TCS: మరో వివాదంలో టీసీఎస్.. గతంలో ‘లంచాలకు ఉద్యోగాలు’.. మరి ఇప్పుడు
అయితే తాజాగా, సంస్థ ఉద్యోగుల విషయంలో అనైతికంగా వ్యవహరిస్తుందంటూ కేంద్ర కార్మిక శాఖకు ఐటీ వర్క్‌ర్స్ యూనియన్ ‘నైట్స్’ ఫిర్యాదు చేసింది. తగిన నోటీసులు, సంప్రదింపులు లేకుండానే 2వేల మంది ఉద్యోగుల్ని వివిధ నగరాలకు టీసీఎస్ బలవంతంగా బదిలీ చేసి వారికి, వారి కుటుంబాలకు తీవ్ర వేదన మిగిల్చిందని నైట్స్ (nites) పేర్కొంది.
చదవండి: Tata Consultancy Services: టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..
వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన నెల తర్వాత
బదిలీ చేసిన ఉద్యోగులు 15 రోజుల్లోగా కేటాయించిన ప్రదేశంలో చేరాలని కోరింది. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసిన ఒక నెల తర్వాత ఈ అంశంపై తెరపైకి వచ్చింది.
ఆదేశాలు పాటించిన ఉద్యోగులపై చర్యలు
పలు నివేదికల ప్రకారం.. ఆగస్ట్ నెల చివరిలో టీసీఎస్‌లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల్లో సుమారు 2వేల మంది ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది. అందులో ‘ మిమ్మల్ని బదిలీ చేస్తున్నాం, రెండు వారాల్లో మీకు కేటాయించిన స్థానాలకు వెళ్లాలి’ అని సూచించింది. అంతేకాదు, కంపెనీ పాలసీల ఆధారంగా, ఉద్యోగుల ప్రయాణ, వసతి ఖర్చులను చెల్లిస్తామని చెప్పింది. ఆదేశాల్ని పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఉద్యోగుల ఫిర్యాదులు
దీంతో తమ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుమారు 180 మంది ఉద్యోగులు ఐటీ వర్క్‌ర్స్ యూనియన్ నైట్స్‌కు ఫిర్యాదు చేశారు. ‘సరైన నోటీసు లేదా సంప్రదింపులు లేకుండా బదిలీ చేయమని బలవంతం చేసిందని, దీనివల్ల తమకు, కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని’ ఆరోపించారు. ఉద్యోగుల ఫిర్యాదతో నైట్స్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది.
ఈ సందర్భంగా నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, ‘ఈ బలవంతపు బదిలీలు ఉద్యోగుల ఆర్థిక, కుటుంబ సభ్యులకు ఇబ్బంది, ఒత్తిడి, ఆందోళన వంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోలేదు. టీసీఎస్ ఉద్యోగుల హక్కులను ఉల్లంఘిస్తోంది. సిబ్బంది విషయంలో తీసుకున్న చర్యలపై దర్యాప్తు చేయాలని, అనైతిక పద్ధతుల నుండి ఐటీ ఉద్యోగులను రక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని మేం కార్మిక కార్మిక శాఖను కోరాం’ అని చెప్పారు.
ఫ్రెషర్స్‌కి వర్తిస్తుంది
టీసీఎస్‌లో బదిలీల అంశానికి సంబంధం ఉన్న ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి మాట్లాడుతూ.. కేటాయించిన ప్రాజెక్ట్‌లను బట్టి అవసరమైన ఉద్యోగులను నిర్దిష్ట స్థానాలకు తరలించమని కంపెనీ కోరుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందిన ఫ్రెషర్‌లకు వర్తిస్తుంది. ఇప్పుడు వారిని ప్రాజెక్ట్‌లలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
అంగీకరించని ఉద్యోగుల్ని
కొంతమంది ఉద్యోగులు అంగీకరించి ఇప్పటికే కేటాయించిన స్థానాలకు మారినప్పటికీ, దాదాపు 150-200 మంది ఉద్యోగులు వారి స్థానాలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నట్లు సదరు టీసీఎస్ ఉన్నతాధికారి చెప్పారు. వారి సమస్యలు, ఇతర ఇబ్బందుల గురించి సంస్థ హెచ్‌ఆర్ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. కానీ, వారికి ఇచ్చిన రెండు వారాల గడువు తర్వాత ఎటువంటి తదుపరి నోటీసులు లేకుండా వారి ఇమెయిల్ యాక్సెస్‌ను రద్దు చేస్తామని అన్నారు.
‘ఇమెయిల్ యాక్సెస్ కోల్పోయిన ఉద్యోగులు ఇకపై హెచ్‌ఆర్‌లతో కమ్యూనికేట్ చేయలేరు. అందుకే హెచ్‌ఆర్‌లు ఉద్యోగుల్ని వారికి కేటాయించిన ప్రదేశాలకు వెళ్లమని చెబుతున్నారు. లేకపోతే వారు తమ జీతాలు, ఉద్యోగాలను కోల్పోతారని పునరుద్ఘాటించారు.