Skip to main content

Elections in 2024: చరిత్ర.. 2024లో ఏకంగా 73 దేశాల్లో ఎన్నికలు

అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది.
Key lessons from elections held in 70 countries in 2024

అమెరికా నుంచి  భారత్‌ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్‌ యూనియన్‌కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. 

అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి.. 

భారత ఓటర్ల పరిణతి 
భారత్‌లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. 

ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్‌ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’ అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్‌సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.

Year of 2024: ఈ ఏడాది భార‌త్‌లో జ‌రిగిన విషాదాలు.. విజయాలు ఇవే..

ట్రంప్‌.. తగ్గేదేలే..! 
నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యర్థిత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్‌’ నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. 

డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్‌ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్‌ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. 

రిషికి ఓటమి 
సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్‌ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్‌ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌ సారథ్యంలో కన్జర్వేటివ్‌లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్‌ పార్టీ నేత కియర్‌స్టార్మర్‌కు జనం పట్టం కట్టారు.

పాక్‌లో ప్రహసనం 
పాకిస్తాన్‌లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ కుటుంబ పార్టీ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన  ఇమ్రాన్‌ఖాన్‌ ఆధ్వర్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పార్టీలను కలుపుకుని షహబాజ్‌ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 

Year Ender 2024: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలు ఇవే..

లంకలో నవోదయంకల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. 

పుతిన్‌ ఐదోసారి 
చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్‌ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్‌ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్‌కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్‌ మదురో విజయమూ వివాదాస్పదమైంది.  

పారిపోయిన నేతలు
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్‌ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కనిపించిన ‘ప్రజా ఉద్యమం’ దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. 

అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. 

Year Ender 2024: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలు ఇవే..

అసద్‌లకు అల్విదా 
సిరియాలో అసద్‌ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్‌లో తెర దించారు. అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. 

Published date : 31 Dec 2024 02:54PM

Photo Stories