ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం– 2019.. ముఖ్యాంశాలు..!
బాధితులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం దొరకని సందర్భాలు కోకొల్లలు. వీటన్నింటి దృష్ట్యా న్యాయ విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని, నేరానికి పాల్పడ్డ వ్యక్తులకు సత్వర శిక్షను అమలు చేసే ఉద్ధేశ్యంతో రూపొందించిందే దిశ యాక్ట్– 2019 .
ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే...?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ డిసెంబర్ 13, 2019 (శుక్రవారం) ఆమోదించింది. డిసెంబర్ 16న శాసన మండలిలో దిశ బిల్లును ఆమోదించి. 2020 జనవరి 2న చట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంపడం జరిగింది.రాష్ట్రపతి ఆమోదముద్రవేస్తే ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్), ఆంధ్రప్రదేశ్ స్పెషల్‌కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ వుమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019 అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష ఖాయం.
ఈ చట్టం ఎలా వచ్చిందంటే...?
తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ శివార్లలో 2019, నవంబరు 27న జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్, హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. దిశ దుర్ఘటన వంటి నేరాలు మునుముందు జరగకూడదని, నేరం చేస్తే కఠిన శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని, మహిళలపై, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని, బాధితులకు సత్వర న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతో వచ్చిందీ చట్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం.
ఏపీ దిశ చట్టం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యాంశాలు:
- కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు, మరణదండన శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ చట్టం దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తికావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21 రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడుతుంది. ఈ చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా జీరో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
- 18 ఏళ్ల లోపు బాల బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్ 14న కేంద్రం పోక్సో యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫ్‌న్సెస్ యాక్ట్ – పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది. జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవుతుంది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది.
- లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు.
- మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం–2012, పోక్సో చట్టం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)–1860, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(సీపీసీ)–1973లను ఉపయోగిస్తారు.
- ఐపీసీ సెక్షన్ 326ఎ, 326బి, 354, 354ఎ, 354బి, 354సి, 354డి, 354జీ, 376, 376ఎ, 376బి, 376ఎబి, 376సి, 376డి, 376డిఎ, 376డిబి,376ఈ, 509లతో పాటు పోక్సో యాక్ట్, కేంద్ర చట్టాల్లోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు.
- సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. అందుకు ప్రత్యేకంగా ఇండియన్ పీనల్ కోడ్‌లో అదనంగా 354(ఇ), 354 (ఎఫ్) అనే కొత్త సెక్షన్లను చేర్చారు.
1. ఇండియన్ పీనల్ కోడ్ 354(ఇ)
మెయిల్స్, సోషల్‌మీడియా, డిజిటల్ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష
2. ఇండియన్ పీనల్ కోడ్ 354 (ఎఫ్)
పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే పదేళ్ల నుంచి నుంచి 14 ఏళ్ల వరకూ శిక్ష. నేరం తీవ్రతను బట్టి 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధిస్తారు. పోస్కో చట్టం కింద ఇంతవరకూ 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష అమలౌతుంది.
- ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్దిరాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. కాని, దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా 13జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కోర్టుకూ ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ స్పెషల్ పోలీస్ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, సోషల్‌మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి వస్తాయి. నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా లేదా స్పష్టమైన ఆధారాలున్నా తక్షణమే మరణశిక్ష విధించేలా చట్టం చేశారు. అందుకనుగుణంగా సెక్షన్ 376 (రేప్)కి సవరణ చేశారు. జడ్జిమెంట్ పీరియడ్‌ను కూడా 4 నెలల నుంచి 21 రోజులకు కుదించి, విచారణ 7 రోజుల్లో, ట్రయల్ 14 రోజుల్లో పూర్తి చేసి 21 రోజుల్లో నిందితులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటారు. క్రిమినల్ ప్రొసీజరల్ యాక్ట్ 173, 309కి మార్పులు చేశారు. చిన్నారుల మీద దాడులు, లైంగిక వేధింపుల విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ చేశారు. పోస్కో యాక్టు ప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. దానిని కూడా మార్చి జీవితఖైదు విధించేలా చట్టం చేయడం జరిగింది.
- ఇక ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరు నెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 3 నెలలకు తగ్గించారు.
- మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్ పద్దతిలో డేటా బేస్ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరగాడు, ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాని, అటువంటి డిజిటిల్ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.
దిశ మొబైల్ యాప్
మహిళా భద్రత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్ జస్టిస్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణ పోలీసు సహాయం పొందేందుకు ‘దిశ మొబైల్ అప్లికేషన్’ను ప్లే స్టోర్‌లో అందుబాటలోకి తెచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను ఫిబ్రవరి 8, 2021న అధికారికంగా ప్రారంభించించారు.
ఎందుకు?
విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఫోన్ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి ఏమిటి? ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఏపీ ప్రభుత్వం ‘దిశ’ యాప్‌ను ప్రారంభించింది
డౌన్ లోడ్.. ఉపయోగించడం ఇలా..
- ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- యాప్‌లోఎస్‌వోఎస్ బటన్ ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్ చేసి, అందులో ఉన్న ఎస్‌వోఎస్ (పుష్ బటన్ మెస్సేజ్ ఆప్షన్) బటన్ నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ఆ వెంటనే కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ఈ ఆప్షన్ ద్వార పోలీసులు యాప్ వినియోగదారులకు ఏకకాలంలో సూచనలు, సలహాలు అందించి, వారిని జరగబోయే ప్రమాదాల గురించి అప్రమత్తం చేస్తారు. పోలీసులతోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు ఉంటుంది.
- విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్ వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది.
- ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఏర్పటు
- తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్
- ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, వారి బంధువులకు చేరవేసే రక్షణ కల్పించే వెసులుబాటు
- దిశ యాప్‌లో డయల్ 100. 112 నంబర్లతోపాటు పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఈ యాప్‌లో ఉంటాయి.
ఇతర దేశాల్లో శిక్షలు ఇలా..
- చైనా: అత్యాచార నిందితుల్ని నేరుగా ఉరికంబం ఎక్కిస్తారు. కొన్ని కేసుల్లో దోషుల పురుషాంగాన్ని తొలగించి నపుంసకులుగా కూడా మారుస్తారు. ఇదంతా నేరం జరిగిన రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా ఉరిశిక్ష విధించడం విమర్శలకు దారితీసిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఉరి తీశాక వారు నిర్ధోషులని తేలడం గమనార్హం.
- ఇరాన్: అత్యాచార దోషుల్ని కాల్చి చంపుతారు. లేదంటే ఉరితీస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితురాలు క్షమించడానికి అంగీకరిస్తే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
- ఆష్గానిస్తాన్: రేపిస్టులకు శిక్ష పడిన నాలుగు రోజుల్లోనే ఉరి తియ్యడమో, లేదంటే కాల్చి చంపడమో చేస్తారు.
- యూఏఈ: రేప్ చేసిన ఏడు రోజుల్లో ఉరికంబం ఎక్కిస్తారు.
- సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అత్యాచార నేరం రుజువైతే బహిరంగంగా తలనరికి చంపుతారు.
- నెదర్లాండ్స్: మహిళలపై జరిగే లైంగిక వేధింపులన్నింటినీ అత్యాచారం కిందే పరిగణిస్తారు. అమ్మాయి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా అక్కడ నేరుగా జైలుకి పంపిస్తారు. నేర తీవ్రత ఆధారంగా 4 నుంచి 5 సంవత్సరాలు శిక్ష ఉంటుంది.
- ఫ్రాన్స్: అత్యాచార చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అత్యాచార కేసుల్లో 15 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తారు. జైల్లో ఉన్నన్ని రోజులు వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. నేర తీవ్రతని బట్టి దానిని 30 ఏళ్లకు పెంచుతారు.
- అమెరికా: ఇక్కడ రెండు రకాల చట్టాలున్నాయి. ఒకటి కేంద్ర చట్టమైతే, రెండోది రాష్ట్రాలకు సంబంధించింది. ఫెడరల్ లా కింద అత్యాచార నేరం నిరూపణ అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఇక రాష్ట్ర పరిధిలో తీసుకుంటే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య శిక్షల్లో తేడాలుంటాయి.
జాతీయ నేర గణాంక నమోదు సంస్థ తాజా గణాంకాల ప్రకారం..
దేశం దశ దిశలా.. నలుమూలలా.. ప్రతిరోజూ మహిళల అక్రందనలు వినిపిస్తునే ఉన్నాయి. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ తాజాగా విడుదల చేసిన (2020, సెప్టెంబర్ 29) గణాంకాల ప్రకారం సగటున దేశవ్యాప్తంగా రోజుకు 87 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. 2012 నిర్భయ ఘటనకు ముందు 25 వేల కంటే తక్కువ, 2013లో 33,707, 2016లో 38,947 కేసులు నమోదు కాగా 6,289 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 2017లో 32,559, 2018లో 33,356, 2019లో 32,033 నమోదయ్యాయి. కానీ శిక్షలుపడ్డ దాఖలాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఈ కేసుల్ని విచారించడానికి కోర్టుల్లో తగిన సిబ్బంది లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య తడిసి మోపెడవుతోంది. ఇక అత్యాచార కేసుల్లో దోషులుగా తేలేవారి సంఖ్య కూడా అత్యంత స్వల్పంగా ఉంది. చాలా ఏళ్లపాటు 25 నుంచి 30 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ 2014లో మాత్రం శిక్షల రేటు 27 నుంచి 38 శాతానికి పెరిగింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని 2019 నాటికి దేశంలో 664 ఉంటే, అవి కూడా సరిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. మన దేశంలో ఉరి శిక్ష పడాలంటే కనీసం 5 ఏళ్లు పడుతుంది. ఎందుకంటే ప్రత్యేక కోర్టుల్లో శిక్ష పడితే పై కోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు.. అక్కడ శిక్ష ఖరారు చేసినీ అమలౌతుందన్న గ్యారెంటీ లేదు. మరణ శిక్ష పడిన దోషులకు రాష్ట్రపతిని క్షమాభిక్ష అడిగే హక్కు కూడా ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి కొన్ని కేసుల్లో ఉరిశిక్ష అమలుకే 20 ఏళ్లు దోషులు జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే సత్వర న్యాయం మన దేశంలో సాధ్య పడటం లేదు. 1991 నుంచి 2017 డిసెంబర్ చివరి నాటికి 371 మందికి ఉరిశిక్ష పడింది. కానీ గత 15 ఏళ్లలో ఎనిమిది మందికి (నిర్భయ దోషులతో సహా) మాత్రమే ఉరిశిక్ష అమలు జరిగిందంటే న్యాయం జరగడంలో ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతోంది.
ఈ పరిస్థితి మరాలంటే..
గర్భస్థ పిండాలుగా ఉన్నప్పటి నుంచి కడ శ్వాస వరకు మహిళలపై గౌరవ భావం కలిగేలా మన సమాజానికి అవగాహన పెంచాలి. కటుంబం, బడి, పనిప్రదేశం, బహిరంగ స్థలం.. ఇలా అన్ని చోట్ల, ప్రతి స్థాయిలో వివక్ష పోవాలి. మనిషి తప్ప సృష్టిలోమరే జీవి పాల్పడని అతి హీనమైన నేరం అత్యాచారం. అది సామూహికంగా జరిగి, ఘాతుకమైన హత్యతో ముడిపడటం భూమ్మీద అతిపెద్ద నేరం. దీనికి సమాజం నుంచే పరిష్కారం లభించాలి. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధాలుగా, అన్ని స్థాయిల్లో సమాజం సమాయత్తం కావాలి. ఇది సమష్టి బాధ్యత.