Skip to main content

WeareHiring రూటు మార్చిన ఆటోమేకర్స్‌: క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో భారీ నియామకాలు

న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ సిబ్బందిని రిక్రూట్‌ చేసుకునే క్రమంలో ఆటోమొబైల్‌ కంపెనీలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంజినీరింగ్‌ కాలేజీలు, బిజినెస్‌ స్కూల్స్‌ మీద దృష్టి పెడుతున్నాయి. దీంతో గౌహతి, మండీ లాంటి ప్రాంతాల్లోని ఐఐటీల్లో (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు ఈసారి గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్‌ కార్ల మార్కెట్లలో ఒకటిగా భారత్‌ ఎదుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్‌ కంపెనీలు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులను మరింతగా నియమించు కోవడంపై దృష్టి సారిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
WeareHiring
WeareHiring రూటు మార్చిన ఆటోమేకర్స్‌: క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో భారీ నియామకాలు

ఇంజినీరింగ్, ఎల్రక్టానిక్స్, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో హైరింగ్‌ను పెంచుకుంటున్నట్లు వివరించాయి. అనలిటిక్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇండస్ట్రీ 5.0 నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. 2024 బ్యాచ్‌ నుంచి మేనేజ్‌మెంట్, గ్రాడ్యుయేట్‌ ట్రైనీలను తీసుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ  దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 15-20శాతం ఎక్కువమందిని తీసుకోబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

క్యాంపస్‌ నుంచి రిక్రూట్‌ చేసుకున్న వారికి కొత్త టెక్నాలజీలు, ప్లాట్‌ఫాంలపై తగు శిక్షణ ఇచ్చి భవిష్యత్‌ అవసరాల కోసం సిద్ధం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే డేటా అనలిటిక్స్‌ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారిని రిక్రూట్‌ చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించింది. డేటా మైనింగ్‌ తదితర సాంకేతికతలతో ఈ–కామర్స్‌ చానల్స్‌ను అభివృద్ధి చేసేందుకు, బ్యాక్‌–ఎండ్‌ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు వీరిని వినియోగించుకోవాలనేది కంపెఈ యోచన.  

మారుతీ కూడా.. 

గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాల ఊతంతో భవిష్యత్‌ అవసరాల కోసం నియామకాలను మరింతగా పెంచుకునేందుకు మారుతీ సుజుకీ కూడా సన్నద్ధమవుతోంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా క్యాంపస్‌ నుంచి నియామకాలను కూడా పెంచుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది క్యాంపస్‌ల నుంచి 1,000 మంది వరకూ సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. సంస్థలో అంతర్గతంగా కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం, డిజిటల్‌ పరివర్తన మొదలైన వాటిని వేగంగా అమలు చేస్తున్నామని, ఇందుకోసం తత్సంబంధ నైపుణ్యాలున్న ప్రతిభావంతుల అవసరం చాలా ఉంటోందని వివరించాయి. 

మరోవైపు, మహీంద్రా అండ్‌ మహీంద్రా కూడా ఇటీవలే తమ క్యాంపస్‌ హైరింగ్‌ల జాబితాలో మరిన్ని కొత్త ఐఐటీలు, ఎంబీయే సంస్థలను కూడా చేర్చింది. 2022లో దాదాపు 50 పైగా ఇంజినీరింగ్, ఎంబీఏ సంస్థల నుంచి మహీంద్రా ఎంట్రీ లెవెల్‌ సిబ్బందిని తీసుకుంది. సగటున 500-600 మందిని రిక్రూట్‌ చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అటు హీరో మోటోకార్ప్‌ సంస్థ డిప్లొమా ఇంజినీర్ల నియామకం కోసం ఢిల్లీ స్కిల్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ యూనివర్సిటీతో జట్టు కట్టింది.

క్రితం సంవత్సరంతో పోలిస్తే తాము 40 శాతం ఎక్కువ మందిని క్యాంపస్‌ నుంచి రిక్రూట్‌ చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. వీరిలో ఎక్కువగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌  ఇంజినీర్లు, ఎంబీఏలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొరియా దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ భారత్‌లో తన కార్యకలాపాల కోసం వివిధ విభాగాల్లో, హోదాల్లో 1,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసే యత్నాల్లో ఉంది. క్యాంపస్‌ల విషయానికొస్తే.. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ నేపథ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభించనుంది. 

క్యాంపస్‌లలోనూ ఆసక్తి.. 

ఆటోమొబైల్‌ కంపెనీల నియామకాల ప్రణాళికలపై క్యాంపస్‌లలో కూడా ఆసక్తి నెలకొంది. ఐఐటీ–గౌహతిలో గతేడాదితో పోలిస్తే ఈసారి కోర్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యాలున్న వారికి ఆఫర్లు గణనీయంగా పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కోర్‌ ఇంజినీర్, డిజైన్‌ ఇంజినీర్, బిజినెస్‌ అనలిస్ట్, డేటా ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ తదితరుల కోసం డిమాండ్‌ నెలకొన్నట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి తమ దగ్గర నుంచి రిక్రూట్‌ చేసుకునే ఆటోమొబైల్‌ కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఐఐటీ-మండీ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌పరమైన మందగమనం ప్రభావం తగ్గడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు వివరించాయి.

Published date : 17 May 2023 04:55PM

Photo Stories