రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-పరిశీలన
Sakshi Education
రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం వ్యయంలో.. రెవెన్యూ వ్యయం 2011-19 మధ్య కాలంలో సగటున 85 శాతంగా, మూలధన వ్యయం 15 శాతంగానూ నమోదైంది. ఏడో ‘పే కమిషన్’ సిఫార్సులు, రైతు రుణమాఫీ పథకం అమలు కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది.
రాష్ట్రాల రాబడి కంటే..వ్యయంలో పెరుగుదల అధికంగా ఉంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ద్రవ్యలోటు సవరించిన అంచనాల ప్రకారం-2018-19 జీడీపీలో 2.9 శాతంగా నమోదైంది. 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. అయితే సెస్‌లు, సర్‌ఛార్జీల రూపేణా వచ్చే రాబడి మొత్తాన్ని కేంద్రం తన వద్దే ఉంచుకుంటూ.. డివిజబుల్ పూల్‌లో చేర్చకపోవడంతో..మొత్తం పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా పెరుగుదల స్తంభించింది.
పేద రాష్ట్రాల ప్రయోజనార్థం వివిధ అంశాల్లో ప్రగతి ఆధారంగా ప్రోత్సాహకాలు, రక్షణ, అంతర్గత భద్రతకు నిధులు అందించడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటును పరిశీలించడం వంటివి ముఖ్యాంశాలుగా 2020-25కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులుండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయ నాణ్యతను మెరుగుపర్చుకోవాలి. అధిక మూల ధన వ్యయంపై దృష్టిసారించాలి. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా పెంచడానికి ప్రయత్నించాలి. కేంద్ర పన్నుల రాబడిని రాష్ట్రాల మధ్య పంపిణీకి సంబంధించి 2011 జనాభా గణాంకాలను పరిగణలోకి తీసుకుంటున్నందువల్ల జనాభా నియంత్రణకు కృషిచేసిన రాష్ట్రాలు నష్టపోతాయి. ఆయా రాష్ట్రాలకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడంతోపాటు రెవెన్యూలోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు గ్రాంట్లను అందించడానికి ఆర్థిక సంఘం కృషిచేయాలి.
రాష్ట్రాల రాబడి, వ్యయ, లోటు ధోరణలు
పేద రాష్ట్రాల ప్రయోజనార్థం వివిధ అంశాల్లో ప్రగతి ఆధారంగా ప్రోత్సాహకాలు, రక్షణ, అంతర్గత భద్రతకు నిధులు అందించడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటును పరిశీలించడం వంటివి ముఖ్యాంశాలుగా 2020-25కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులుండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయ నాణ్యతను మెరుగుపర్చుకోవాలి. అధిక మూల ధన వ్యయంపై దృష్టిసారించాలి. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా పెంచడానికి ప్రయత్నించాలి. కేంద్ర పన్నుల రాబడిని రాష్ట్రాల మధ్య పంపిణీకి సంబంధించి 2011 జనాభా గణాంకాలను పరిగణలోకి తీసుకుంటున్నందువల్ల జనాభా నియంత్రణకు కృషిచేసిన రాష్ట్రాలు నష్టపోతాయి. ఆయా రాష్ట్రాలకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడంతోపాటు రెవెన్యూలోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు గ్రాంట్లను అందించడానికి ఆర్థిక సంఘం కృషిచేయాలి.
రాష్ట్రాల రాబడి, వ్యయ, లోటు ధోరణలు
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమష్టి రాబడి 2015-16లో రూ.22.99 లక్షల కోట్లు కాగా.. 2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం-రూ.37.63 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో వ్యయం రూ.23.01 లక్షల కోట్ల నుంచి రూ.37.68 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం అధికం .కాగా మూలధన వ్యయం తక్కువ. ఈ కాలంలో అభివృద్ధేతర వ్యయంతో పోల్చినప్పుడు అభివృద్ధి వ్యయంలో పెరుగుదల అధికం.
- రాబడి కన్నా వ్యయం అధికంగా ఉన్నందువల్ల ద్రవ్యలోటు పెరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ద్రవ్యలోటు సగటు 2006-11 మధ్య కాలంలో రూ.1.30 లక్షల కోట్లు. కాగా 2011-16 మధ్య కాలంలో రూ.2.74 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం-ద్రవ్యలోటు రూ.5.52 లక్షల కోట్లకు పెరిగింది. రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు 2017-18లో జీడీపీలో 2.4 శాతం కాగా 2018-19లో 2.9 శాతానికి పెరిగింది. ద్రవ్యలోటు పూడ్చుకునే క్రమంలో రాష్ట్రాలు మార్కెట్ రుణాలపై అధికంగా ఆధారపడ్డాయి. రాష్ట్రాలు సేకరించిన మొత్తం రుణంలో మార్కెట్ రుణం వాటా 2015-16లో 61.6 శాతం. కాగా, 2017-18లో 84 శాతానికి పెరిగింది. 2019-20 బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని 87.9 శాతంగా ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలు మొత్తం రాష్ట్రాల రుణంలో 2015-16లో 0.4 శాతం. కాగా 2017-18లో 1.1 శాతానికి పెరిగింది. మొత్తం రాష్ట్రాల రుణంలో కేంద్రం నుంచి రుణాలను 2019-20 బడ్జెట్‌లో 3.3 శాతంగా ప్రతిపాదించారు.
- రాష్ట్రాల రుణం 2013, మార్చి నాటికి జీడీపీలో 22.6 శాతం. కాగా 2019, మార్చి నాటికి సవరించిన అంచనాల ప్రకారం-24.8 శాతానికి పెరిగింది. రాష్ట్రాల మొత్తం రుణంలో అంతర్గత రుణం వాటా ఎక్కువ. అంతర్గత రుణం వాటా మార్చి 2015 నాటికి 70 శాతం. కాగా మార్చి 2019 నాటికి 73.3 శాతానికి పెరిగింది.
- రాష్ట్రాలపై ప్రభుత్వ విధాన బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో.. వృద్ధి, సాంఘిక శ్రేయస్సు సాధనలో రాష్ట్రాల పాత్ర ప్రధానమైనది. 2017-19 మధ్య కాలంలో రాష్ట్రాల మూల ధన వ్యయం జీడీపీలో 0.3 శాతం నుంచి 0.5 శాతం మాత్రమే పెరిగింది. దీర్ఘకాల వృద్ధి, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాలంటే.. రాష్ట్రాల మూలధన వ్యయంలో పెరుగుదల అవసరం.
- ప్రస్తుత బదిలీ విధాన ప్రక్రియ వల్ల దేశంలో పేద రాష్ట్రాలు ప్రయోజనం పొందలేకపోతున్నాయి. తద్వారా ఆయా రాష్ట్రాలు సామాజిక రంగంపై ఆశించిన స్థాయిలో ఖర్చు చేయలేకపోతున్నాయి. సామాజిక రంగంపై పెట్టుబడి మాన వాభివృద్ధికి దారితీయడం ద్వారా.. ఆయా రాష్ట్రాల్లో వనరుల అభిలషణీయ వినియోగానికి దారితీసి.. ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది. తద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగుతాయి.
- స్థూల కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా 13వ ఆర్థిక సంఘం కాలంతో పోల్చినప్పుడు తదుపరి కాలంలో తగ్గింది. రాష్ట్రాలకు నిధుల బదిలీకి కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా ప్రధాన ఆధారం. 14వ ఆర్థిక సంఘం కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ లో భాగంగా.. Income Distance కు 50 శాతం భారితాన్ని, 1971 జనాభాకు 17.5 శాతం, 2011 జనాభాకు 10 శాతం, విస్తీర్ణానికి 15 శాతం, అడవుల విస్తీర్ణానికి 7.5 శాతం భారితం ఇచ్చింది. తద్వారా కేంద్ర పన్ను రాబడిలో ఉత్తరప్రదేశ్ 18 శాతం, బిహార్ 9.7 శాతం, మహారాష్ట్ర 5.5 శాతం, కర్ణాటక 4.7 శాతం, ఆంధ్రప్రదేశ్ 4.3 శాతం, తెలంగాణ 2.4 శాతం వాటా పొందాయి. ఈ స్థితి దేశంలో రాష్ట్రాల మధ్య సాంఘిక-ఆర్థికాభివృద్ధిలో వ్యత్యాసాలకు దారితీసింది. కొన్ని రాష్ట్రాలు అధిక రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి.
- ఇటీవల కాలంలో సెస్‌లు, సర్‌ఛార్జీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాబడి పెరిగింది. ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా లేనందువల్ల కేంద్రం నుంచి రాష్ట్రాలకు జరిగే బదిలీల మొత్తంలో పెరుగుదల సంభవించలేదు.
- కేంద్రం నుంచి రాష్ట్రాలకు అధిక మొత్తంలో బదిలీలు జరగకపోవడానికి కొన్ని పథకాలను కేంద్రం నేరుగా అమలు చేయడం కారణమైంది.
- రాష్ట్రాలకు రుణభారం పెరిగిన నేపథ్యంలో.. వడ్డీ చెల్లింపులపై బడ్జెట్‌లో ఒత్తిడి పెరుగుతోంది. అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థూల చెల్లింపుల మొత్తం 2018-19లో సవరించిన అంచనాల ప్రకారం-రూ.3,19,501 కోట్లు కాగా 2019-20లో రూ.3,54,799 కోట్లుగా ప్రతిపాదించారు. అధిక వడ్డీ చెల్లింపుల కారణంగా మూలధన వ్యయం తగ్గి ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. రాష్ట్రాలు రుణాల ద్వారా సేకరించిన మొత్తాన్ని రాబడి, ఉపాధి కల్పన సామర్థ్య ప్రాజెక్టులు, కార్యక్రమాలపై ఖర్చు చేసినట్లయితే ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది.
- స్థానిక ప్రభుత్వాల ఫైనాన్స్‌కు సంబంధించి గణాంకాలు లభ్యం కాకపోవడం, అవస్థాపనా మద్దతు లేనందువల్ల ‘రాష్ట్ర ఆర్థిక సంఘాల’ పనితీరులో నాణ్యత లోపిస్తున్నది. ప్రశ్నావళి ఆధారంగా సేకరించిన గణాంకాలను రాష్ట్ర ఆర్థిక సంఘాలు వినియోగిస్తున్నందువల్ల వాటి నివేదిక నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘాల సభ్యుల్లో నైపుణ్యత సామర్థ్యం లోపించిందని 11, 12, 13 కేంద్ర ఆర్థిక సంఘాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘాల్లో పంచాయితీరాజ్ సంస్థల్లో ప్రత్యేకీకరణ/అనుభవం ఉన్న ఒక సభ్యుడు, మున్సిపల్ వ్యవహారాల్లో అనుభవం ఉన్న మరో సభ్యుడు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ఆర్థిక సంఘాలు పేర్కొన్నాయి.
- రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనందువల్ల ‘రాష్ట్ర ఆర్థిక సంఘాలు’ తమ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిధులు కూడా తక్కువగా ఉండటం, ఆ కొద్ది మొత్తాన్ని స్థానిక సంస్థల మధ్య పంపిణీ చేయడం కూడా రాష్ట్రాలకు భారంగా మారింది!!
- రాష్ట్ర ప్రభుత్వాల పన్ను విధానం సులభతరంగా ఉండటం, వస్తు, సేవల పన్ను అమలు, తదుపరి కాలంలో రెవెన్యూ ప్రతిపత్తి (రెవెన్యూ అటానమి) క్షీణత, ఐజీఎస్‌టీ, గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీలకు సంబంధించి ముందస్తు సమాచారం లేనందువల్ల భవిష్యత్తు రెవెన్యూ రాబడి అంచనా విషయంలో రాష్ట్రాలు సందిగ్ధతను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రాల రాబడికి సొంత పన్ను రాబడి, కేంద్ర ప్రభుత్వం నుంచి బదిలీలు ప్రధాన ఆధారాలు. 2018-19లో రాష్ట్రాల మొత్తం రెవెన్యూ రాబడిలో సొంత పన్నుల రాబడి 52 శాతంగా, కేంద్రం నుంచి బదిలీ 48 శాతంగా ఉన్నట్లు అంచనా. వస్తు, సేవల పన్ను అమలు తదుపరి రాష్ట్రాలకు 17 శాతం అదనపు రాబడిపై అటానమి తగ్గుతుందని అంచనా. రాష్ట్రాలు 35 శాతం రెవెన్యూకు సంబంధించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడానికి పరిమితమవుతాయి.
- రాష్ట్రాల వ్యయాలను రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంగా వర్గీకరించొచ్చు. పరిపాలనా సంబంధిత వ్యయాలు, వేతనాలు, పెన్షన్‌లపై వ్యయం, రుణాలపై వడ్డీ చెల్లింపులు రెవెన్యూ వ్యయంలో భాగంగా ఉంటాయి. అనేక సాంఘిక, ఆర్థిక సేవలపై వ్యయం మూలధన వ్యయంలో భాగంగా ఉంటుంది. అధిక మూలధన వ్యయం కారణంగా రాష్ట్రాల్లో అవస్థాపనా సౌకర్యాలు మెరుగై ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. 2011-19 మధ్య కాలంలో రాష్ట్రాల మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం సగటున సుమారు 85 శాతం. కాగా మూలధన వ్యయం 15 శాతం మాత్రమే. గత 8 ఏళ్ల కాలంలో రాష్ట్రాల వ్యయంలో సగటు సాంవత్సరిక వృద్ధి 15 శాతంగా నమోదైంది.
- వేతనాలు, పెన్షన్ల చెల్లింపుపై వ్యయం, వడ్డీ చెల్లింపులను Committed Liabilitiesగా వ్యవహరిస్తారు. ఈ మొత్తంలో పెరుగుదల వల్ల అభివృద్ధి వ్యయం కుంటుపడుతుంది. 2016-19 మధ్య కాలంలో 24 రాష్ట్రాలు మొత్తం బడ్జెట్ వ్యయంలో సగటున 39 శాతం Committed Liabilitiesకుకేటాయించారు. పంజాబ్‌లో వీటికి సంబంధించి వ్యయం అధికం కాగా, తదుపరి స్థానాల్లో ఉత్తరాఖండ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లు ఉన్నాయి. 2011-19 మధ్య కాలంలో రాష్ట్రాల బడ్జెట్‌లో 68 శాతం అభివృద్ధి వ్యయం కాగా, 30 శాతం అభివృద్ధేతర వ్యయం. మిగిలిన 2 శాతం స్థానిక సంస్థలు, పంచాయత్‌రాజ్ సంస్థలకు గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా ఇచ్చారు. ఇదేకాలంలో రాష్ట్రాలు తమ బడ్జెట్ వ్యయంలో 61 శాతాన్ని మానవ, ఆర్థికాభివృద్ధి, అవస్థాపనా సౌకర్యాల కల్పన, పరిపాలన, పౌరుల భద్రతకు కేటాయించాయి. మిగిలిన 39 శాతంలో 10 శాతాన్ని పెన్షన్ చెల్లింపులకు ఖర్చు చేశాయి.
- ఏడో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సుల సవరణకు సంబంధించి సిఫార్సులు చేసింది. ఆయా సిఫార్సులను 2017-18 నుంచి మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖండ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లు అమలుపర్చాయి. ఒడిశా, రాజస్థాన్‌లు వేతనాలు, పెన్షన్‌లను 2017-18 నుంచి సవరించాయి. తద్వారా 2017-18లో వేతనాలు, పెన్షన్లలో వృద్ధి అస్సాంలో అధికంగా 49 శాతం, ఒడిశాలో 43 శాతం, కర్ణాటకలో 38 శాతం, బిహార్‌లో 36 శాతం నమోదైంది. రాష్ట్రాల రెవెన్యూ వ్యయంలో వేతనాలపై వ్యయం 35 శాతానికి మించకూడదని పదమూడో ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. కొన్ని రాష్ట్రాలు ఈ సూచనను పాటించడంలో విఫలమయ్యాయి.
- గత ఐదేళ్ల కాలంలో కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం ఆయా రాష్ట్రాల బడ్జెట్‌పై ఒత్తిడి పెంచింది. రాష్ట్రాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో 0.1 శాతం నుంచి 2 శాతం వరకు రుణమాఫీకే కేటాయించాయి. రైతు స్నేహపూర్వక విధానాలను అవలంభించడం ద్వారా.. వ్యవసాయాభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు రైతులకు ఆదాయ మద్ధతు పథకాలను ప్రకటించి.. 2019-20 బడ్జెట్‌లో కేటాయింపులు జరిపాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ రైతు భరోసా, హర్యానాలో ముఖ్యమంత్రి పరివార్ సమ్మాన్ నిధి, జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన, తెలంగాణలో రైతు బంధు, పశ్చిమబెంగాల్‌లో కృషక్ బంధు, ఒడిశాలో కాలియా (KALIA)పధానమైనవి.
Published date : 03 Dec 2019 03:58PM