వ్యవసాయం-వనరుల వినియోగం
Sakshi Education
భారతదేశ వ్యవసాయ రంగంలో అధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులే.
పరిచయం

వీరి జీవనోపాధిలో వ్యవసాయ, అనుబంధ రంగాల పాత్ర కీలకమైంది. పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి తదితర లక్ష్యాల సాధనకు వ్యవసాయ రంగ కార్యకలాపాలను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో సంఘటితంచేయాల్సిన అవసరముంది. వ్యవసాయ రంగంలో సుస్థిరత సాధనకు చిన్న కమతాల సాగులో వనరుల సమర్థతపై భారత్ దృష్టిసారించాలి. గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంది. దేశ వ్యవసాయ రంగంలో కమతాల విఘటన, నీటి వనరుల క్షీణత వంటి పరిస్థితులను గమనించొచ్చు.
స్థూల కలిపిన విలువ (జీవీఏ)లో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటాలో 2013-14 నుంచి తగ్గుదల నమోదవుతోంది. 2013-14లో జీవీఏలో స్థిర ధరల వద్ద వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 17.8 శాతం కాగా, ఇది ప్రాథమిక అంచనాల ప్రకారం 2018-19లో 14.4 శాతానికి తగ్గింది. పంటల ఉత్పత్తి వృద్ధిలో తగ్గుదల వల్ల మొత్తం జీవీఏలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా తగ్గింది. గత మూడేళ్లలో పంటలు, పశుసంపద, అటవీరంగ ఉత్పత్తుల వృద్ధి సరిగా లేనప్పటికీ మత్స్య ఉత్పత్తుల వృద్ధిలో పెరుగుదల సంభవించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూల మూలధన కల్పనలో ప్రభుత్వరంగ పెట్టుబడిలో వృద్ధి 2014-15 తర్వాతి కాలంలో పెరిగినప్పటికీ ప్రైవేటు పెట్టుబడి వృద్ధి క్షీణించింది. వ్యవసాయ రంగంలో పంటల ఉత్పత్తి, పశుపోషణ, తోటల పెంపకం, పంట కోత అనంతర కార్యకలాపాలు, సామాజిక అడవులు, మత్స్యరంగంలో మహిళల పాత్ర ప్రధానమైంది. మొత్తం సాగులో ఉన్న వ్యవసాయ కమతాల్లో మహిళలు సాగుచేస్తున్న కమతాల వాటా 2005-06లో 11.7 శాతం కాగా, ఇది 2015-16 నాటికి 13.9 శాతానికి పెరిగింది. మార్కెట్ సంస్కరణలను పూర్తిస్థాయిలో ఏ రాష్ట్రమూ అమలుచేయలేదు. వ్యవసాయ రుణాల పంపిణీలో ఈశాన్య రాష్ట్రాల వాటా ఒక శాతం లోపు ఉంది.
వ్యవసాయ అనుబంధ రంగాలు
గ్రామీణ ప్రాంతాల్లో రుతు సంబంధ నిరుద్యోగం కాలంలో పశు సంపద, కోళ్లు, పాడి, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ రంగాలు వ్యవసాయ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాయి. అనేక పంటల ఉప ఉత్పత్తులు పాడి ఉత్పత్తులకు సంబంధించి ముడి సరుకుగా ఉపయోగపడుతున్నాయి. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ 20 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. 1991-92 తర్వాత భారత్ పాల ఉత్పత్తిలో స్థిరమైన పెరుగుదల సంభవించింది. 1991-92లో దేశంలో పాల ఉత్పత్తి 55.6 మిలియన్ టన్నులు కాగా, ఇది 2017-18లో 176.3 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ కాలంలో పాల ఉత్పత్తి సగటు సాంవత్సరిక వృద్ధి 4.5 శాతంగా నమోదైంది. మరోవైపు పాల ఉత్పత్తిలో రాష్ట్రాల మధ్య తేడా అధికమైంది. భారత్‌లో తలసరి పాల లభ్యత రోజుకు 375 గ్రాములు కాగా, రాష్ట్రాల వారీ పరిశీలిస్తే పంజాబ్‌లో రోజుకు 1120 గ్రాములు, అస్సాంలో 71 గ్రాములుగా జాతీయ పాడి అభివృద్ధి బోర్డు అంచనాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం పాల ఉత్పత్తిలో విక్రయానికి అందుబాటులో ఉన్న పాలు 52 శాతం. ఇందులో సగం కంటే తక్కువ పాలను సంఘటిత రంగమైన సహకార డెయిరీలు, ప్రైవేటు డెయిరీలకు విక్రయిస్తుండగా, మిగిలిన పాలను అసంఘటిత రంగంలో విక్రయిస్తున్నారు.
నేషనల్ శాంపుల్ సర్వే 70వ రౌండు ప్రకారం 3.7 శాతం వ్యవసాయ కుటుంబాలకు పశు పోషణ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. భారత్ ప్రపంచ మేకల జనాభాలో 16.1 శాతం, గొర్రెల జనాభాలో 6.4 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలో మొత్తం పశు సంపద 512.1 మిలియన్లు కాగా వీటిలో మేకలు, గొర్రెల వాటా 39 శాతం. వనరుల లేమి ఉన్న కుటుంబాలతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు లేని కాలంలో రైతులకు ముఖ్యంగా ఉపాంత, మహిళా, భూమి లేని రైతులకు మేకలు, గొర్రెలు అనుబంధ ఆదాయాన్ని ఇస్తున్నాయి.
మత్స్యరంగం
దేశంలో మత్స్య రంగం అధిక శాతం మంది ప్రజలకు పౌష్టికాహారం, ఆహార భద్రత కల్పిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిద్వారా 14.5 మిలియన్ల ప్రజలు ఆదాయం, ఉపాధి పొందుతున్నారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2018-19లో దేశంలో చేపల ఉత్పత్తి 13.7 మిలియన్ మెట్రిక్ టన్నులు. స్థిర ధరల వద్ద జీవీఏలో మత్స్య రంగ వృద్ధి 2012-13లో 4.9 శాతం కాగా, ఇది 2017-18లో 11.9 శాతానికి పెరిగింది. వ్యవసాయ ఎగుమతుల్లో చేపలు, చేప ఉత్పత్తుల ఎగుమతులు కీలకంగా ఉన్నాయి. 2018-19లో చేపలు, చేప ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.47,620 కోట్లుగా నమోదైంది. అధిక వనరుల సామర్థ్యం ఉన్న మత్స్య రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2019, ఫిబ్రవరిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అన్ని రకాల చేపల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు సంబంధించిన అన్ని పథకాలనూ ‘‘బ్లూ రివల్యూషన్: ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్’’ అనే పథకంలో విలీనం చేశారు. మత్స్య రంగ లక్ష్యాలను సాధించడానికి రూ.7,522.48 కోట్ల వ్యయంతో ఫిషరీస్, ఆక్వాకల్చర్ అవస్థాపనా అభివృద్ధి నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. పశు సంపద, మత్స్య రంగం అభివృద్ధి ద్వారా ఒకవైపు ప్రజల ఆదాయాలను పెంచుతూ, మరోవైపు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పేద ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలతో అనుసంధానించాలి. వైవిధ్యంతో కూడిన, చలనాత్మక రంగమైన మత్స్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెంపునకు ప్రయత్నించాలి. మత్స్య రంగానికి సంబంధించిన అన్ని విధానాలు, కార్యక్రమాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరముంది. మత్స్య రంగ అభివృద్ధి.. భారత ఆర్థిక వృద్ధికి ఓ సాధనంగా నిలుస్తుంది. భూమిలేని రైతులకు మేకలు, గొర్రెలు అనుబంధ ఆధాయాన్ని సమకూరుస్తున్నాయి.
భూకమతాలు
భారత వ్యవసాయ గణాంకాల (2015-16) ప్రకారం 2010-11లో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన కమతాలు 13.8 కోట్లు కాగా, వీటి సంఖ్య 2015-16 నాటికి 14.6 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో కమతాల సంఖ్యలో 5.3 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం కమతాల్లో ఉపాంత కమతాల (హెక్టారు లోపు) వాటా 2000-01లో 62.9 శాతం కాగా, ఇది 2015-16 నాటికి 68.5 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో చిన్న కమతాలు (ఒక హెక్టారు- రెండు హెక్టార్లు) 18.9 శాతం నుంచి 17.7 శాతానికి తగ్గగా, పెద్ద కమతాలు (4 హెక్టార్లకు పైగా) 6.5 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గాయి.
2000-01లో ఉపాంత, చిన్న కమతాల కింద ఉన్న విస్తీర్ణం మొత్తం విస్తీర్ణంలో 38.9 శాతం కాగా, ఇది 2015-16 నాటికి 47.4 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో మొత్తం విస్తీర్ణంలో పెద్ద కమతాల విస్తీర్ణం 37.2 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది. మహిళలు సాగుచేస్తున్న కమతాల్లో ఉపాంత కమతాల వాటా ఎక్కువ.
భారత వ్యవసాయ రంగంలో కమతాల ప్రక్రియను పరిశీలించడం ద్వారా ఉపాంత, చిన్న కమతాల (85 శాతం) ప్రాధాన్యాన్ని గుర్తించవచ్చు. ఉపాంత, చిన్న కమతాల వ్యవసాయానికి వ్యవసాయ రంగ అభివృద్ధి వ్యూహం ప్రాధాన్యమివ్వాలి. వ్యవసాయ ఉత్పాదకత ఎరువులు, సాగునీటి లభ్యత, సాంకేతిక పరిజ్ఞానం, పంట సాంద్రత, పంటల తీరు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. వనరుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వల్ల చిన్న కమతాల్లో ఉత్పాదకత పెరుగుతుంది.
నీటి వినియోగం
ఆసియా జల అభివృద్ధి వీక్షణం (2016) ప్రకారం మొత్తం భూగర్భ జల వినియోగంలో సాగునీటి వాటా 89 శాతం. భూగర్భ నీటిమట్టం అడుగంటుతున్న నేపథ్యంలో ప్రస్తుత భూగర్భ జల వినియోగం ఇదే విధంగా కొనసాగుతుందా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. నీటి అభద్రతకు సంబంధించి 2050 నాటికి భారత్ ప్రపంచ కేంద్ర బిందువుగా నిలుస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో చిన్న, ఉపాంత రైతుల సాగునీటి అవసరాలను తీర్చడానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలో లభ్యమయ్యే సాగునీటిలో అధిక శాతాన్ని వరి, చెరకు పంటలు వినియోగించుకుంటున్నాయి. చెరకు ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో భూ ఉత్పాదకత, సాగునీటి ఉత్పాదకత మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది. వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి సాగునీటి ఉత్పాదకత పెంపుపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి తెలియజేస్తోంది. మెరుగైన సాగునీటి పద్ధతులు, సాగునీటి సాంకేతికత అనేవి సాగునీటి ఉత్పాదకత పెంపు, పంటల తీరు ప్రక్రియలో మార్పునకు కారణమవుతాయి. సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థ.. నీటి వినియోగ సామర్థ్యం పెంపునకు దోహదపడగలదు. సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చిన రాష్ట్రాల్లో ఇంధనం, ఎరువుల వినియోగంలో 40-50 శాతం మేర ఆదా జరిగింది. వ్యవసాయ రంగంలో దృష్టి భూ ఉత్పాదకత నుంచి సాగునీటి ఉత్పాదకత వైపు మళ్లాలి. నీటి వినియోగానికి సంబంధించి సమర్థ విధానాలను రూపొందించి, రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించినప్పుడు నీటి సంక్షోభ నివారణ సాధ్యపడుతుంది.
ఎరువులు
చిన్న, ఉపాంత రైతుల లాభదాయకతను నిర్ణయించే అంశాల్లో ఎరువుల ధరలు ముఖ్యమైనవి. 2002 నుంచి 2011 వరకు భారత్‌లో ఎరువుల వినియోగంలో పెరుగుదల నమోదైంది. తర్వాతి కాలంలో తగ్గుదల సంభవించింది. దీనికి వినియోగంలో సమతుల్యత లోపించడం, లభ్యత తగ్గుదల, మొక్కలకు సంతులిక పోషణపై రైతుల్లో అవగాహన లేమి, పంట నిర్వహణ సక్రమంగా లేకపోవడం తదితరాలు కారణం. సరైన ఎరువు ఎంపిక, మోతాదు, కాలం, వినియోగ పద్ధతులపై అవగాహన ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచొచ్చు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఉద్దేశం.. రసాయన ఎరువుల నిర్మూలన ద్వారా ఉత్తమ ఆగ్రోనామిక్ పద్ధతులను ప్రోత్సహించడం. జీరో బడ్జెట్ ఫార్మింగ్‌ను తక్కువ నీటితో చేపట్టవచ్చు. దీన్ని వాతావరణ స్నేహ పూర్వక వ్యవసాయ వ్యవస్థగా చెప్పొచ్చు.
చిన్న కమతాల్లో అభిలషణీయ సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా వనరుల సమర్థతను సాధించొచ్చు. సాంకేతికత వినియోగం; వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై అధిక పెట్టుబడులు; ప్రస్తుత వినియోగంలో ఉన్న సాంకేతికత స్థాయి పెంపు తదితర అంశాలు చిన్న, ఉపాంత రైతులకు ప్రయోజనం చేకూర్చలేవు. చిన్న తరహా వ్యవసాయానికి అవసరమైన పర్యావరణ స్నేహపూర్వక ఆటోమేటెడ్ వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను సమకూర్చాలి. చిన్న తరహా వ్యవసాయంలో సమాచార విస్తరణకు, లావాదేవీల వ్యయం తగ్గింపునకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని వినియోగించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల విస్తరణ వల్ల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, వాతావరణం, నేల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని పొందగలుగుతున్నారు.
సాంకేతికత తోడుగా..
చిన్న, సన్నకారు వ్యవసాయ క్షేత్రాల్లో యాంత్రీకరణలో భాగంగా హైటెక్ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 2014-15 నుంచి 2017-18 మధ్యకాలంలో 8,162 కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవస్థాపనా సౌకర్యాల కొరత నేపథ్యంలో చిన్న, ఉపాంత రైతులను ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీకి దగ్గర చేయాలి. దీనివల్ల మార్కెట్ లభ్యతకు సంబంధించిన సమాచారం వేగంగా లభిస్తుంది. వ్యవసాయ మార్కెట్లలో సమాచార అగాధాన్ని తొలగించడంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాఫీ మార్కెట్లో వినియోగిస్తున్న బ్లాక్ ఛెయిన్ టెక్నాలజీని దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.
చిన్న, సన్నకారు రైతులకు సంబంధించి ఉత్పత్తుల మార్కెటింగ్‌లో స్థానిక వర్తకులు, ముడి సరుకులు విక్రయించే డీలర్ల పాత్ర ప్రధానమైంది. వ్యవసాయ మార్కెట్లకు అనుసంధానతను పెంచడం ద్వారా రైతులకు మార్కెట్ లభ్యత చేకూరి, తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందగలరు.
డా॥తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్

Published date : 14 Aug 2019 05:40PM