Skip to main content

NIRF: ఐటీలో పోటాపోటీ!.. బెంగళూరు, ముంబైకి దీటుగా హైదరాబాద్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు ఐటీ ఆధారిత సేవల రంగం ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
NIRF
ఐటీలో పోటాపోటీ!.. బెంగళూరు, ముంబైకి దీటుగా హైదరాబాద్‌

రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. దీంతో ఐటీ రంగంలో భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో తెలంగాణ పోటీ పడుతున్నట్టయింది. తెలంగాణ రాష్ట్ర రెండో ఐసీటీ పాలసీ (2021–26)లో రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2022–23 ఐటీ శాఖ ప్రగతి నివేదిక ప్రకారం.. తెలంగాణ ఈ లక్ష్యాన్ని రెండేళ్లు ముందుగానే అంటే 2024 నాటికే చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సన్నద్ధమవుతోంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని రీతిలో 2022–23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31.44 శాతం వార్షిక వృద్ధిరేటు, ఉద్యోగాల కల్పనలో 16.2 శాతం రికార్డు వృద్ధి రేటును సాధించింది. దీంతో ఏడాది కాలంలోనే కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాలు, ఎగుమతుల్లో రూ.57 వేల కోట్లకు పైగా వృద్ధిని ఐటీ రంగం సాధించింది. 

చదవండి: NIRF Top 10 Rankings 2023 : దేశంలో టాప్‌-10 విద్యాసంస్థలు ఇవే.. ఈ సారి కూడా..

17.31% సీఏజీఆర్‌తో పురోగమనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి 17.31 శాతం సీఏజీఆర్‌ (సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు)తో వృద్ధి చెందడంతోనే ఐటీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. రాష్ట్ర అవతరణ నాటి పరిస్థితులతో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో నాలుగు రెట్లు, ఉద్యోగాల కల్పనలో మూడు రెట్లు పురోగతి సాధించగా, మరో మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చినట్లు అంచనా. 2022–23లో భారత్‌ ఐటీ ఎగుమతులు 9.36 శాతం ఉంటే, తెలంగాణలో మాత్రం 31.44 శాతం పెరిగాయి. 2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా 9.83% గా ఉంటే ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ వాటా 27.6%గా ఉంది. భారత్‌ గణాంకాలతో పోలిస్తే దేశంలో ఐటీ రంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల్లో తెలంగాణ నుంచి 2021–22లో 33 శాతం వస్తే, 2022–23లో 44 శాతం వచ్చాయి. అంటే దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తున్నట్లు భావించవచ్చు. 

చదవండి: NIRF: దేశంలో నంబర్‌ 1 ఐఐటీ ఇదే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌–2023 ర్యాంకింగ్‌ నివేదిక విడుదల..

ఉద్యోగాల్లో బెంగళూరు తర్వాత .. 

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021–22లో దేశం నుంచి రూ.3.95 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరగ్గా, ఇందులో మూడో వంతు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో కర్ణాటక నుంచి 34.2 శాతం, మహారాష్ట్ర నుంచి 20.4 శాతం, తెలంగాణ నుంచి 15.6 శాతం చొప్పున జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలోనే 9.05 లక్షల మంది పని చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ ఐటీ ఎగుమతుల్లోనూ రెండో స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతోంది.  

చదవండి: NIRF 2023: బోధకుల కొరత... పడిపోయిన ర్యాంకులు

పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా 

బెంగళూరు, హైదరాబాద్‌ పెట్టుబడులు ఆకర్షించడం ద్వా­రా ఐటీ రంగం వృద్ధిలో పోటీ పడుతున్నాయి. బెంగళూరుతో పోలిస్తే స్టార్టప్‌ వాతావరణం, ఐటీ రంగంలో మౌ­లిక వసతుల కల్పన హైదరాబాద్‌లో కొంత ఆలస్యంగా పుంజుకున్నా ప్రస్తుతం పెట్టుబడులకు హైదరాబాద్‌ ప్ర­త్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా బెంగళూరుకు పేరున్నా ఇటీవలి కాలంలో ఐటీ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లు హైదరాబాద్‌లో శరవేగంగా ఏర్పాటవుతుండటంతో రెండు నగరాల మధ్య ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను ఆకట్టుకోవడంలో పోటీ నెలకొంది. ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో ముంబయి, బెంగళూరు నగరాలకు మించి హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. 2021లో ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం 129 శాతం పెరగ్గా, ఐదు మెట్రో నగరా­లతో పోలిస్తే 6 శాతం సగటు వృద్ధిరేటు నమోదైంది. బెంగళూరుతో పోలిస్తే జీవన వ్యయం కూడా తక్కువ కావడంతో ఐటీ నిపుణులు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. 

చదవండి: NIRF 2023: జాతీయ ర్యాంకుల్లో మెరిసిన ఏపీ వర్సిటీలు

కేంద్ర ప్రభుత్వ నివేదిక (2021–22) ప్రకారం..  ఐటీ ఎగుమతులు 

కర్ణాటక

 3.95 లక్షల కోట్లు

మహారాష్ట్ర

2.36 లక్షల కోట్లు

తెలంగాణ

1.83 లక్షల కోట్లు

తమిళనాడు

1.57 లక్షల కోట్లు

హర్యానా

 0.52 లక్షలు

మొత్తం భారత్‌ ఐటీ ఎగుమతులు

రూ.11.59 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ నివేదిక (2021–22) ప్రకారం

భారత్‌లో ఐటీ ఉద్యోగుల సంఖ్య:

సుమారు 50 లక్షలు

బెంగళూరు

15 లక్షలు

హైదరాబాద్‌

7.78 లక్షలు

తమిళనాడు

10 లక్షలు

పుణె

4 లక్షలు

తెలంగాణ నుంచి పదేళ్లుగా ఐటీ ఎగుమతులు !

ఏడాది

2022–23

2021–22

2020–21

2019–20

2018–19

2017–18

2016–17

2015–16

2014–15

2013–14

ఎగుమతులు

2,41,275

1,83,569

1,45,522

1,28,807

1,09,219

93,442

85,470

75,070

66,276

57,258

ఉద్యోగాలు

9,05,715

7,78,121

6,28,615

5,82,126

5,43,033

4,75,308

4,31,891

4,07,385

3,71,774

3,23,396

Published date : 07 Jun 2023 03:29PM

Photo Stories