Skip to main content

AP New Districts : కొత్త జిల్లాలు.. వీటి చ‌రిత్ర..!

గణతంత్రదినోత్సవం నాడు రాష్ట్రంలో పరిపాలన, బౌగోళిక మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం.
ap new districts
AP New Districts

బ్రిటిష్‌ వారు 120 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లాలకు అదనంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటికి జనాభా 5 రెట్లు పెరిగినా కొత్త జిల్లాలు కేవలం రెండు (విజయనగరం, ప్రకాశం) మాత్రమే ఏర్పడ్డాయి. 

AP New Districts List 2022 : జిల్లాల స‌మ‌గ్ర స‌మాచారం మీకోసం..ఏ జిల్లా ప‌రిధిలో మీరు ఉన్నారంటే..?

కేంద్ర ప్రభుత్వం 2021 జనగణనను కరోనా విపత్తు వల్ల నిరవధికంగా వాయిదా వేసి కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు మార్పు చేర్పులపై వున్న నిషేధాన్ని 2022 జూన్‌ 30 వరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్యాబినెట్‌ నూతన జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సరైన సమయంలో తీసుకున్న సాహసోపేత చర్య. జూన్‌ 30 నాటికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, రెవెన్యూ గ్రామాల ఏర్పాటు, సరిహద్దుల్లో మార్పులు వంటివి పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిస్తే జూలై తరువాత ఎప్పుడు జనగణన జరిగినా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రకారమే జనగణన చేపడతారు.

Andhra Pradesh: నూతన జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు

​​​​​​​AP New Revenue Divisions: 63కు చేరిన రెవెన్యూ డివిజన్లు.. కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే..

కొత్త జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్‌లో ఎంతైనా వుంది. రాష్ట్రంలో సగటు జిల్లా జన సంఖ్య 37.98 లక్షలు కాగా మొత్తం జిల్లాలు 13 మాత్రమే. నూతనంగా ఏర్పడిన తెలం గాణలో జిల్లా సగటు జనాభా 11.35 లక్షలు ఉంటే జిల్లాలు 33 ఉన్నాయి.  మనకన్నా జిల్లా సగటు జనాభా (26.64 లక్షలు) తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 80 జిల్లాలు ఉండటం గమ నార్హం. దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్‌లో (39.68 లక్షలు) మాత్రమే ఏపీలోని జిల్లా సగటు జనాభా కన్నా ఎక్కువ జన సంఖ్య ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని చూసిన ప్పుడు ఏపీలో జిల్లాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు స్పష్ట మవుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇదీ ఒక కారణమే. దాదాపు పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దులే కొత్త జిల్లా సరిహద్దులకు ప్రాతిపదికగా తీసుకోవటం, అసెంబ్లీ నియోజక వర్గాలు రెండు మూడు జిల్లాల్లో విస్తరించకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మేలైన నిర్ణయం.

1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు

ఆంధ్రప్రదేశ్‌లో 1974 జిల్లాల చట్టంలో ఉన్నవీ, 1984లో రూపొందించిన నిబంధనలనూ పరిశీలించినప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు గమనించాల్సిన ముఖ్యాంశాలు– ప్రాంతం, జనాభా, ఆదాయం... కొత్త, పాత జిల్లాల్లో దాదాపు సమపాళ్లలో ఉండేటట్లు తుది ముసాయిదా నాటికి సవరించాలి. అలాగే చారిత్రక నేపథ్యం, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు; సాంస్కృతిక పరమైన, విద్య, మౌలిక సదుపాయాలూ; ఆర్థిక పురోభివృద్ధి అవకాశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన, లేదా బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్నీ ఒకే దగ్గరకు రాకుండా చూడాలి. పార్లమెంట్‌ సరిహద్దు ప్రాతిపదికనే కాకుండా పరిస్థితిని బట్టి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయవలసి ఉంది.

కొంతమంది 2026లో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి... పార్లమెంటు సరిహద్దులు మారుతాయనీ, అందువల్ల ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు సరికాదనీ అంటున్నారు. ఇది వాస్తవం కాదు. 2001లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2026 తరువాత వచ్చే తొలి జనాభా లెక్కల ప్రకారం (అంటే 2031 సెన్సెస్‌) డీలిమిటేషన్‌ కమిటీ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేయ డానికి 3 సంవత్సరాలు పడుతుంది. అసలు జనాభా లెక్కల తుది జాబితానే 2034లో ప్రకటిస్తారన్న సంగతి గుర్తించాలి. అంటే 2039 ఎన్నికల వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య తేలే అవకాశమే లేదన్నమాట! 

AP New Districts: కొత్త జిల్లాలకు కేబినెట్‌ ఆమోదం.. ఆ రోజు నుంచే..

కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు... ప్రత్యేకించి మెడికల్‌ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణా భివృద్ధి, పశువైద్యశాలలు, యువజన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు జిల్లాను యూని ట్‌గా తీసుకొని కేటాయింపులు చేస్తుంది. నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే... కొత్త జిల్లాలకు అదనపు నిధులు, మౌలిక సదుపాయాలకు హోం, డిజాస్టర్‌ శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చుకునే అవకాశం వుంటుంది. ఇంత ప్రయోజన కరమైన కొత్త జిల్లాల ఏర్పాటు ఎంత తొందరగా సాకారం అయితే అంతమంచిది. ‘ఆలస్యం అమృతం విషం!’ అందుకే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోనే ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై దృష్టి సారించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు మరింత సమర్థవంతంగా, వేగంగా చేర్చడానికి వీలుండటమే కాక అభివృద్ధి ఊపందుకుంటుంది.
                                                                             - ఇనగంటి రవికుమార్‌, వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Published date : 01 Apr 2022 06:57PM

Photo Stories