AP New Districts List 2022 : జిల్లాల సమగ్ర సమాచారం మీకోసం..ఏ జిల్లా పరిధిలో మీరు ఉన్నారంటే..?
దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులందరికీ పంపి ఆ తర్వాత ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఈ ప్రతిపాదనలకు 13 జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలిపారు. రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసులను జిల్లా కలెక్టర్లకు పంపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ప్రసాద్ ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ ప్రతిపాదనలకు కలెక్టర్లందరూ ఆమోదం తెలిపారు. ఇంకా ఏవైనా అంశాలుంటే తుది నోటిఫికేషన్ ఇచ్చేలోగా తెలియచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. 1974 ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
మరో కీలక అడుగు ముందుకు..
పరిపాలనా సౌలభ్యం.. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సహా పలు సంస్కరణలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక అడుగు ముందుకేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ పునర్‌వ్యవస్థీకరణకు నడుం బిగించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో గతంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసుల మేరకు 26 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అంటే ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈలోపే పునర్‌వ్యవస్థీకరణ పూర్తి..
పాలనా సౌలభ్యం, సత్వర సేవల కోసం లోక్‌సభ నియోజక వర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని గతంలో ప్రణాళిక సంఘం సిఫార్సు చేసింది. ఇదే ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించాయి. తెలంగాణ రాష్ట్రం కూడా జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సుదీర్ఘ కసరత్తు చేసింది. ఈలోపు 2021 జనాభా గణన అంశం ముందుకు రావడంతో కొంత ఆలస్యమైంది. కరోనా వల్ల ఇప్పటికీ జనాభా గణన ప్రారంభం కాలేదు. అది ప్రారంభమయ్యేలోగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇలా..
☞ ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తేవాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. సగటున 18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
☞ శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోపాటు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేయాలి.
☞ ఎచ్చెర్ల మినహా విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని శృంగవరపు కోట శాసనసభ స్థానాన్ని కలిపి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయాలి.
☞ శృంగవరపు కోట మినహా విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని మిగతా ఆరు నియోజకవర్గాలతో విశాఖపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పెదగంట్యాడ మండలాన్ని విశాఖ జిల్లా పరిధిలోకి తేవాలి.
☞ అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేయాలి.
☞ అరకు లోక్‌సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించాలి. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లాను ఏర్పాటు చేయాలి. రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ నియోజకవర్గాలతో కలిపి పాడేరు కేంద్రంగా కొత్తగా అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలి. బ్రిటీషు సర్కార్‌కు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ఆ ప్రాంతం ఆ మహనీయుడి పేరుతోనే జిల్లా ఏర్పాటు కానుంది.
☞ అమలాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు.
☞ కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కాకినాడ జిల్లా ఏర్పాటు.
☞ రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు.
☞ ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో ఏలూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
☞ నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు.
☞ మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటు.
☞ విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు. ఇక్కడ జన్మించిన దివంగత ఎన్టీఆర్ అటు సినీ హీరోగా, ఇటు రాజకీయపార్టీ నేతగా చేసిన సేవలను స్మరించుకుంటూ విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
☞ గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కలిపి గుంటూరు జిల్లా ఏర్పాటు.
☞ బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు ఒంగోలుకు సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యం కోసం సంతనూతలపాడు మినహా బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు. భావ నారాయణస్వామి వెలిసిన బాపట్ల కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు భావపురిగా పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
☞ నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
☞ ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకర్గాలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు శాసనసభ స్థానాన్ని కలిపి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటు.
☞ తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరుకు సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లితో కలిపి నెల్లూరు కేంద్రంగా శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా ఏర్పాటు.
☞ సర్వేపల్లి శాసనసభ స్థానం మినహా తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
☞ చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం పోనూ చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ స్థానాలకు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పుంగనూరును చేర్చి చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు.
☞ పుంగనూరు శాసనసభ నియోజకవర్గంపోనూ రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని తన పాటతో సేవించిన వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను స్మరించుకుంటూ రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
☞ కడప లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కడప కేంద్రంగా వైఎస్సార్ జిల్లా ఏర్పాటు.
☞ నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గం కర్నూలుకు సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు పాణ్యం శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి కర్నూలు జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
☞ పాణ్యం మినహా నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో నంద్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
☞ హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం అనంతపురానికి సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలకు రాప్తాడు శాసనసభ స్థానాన్ని కలిపి అనంతపురం జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
☞ రాప్తాడు మినహా హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు. శ్రీసత్యసాయిబాబా సేవలను స్మరించుకుంటూ పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
11 జిల్లాలు ఆంగ్లేయుల హయాంలోనే..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిలాల్లో 11 ఆంగ్లేయుల హయాంలో ఏర్పాటైనవే. స్వాతంత్య్రం వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో ఒంగోలు కేంద్రంగా 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం కేంద్రంగా 1979 జూన్ 1న చివరిగా విజయనగరం జిల్లా ఏర్పాటైంది.
రెవెన్యూ డివిజన్లూ పునర్ వ్యవస్థీకరణ..
రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా పది నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
➤ అరకు లోక్‌సభ స్థానం రెండు జిల్లాలుగా విభజన
➤ పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా
➤ రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి
➤ అమలాపురం కేంద్రంగా కోనసీమ..
➤ భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి
➤ విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా
➤ మచిలీపట్నం కేంద్రంగా మచిలీపట్నం
➤ తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా
➤ పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా
అతి పెద్ద జిల్లా ప్రకాశం..అతి చిన్న జిల్లాగా..
రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునరి్వభజించింది. పునర్వ్యస్థీకరణ తర్వాత 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకాశం అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్నం అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంది. రెండు గిరిజన జిల్లాలు అల్లూరి, మన్యం.. ఏర్పాటు కానున్నాయి. అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి.
రెండు పార్లమెంటు స్థానాల్లో విస్తరించిన మండలాలు..
☛ రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాలు 5 ఉన్నాయి.
☛ అనంతపురం రూరల్ మండలం అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంది.
☛ విజయనగరం జిల్లా జామి మండలం విశాఖపట్నం, విజయనగరం లోక్‌సభ స్థానాల్లో ఉంది.
☛ విజయవాడ రూరల్ మండలం మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ స్థానాల్లో ఉంది.
☛ తిరుపతి రూరల్ మండలం చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాల పరిధిలో ఉంది.
☛ పెదగంట్యాండ మండలం అనకాపల్లి, విశాఖ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంది.
☛ ఈ మండలాలను ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానం ఉన్న జిల్లా పరిధిలోనే ఉంచనున్నారు. దీని ప్రకారం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లాలో, జామి మండలం విజయనగరంలో, విజయవాడ రూరల్ విజయవాడలో, తిరుపతి రూరల్ మండలం తిరుపతిలో, పెదగంట్యాడ విశాఖ జిల్లాలో ఉంటాయి. దీంతో ఏ మండలమూ రెండు జిల్లాల పరిధిలో ఉండదు.
పునర్విభజన తర్వాత జిల్లాలు ఇలా ఉంటాయి..
1. శ్రీకాకుళం జిల్లా
జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు : 2 (టెక్కలి, శ్రీకాకుళం)
మండలాలు : 30
విస్తీర్ణం : 4,592 చ.కి.మీ.
జనాభా : 21.91 లక్షలు
2. విజయనగరం
జిల్లా కేంద్రం : విజయనగరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం)
రెవెన్యూ డివిజన్లు : 2 (విజయనగరం, బొబ్బిలి (కొత్త))
మండలాలు : 26
విస్తీర్ణం : 3,846 చ.కి.మీ.
జనాభా : 18.84 లక్షలు
3. విశాఖపట్నం
జిల్లా కేంద్రం : విశాఖపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు : 2 ( భీమిలి (కొత్త), విశాఖపట్నం)
మండలాలు : 10
విస్తీర్ణం : 928 చ.కి.మీ.
జనాభా : 18.13 లక్షలు
4. అనకాపల్లి
జిల్లా కేంద్రం : అనకాపల్లి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం)
రెవెన్యూ డివిజన్లు : 2 (అనకాపల్లి, నర్సీపట్నం)
మండలాలు : 25
విస్తీర్ణం : 4,412 చ.కి.మీ.
జనాభా : 18.73 లక్షలు
5. కాకినాడ
జిల్లా కేంద్రం : కాకినాడ
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం,
కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం)
రెవెన్యూ డివిజన్లు : 2 (పెద్దాపురం, కాకినాడ)
మండలాలు : 19
విస్తీర్ణం : 2,605 చ.కి.మీ.
జనాభా : 19.37 లక్షలు
6. కోనసీమ జిల్లా
జిల్లా కేంద్రం : అమలాపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం)
రెవెన్యూ డివిజన్లు : 2 (అమలాపురం, రామచంద్రాపురం)
మండలాలు : 24
విస్తీర్ణం : 2,615 చ.కి.మీ.
జనాభా : 18.73 లక్షలు
7. తూర్పు గోదావరి
జిల్లా కేంద్రం : రాజమహేంద్రవరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు : 2 (రాజమహేంద్రవరం, కొవ్వూరు)
మండలాలు : 20
విస్తీర్ణం : 2,709 చ. కి.మీ.
జనాభా : 19.03 లక్షలు
8. పశ్చిమ గోదావరి
జిల్లా కేంద్రం : భీమవరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు : 2 (నర్సాపురం, భీమవరం(కొత్త))
మండలాలు : 19
విస్తీర్ణం : 2,178 చ.కి.మీ.
జనాభా : 17.80 లక్షలు
9. ఏలూరు
జిల్లా కేంద్రం : ఏలూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి)
రెవెన్యూ డివిజన్లు : 3 (ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం)
మండలాలు : 27
విస్తీర్ణం: 6,413 చ.కి.మీ.
జనాభా: 20.03 లక్షలు
10. మచిలీపట్నం
జిల్లా కేంద్రం : మచిలీపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు)
రెవెన్యూ డివిజన్లు : 2 (గుడివాడ, మచిలీపట్నం)
మండలాలు : 25
విస్తీర్ణం : 3,775 చ.కి.మీ.
జనాభా : 17.35 లక్షలు
11. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా
జిల్లా కేంద్రం : విజయవాడ
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్,
విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం)
రెవెన్యూ డివిజన్లు : 3 (నందిగామ (కొత్త), తిరువూరు (కొత్త), విజయవాడ)
మండలాలు : 20
విస్తీర్ణం : 3,316 చ.కి.మీ.
జనాభా : 22.19 లక్షలు
12. గుంటూరు
జిల్లా కేంద్రం : గుంటూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు)
రెవెన్యూ డివిజన్లు : 2 (గుంటూరు, తెనాలి)
మండలాలు : 18
విస్తీర్ణం : 2,443 చ.కి.మీ.
జనాభా : 20.91 లక్షలు
13. పల్నాడు జిల్లా
జిల్లా కేంద్రం : నరసరావుపేట
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)
రెవెన్యూ డివిజన్లు : 2 (గురజాల, నరసరావుపేట)
మండలాలు : 28
విస్తీర్ణం: 7,298 చ.కి.మీ.
జనాభా : 20.42 లక్షలు
14. బాపట్ల జిల్లా
జిల్లా కేంద్రం : బాపట్ల
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు,
అద్దంకి, చీరాల)
రెవెన్యూ డివిజన్లు : 2 (బాపట్ల (కొత్త), చీరాల(కొత్త))
మండలాలు : 25
విస్తీర్ణం : 3,829 చ.కి.మీ.
జనాభా : 15.87 లక్షలు
15. ప్రకాశం జిల్లా
జిల్లా కేంద్రం : ఒంగోలు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం)
రెవెన్యూ డివిజన్లు : 3 (మార్కాపురం, ఒంగోలు, పొదిలి (కొత్త))
మండలాలు : 38
విస్తీర్ణం : 14,322 చ.కి.మీ.
జనాభా : 22.88 లక్షలు
16. నంద్యాల
జిల్లా కేంద్రం : నంద్యాల
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానిపల్లె,
డోన్, నందికొట్కూర్, శ్రీశైలం)
రెవెన్యూ డివిజన్లు : 3 (నంద్యాల, డోన్(కొత్త), ఆత్మకూరు(కొత్త))
మండలాలు : 27
విస్తీర్ణం : 9,155 చ.కి.మీ.
జనాభా : 16.87 లక్షలు
17. కర్నూలు
జిల్లా కేంద్రం : కర్నూలు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ)
రెవెన్యూ డివిజన్లు : 2 (కర్నూలు, ఆదోని)
మండలాలు : 28
విస్తీర్ణం : 8,507 చ.కి.మీ.
జనాభా : 23.66 లక్షలు
18. అనంతపురం
జిల్లా కేంద్రం : అనంతపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి)
రెవెన్యూ డివిజన్లు : 3 ( కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్)
మండలాలు : 34
విస్తీర్ణం : 11,359 చ.కి.మీ.
జనాభా : 23.59 లక్షలు
19. శ్రీ సత్యసాయి జిల్లా
జిల్లా కేంద్రం : పుట్టపర్తి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (మడకశిర, హిందూపురం, పెనుకొండ,
పుట్టపర్తి, కదిరి, ధర్మవరం)
రెవెన్యూ డివిజన్లు : 3 (ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి (కొత్త))
మండలాలు : 29
విస్తీర్ణం : 7,771 చ.కి.మీ.
జనాభా : 17.22 లక్షలు
20. వైఎస్సార్ జిల్లా
జిల్లా కేంద్రం : కడప
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు)
రెవెన్యూ డివిజన్లు : 3 (కడప, జమ్మలమడుగు, బద్వేల్)
మండలాలు : 34
విస్తీర్ణం : 10,723 చ.కి.మీ.
జనాభా : 19.90 లక్షలు
21. ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు
జిల్లా కేంద్రం : నెల్లూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు)
రెవెన్యూ డివిజన్లు : 3 (కావలి, నెల్లూరు, ఆత్మకూరు)
మండలాలు : 35
విస్తీర్ణం : 9,141 చ.కి.మీ.
జనాభా : 23.37 లక్షలు
22. బాలాజీ జిల్లా
జిల్లా కేంద్రం : తిరుపతి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి,
తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు)
రెవెన్యూ డివిజన్లు : 3 (గూడూరు, తిరుపతి, నాయుడుపేట)
మండలాలు : 35
విస్తీర్ణం : 9,176 చ.కి.మీ.
జనాభా : 22.18 లక్షలు
23. అన్నమయ్య జిల్లా
జిల్లా కేంద్రం : రాయచోటి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి,
తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు)
రెవెన్యూ డివిజన్లు : 3 (మదనపల్లె, రాజంపేట, రాయచోటి (కొత్త))
మండలాలు : 32
విస్తీర్ణం : 8,459 చ.కి.మీ.
జనాభా : 17.68 లక్షలు
24. చిత్తూరు
జిల్లా కేంద్రం : చిత్తూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు)
రెవెన్యూ డివిజన్లు : 2 (చిత్తూరు, పలమనేరు (కొత్త))
మండలాలు : 33
విస్తీర్ణం : 7,210 చ.కి.మీ.
జనాభా : 19.85 లక్షలు
25. మన్యం జిల్లా
జిల్లా కేంద్రం : పార్వతీపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం)
రెవెన్యూ డివిజన్లు : 2 (పాలకొండ, పార్వతీపురం)
మండలాలు : 16
విస్తీర్ణం : 3,935 చ.కి.మీ.
జనాభా : 9.72 లక్షలు
26. అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా కేంద్రం : పాడేరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు : 2 (పాడేరు, రంపచోడవరం)
మండలాలు : 22
విస్తీర్ణం : 12,251 చ.కి.మీ.
జనాభా : 9.54 లక్షలు
AP New Revenue Divisions: 63కు చేరిన రెవెన్యూ డివిజన్లు.. కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే..