Skip to main content

2018–19 భారత ఆర్థిక సర్వే– కీలకాంశాలు

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల్లో భారత ఆర్థిక వ్యవస్థ సంబంధిత అంశాలు చాలా ముఖ్యమైనవి.

కేంద్ర బడ్జెట్‌తో పాటు ఆర్థిక సర్వే (2018–19)లోని కీలక అంశాల నుంచి పరీక్షల్లో ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఈ నేపథ్యంలో వివిధ అంశాలకు సంబంధించి ముఖ్య సమాచారం అందిస్తున్నాం. వీటిని అధ్యయనం చేయడం వల్ల పరీక్షల్లో ప్రశ్న ఏ రూపంలో వచ్చినా సరైన సమాధానం గుర్తించేందుకు అవకాశముంటుంది.

వ్యవసాయ మార్కెటింగ్, రైతు స్నేహపూర్వక సంస్కరణల సూచీ:
ఈ సూచీని నీతి ఆయోగ్‌ 2016లో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమూనా ఏపీఎంసీ చట్టంలో ప్రతిపాదించిన ఏడు అంశాల అమలుకు సంబంధించి ర్యాంకులు ఇచ్చేందుకు దీన్ని రూపొందించింది. ఈ సూచీలో స్కోరు కనిష్ట విలువ సున్నా. గరిష్ట విలువ 100 (ఎంపిక చేసిన అంశాల్లో పూర్తిగా సంస్కరణలను అమలుచేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు). ఈ సూచీలో మహారాష్ట్ర ప్రథమ స్థానం పొందింది.

బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత ఈ–మార్కెట్‌ ప్లేస్‌:
బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత ‘ఈ–మార్కెట్‌ ప్లేస్‌’ను కాఫీ బోర్డు ప్రారంభించింది. పారదర్శకతతో కాఫీ ఉత్పత్తిదారులను, మార్కెట్లతో అనుసంధానించి, వారికి సరైన ధరలు అందించేలా చేసేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తోంది.

సుస్థిర వ్యవసాయానికి జాతీయ మిషన్‌:
అధిక ఉత్పాదకత, సుస్థిర, లాభదాయక, వాతావరణ మార్పులను తట్టుకోగలిగేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడం ఈ మిషన్‌ లక్ష్యం.

ప్రపంచ ఆహార భద్రతా సూచీ:
ప్రపంచ ఆహార భద్రతా సూచీ (2018)ని ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ది ఎకనామిస్ట్‌) రూపొందించింది. అందుబాటు, లభ్యత, నాణ్యత, భద్రత, సహజ వనరులు తదితర ప్రాతిపదికల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 113 దేశాలకు సంబంధించి ఈ సూచీని విడుదల చేస్తున్నారు.

దేశంలో వ్యవసాయ కమతాల ప్రక్రియ:
2015–16లో మొత్తం ఆపరేషనల్‌ కమతాల్లో ఉపాంత కమతాల వాటా 68.5 శాతం. చిన్న కమతాలు 17.7 శాతం, పెద్ద కమతాలు 4.3 శాతం మేర ఉన్నాయి. 2000–01తో పోల్చితే 2015–16లో మొత్తం కమతాల్లో ఉపాంత కమతాల వాటాలో పెరుగుదల నమోదుకాగా.. చిన్న, పెద్ద కమతాల వాటా క్షీణించింది.

పారిశ్రామిక వృద్ధి తగ్గడానికి కారణాలు:
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆధారంగా 2018–19లో భారత పారిశ్రామికవృద్ధి రేటు 3.6 శాతంగా ఉండటానికి కారణాలు: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పరపతి ప్రవాహం తగ్గుదల; ద్రవ్యత్వం కొరత వల్ల బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందించే రుణం తగ్గుదల; అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో అనిశ్చితి; ఆటోమొబైల్‌ రంగం, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు–పరికరాలు వంటి కీలక ఉత్పత్తులకు సంబంధించి స్వదేశీ డిమాండ్‌ తగ్గుదల.

కీలక అవస్థాపనా పరిశ్రమల్లో వృద్ధి:
2018–19లో ఎనిమిది కీలక అవస్థాపనా పరిశ్రమల్లో వృద్ధి 4.3 శాతంగా నమోదైంది. సిమెంట్‌ పరిశ్రమలో అధిక వృద్ధి నమోదుకాగా, తర్వాతి స్థానంలో బొగ్గు నిలిచింది. ముడి చమురు ఉత్పత్తిలో వృద్ధి రుణాత్మకంగా నమోదైంది.

పారిశ్రామిక రంగ స్థూల మూలధన కల్పనలో వృద్ధి:
2016–17లో పారిశ్రామిక రంగ స్థూల మూలధన కల్పనలో వృద్ధి రుణాత్మకం కాగా, 2017–18లో 7.6 శాతంగా నమోదైంది. స్థూల మూలధన కల్పనలో వృద్ధి అధికంగా నిర్మాణరంగంలో నమోదుకాగా, తర్వాతి స్థానంలో తయారీ రంగం నిలిచింది.

దేశంలో స్టార్టప్‌లకు ప్రాధాన్యం:
ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, నవకల్పనలకు స్టార్టప్‌లు దోహదపడతాయి. గుర్తింపు పొందిన స్టార్టప్‌ల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నిలిచాయి. గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్యలో మహారాష్ట్ర వాటా 18.91 శాతం. ఐటీ సర్వీసుల్లో నిమగ్నమైన స్టార్టప్‌లు ఎక్కువ కాగా, తర్వాతి స్థానాల్లో ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌ సైన్సెస్‌; విద్య, వృత్తి, వాణిజ్య సేవలకు సంబంధించిన స్టార్టప్‌లు ఉన్నాయి.

ఎస్‌డీజీ భారత్‌ సూచీ:
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనలో భారత్‌ ప్రగతిని అంచనా వేసేందుకు నీతి ఆయోగ్‌ ఈ సూచీని అభివృద్ధి చేసింది. ఈ సూచీ స్కోరు కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు 65 కంటే ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 50 కంటే ఎక్కువ స్కోరును సాధించాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం 50 కంటే తక్కువ స్కోరుకు పరిమితమయ్యాయి. 65 కంటే ఎక్కువ స్కోరు ఉన్న రాష్ట్రాలను ముందు వరుస రాష్ట్రాలుగా వర్గీకరించారు. 50 కంటే అధిక స్కోరు కలిగిన రాష్ట్రాలను పెర్‌ఫార్మర్, 50 కంటే తక్కువ స్కోరు ఉన్నవాటిని యాస్పిరెంట్‌ కేటగిరీ రాష్ట్రాలుగా విభజించారు.

భారత్‌లో నిరుద్యోగిత రేటు:
దేశంలో సాధారణ స్థితి ఆధారంగా నిరుద్యోగిత రేటు 2017–18లో 6.1 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం, పట్టణాల్లో 7.8 శాతం నిరుద్యోగం ఉంది. వారంవారీ స్థితి ఆధారంగా నిరుద్యోగిత రేటు 2017–18లో 8.9 శాతం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 8.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 9.6 శాతంగా నమోదైంది.

శ్రామిక జనాభా నిష్పత్తి:
నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) అంచనాల ప్రకారం 2017–18లో దేశంలో శ్రామిక జనాభా నిష్పత్తి 34.7 శాతం.

శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు:
నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) అంచనాల ప్రకారం సాధారణ స్థితి ఆధారంగా శ్రామికశక్తి భాగస్వామ్య రేటు 2017–18లో 36.9 శాతంగా నమోదైంది.

దేశంలో ఆరోగ్య సూచికల ప్రగతి:
1. ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష జననాలకు 2011–13లో 167 కాగా, ఇది 2014–16 నాటికి 130కు తగ్గింది.
2.1990–2015 మధ్యకాలంలో ప్రసూతి మరణాల రేటులో తగ్గుదల 77 శాతం.
3.శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌–2016 ప్రకారం అయిదేళ్లలోపు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 39. శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 34.

సమగ్ర శిక్షా కార్యక్రమం:
కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ), ఉపాధ్యాయ విద్యలను విలీనం చేసింది.

ఆచరణ/ప్రదర్శన గ్రేడింగ్‌ సూచీ (2017–18):
ఈ సూచీకి సంబంధించి గరిష్ట స్కోరు 360. 279 స్కోరు సాధించి ఈ సూచీలో గుజరాత్‌ తొలిస్థానంలో నిలిచింది. ఉపాధ్యాయులు, పాలనా సిబ్బంది, ఉపాధ్యాయ శిక్షణ తదితర ప్రాతిపదికల ఆధారంగా సూచీని రూపొందించారు.

శిక్షణా నైపుణ్యత పథకాలు:
ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (2015), ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్ర (2015), నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ (2016), సంకల్ప్‌ (2017), స్ట్రైవ్‌ (2017).

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌):
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 2019, మార్చి 31 నాటికి అన్ని మౌలిక వసతులతో కోటి పక్కా గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనికింద 2014–19 మధ్యకాలంలో 1.54 కోట్ల గృహాల నిర్మాణం పూర్తయింది. ఈ మొత్తంలో ఇందిరా ఆవాస్‌ యోజన కింద చేపట్టిన గృహాలు కూడా ఉన్నాయి.

స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌):
ప్రాథమిక విద్యలో 93.55 శాతం, మాధ్యమిక విద్యలో 79.35 శాతం, ఉన్నతవిద్యలో 25.8 శాతం జీఈఆర్‌ నమోదైంది.

వాణిజ్య సేవల ఎగుమతులు:
2017లో వాణిజ్య సేవల ఎగుమతుల్లో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. బ్రిటన్, జర్మనీ వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించాయి. వాణిజ్య సేవల ఎగుమతుల్లో భారత్‌ 8వ స్థానంలో నిలిచింది.

వాణిజ్య సేవల దిగుమతులు:
2017లో వాణిజ్య సేవల దిగుమతుల్లో అమెరికా, చైనా, జర్మనీ మొదటి మూడు స్థానాలు పొందగా భారత్‌ పదో స్థానంలో నిలిచింది.

భారత ప్రధాన ఎగుమతులు, దిగుమతులు:
1. పెట్రోలియం ఉత్పత్తులు భారత్‌ ప్రధాన ఎగుమతి కాగా, తర్వాతి స్థానాల్లో విలువైన రాళ్లు, ఔషధ ఫార్ములేషన్స్, బంగారం, ఇతర విలువైన లోహాలు నిలిచాయి.
2.ముడి చమురు భారత్‌కు సంబంధించి ప్రధాన దిగుమతి కాగా తర్వాతి స్థానాల్లో ముత్యాలు, పాక్షిక విలువైన రాళ్లు, బంగారం నిలిచాయి.

భారత ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన కేంద్రాలు:
భారత్‌ ఎగుమతులకు ప్రధాన కేంద్రం అమెరికా కాగా, తర్వాతి స్థానాల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, చైనా, హాంకాంగ్‌ నిలిచాయి. విలువ పరంగా భారత్‌ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 16 శాతం. భారత్‌ ఎగుమతుల వృద్ధిని వివిధ దేశాల పరంగా పరిశీలిస్తే నెదర్లాండ్స్‌ ప్రథమ స్థానంలో, తర్వాతి స్థానాల్లో చైనా, నేపాల్‌ నిలిచాయి.

భారత్‌ దిగుమతులు:
2018–19లో భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా 13.7 శాతం. భారత్‌ దిగుమతుల్లో చైనా ప్రథమస్థానం పొందగా తర్వాతి స్థానాల్లో అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా నిలిచాయి.

ప్రపంచ వాణిజ్య వృద్ధి క్షీణతకు కారణాలు:
అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అల్ప ప్రపంచ వృద్ధిరేటు, విత్త మార్కెట్లో ఆటుపోట్లు, నూతన దిగుమతి సుంకానికి సంబంధించిన చర్యలు.

భారత్‌–లాజిస్టిక్‌ రంగం:
ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్‌ రంగ ప్రగతి సూచీ (2016)లో భారత్‌ 35వ స్థానంలో నిలిచింది. 2018లో 44వ స్థానం పొందింది. ఈ రంగం దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిశ్రమ విలువను 215 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. గత అయిదేళ్ల కాలంలో లాజిస్టిక్‌ పరిశ్రమ సగటు వార్షిక వృద్ధి 7.8 శాతం.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు:
1. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య వాణిజ్య ఒప్పందం ఉండగా, ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి.
2.భారత్, ఇరాన్‌ మధ్య ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి.
3. భారత్‌–నేపాల్‌ మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి.
4. భారత్‌–శ్రీలంక మధ్య నూతన ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి.

ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు:
1. 2017–18లో ద్రవ్యలోటు 3.5 శాతం, 2018–19లో 3.4 శాతం.
2. రెవెన్యూ లోటు 2017–18లో 2.6 శాతం, 2018–19లో 2.3 శాతం.
3.ప్రాథమిక లోటు 2017–18లో 0.4 శాతం, 2018–19లో 0.3 శాతం.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు–జీఎస్‌డీపీ:
చండీఘర్, ఢిల్లీల జీఎస్‌డీపీలో సేవారంగం వాటా అత్యధికంగా 80 శాతం కంటే ఎక్కువగా ఉంది. సిక్కిం జీఎస్‌డీపీలో సేవారంగం వాటా అతి తక్కువగా 30.2 శాతంగా నమోదైంది. జీఎస్‌డీపీలో సేవారంగం వాటా కర్ణాటకలో 65.9 శాతం, తెలంగాణలో 63.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 42.7 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

గుర్తుంచుకోండి
తలసరి ఆదాయం:
ప్రజల జీవన ప్రమాణాలకు తలసరి ఆదాయం ఓ సూచిక. ముందస్తు అంచనాల ప్రకారం 2018–19లో వర్తమాన ధరల వద్ద ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం (ఎన్‌ఎస్‌డీపీ) రూ.1,64,025. ఇది తొలి సవరించిన అంచనాల మేరకు 2017–18లో రూ.1,43,935.
స్థిర (2011–12) ధరల వద్ద ముందస్తు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం (ఎన్‌ఎస్‌డీపీ) 2018–19లో రూ.1,17,261. ఇది తొలి సవరించిన అంచనాల మేరకు 2017–18లో రూ.1,06,864.

ప్రజా పంపిణీ:
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామం, పట్టణంలో సరకులను గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు అందించాలని నిర్ణయించింది. 2019, మార్చి నాటికి రాష్ట్రంలో 28,510 చౌక ధరల (ఎఫ్‌పీ) దుకాణాలు పనిచేస్తున్నాయి.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్‌
Published date : 28 Aug 2019 01:33PM

Photo Stories