‌ని విధించే అధికారం రాష్ట్రాలకు అసలు ఉండేది కాదు. అందులో కేవలం భాగం పొందడమే కాదు, పన్ను విధించే అధికారం కోసం అడుగుతూనే ఉండేవి. జీఎస్టీ దానికి అవకాశం కల్పించింది.’
ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై సాధికారిక కమిటీ దృఢమైన వైఖరి తీసుకుంది. సెంట్రల్ జీఎస్టీపై పార్లమెంట్‌కూ, రాష్ట్ర జీఎస్టీపై అసెంబ్లీలకూ సిఫార్సు చేసే విభాగమే జీఎస్టీ కౌన్సిల్. సాంకేతికంగా శాసనసభ దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కాబట్టి శాసనసభల అధికారాన్ని ఇది తీసేసు కోవడం లేదు.’ ఇంకా ముఖ్యంగా ఆయన ఇలా అన్నారు: ‘ఇక రేట్లకు సంబంధించి చూస్తే, రాష్ట్రాలు, కేంద్రం కలిసి రెండింటికీ ఒక రకమైన ఏక పన్నును ఆమోదించాయి. కాబట్టి సహకారాత్మక సమాఖ్య ప్రయోజనం కోసం రాష్ట్రాలు, కేంద్రం పాక్షికంగా త్యాగం చేశాయని దీనర్థం. అదే సమయంలో సర్వీస్ టాక్స్ విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ అదనపు అధికారాలను ఇచ్చింది. రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తుల్లో సగం సేవల కిందికే వస్తాయి.’
Also read: AP New Districts : కొత్త జిల్లాలు.. వీటి చరిత్ర..!
జీఎస్టీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బ్లాగులో ఇలా రాశారు: ‘అటు వినియోగ దారు, ఇటు మదింపుదారు (అసెస్సీ) ఇద్దరికీ అనుకూలంగా జీఎస్టీ ఉంటుందని రుజువైంది. పన్ను చెల్లింపుదారులు, టెక్నాలజీని అంది పుచ్చుకున్న మదింపుదారులు ఇద్దరూ చూపించిన సానుకూలతకు ధన్య వాదాలు. నిజంగానే జీఎస్టీ, భారత్‌ను సింగిల్ మార్కెట్‌ని చేసింది.’
నిర్మలా సీతారామన్
(జూలై 1 నాటికి జీఎస్టీ వచ్చి ఐదేళ్లు)
వ్యాసకర్త కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)