Skip to main content

Andhra Pradesh: నూతన జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు

CM Jagan

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతన జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9:05 నుంచి 9:45 గంటల మధ్య 13 కొత్త జిల్లాల అవతరణ ముహూర్తానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కొత్త జిల్లాల కార్యకలాపాలను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్న వలంటీర్లకు సత్కారాన్ని ఏప్రిల్‌ 6వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 8వ తేదీన వసతి దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నూతన జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిపాలనా సముదాయాల నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఏర్పాటు చేయాలని, క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలని,  పది కాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకున్న జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా..
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమావేశంలో సీఎస్,  ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే కలెక్టర్లు సిఫార్సులు చేశారని చెప్పారు. సిబ్బంది విభజన, పోస్టింగుల్లో ఆరు సూత్రాల ఫార్ములా తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారు చేశామని వెల్లడించారు. కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సరి చూసుకునేందుకు చెక్‌లిస్టు కూడా రూపొందించినట్లు చెప్పారు. 

AP Agriculture Budget 2022 Highlights: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్‌ 2022–23

సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు..
నూతన వెబ్‌సైట్లు,  యంత్రాంగానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు పూర్తయినట్లు వివరించారు. కొత్త జిల్లాల సమాచారంతో హ్యాండ్‌ బుక్స్‌ కూడా సిద్ధం చేశామన్నారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారు చేశామని,  ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట్ల ప్రైవేట్‌ భవనాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నట్లు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ జి. సాయిప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ప్రణాళిక శాఖ కార్యదర్శి వి.విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 31 Mar 2022 11:26AM

Photo Stories