Skip to main content

NIRF 2023: బోధకుల కొరత... పడిపోయిన ర్యాంకులు

సాక్షి, హైదరాబాద్‌: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది.
NIRF 2023
బోధకుల కొరత... పడిపోయిన ర్యాంకులు

తాజాగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్‌టీయూహెచ్‌ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్‌ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్‌ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఏటా ర్యాంకులు ఇస్తుంది.  

చదవండి: IITH: ఐఐటీలో ప్లేస్‌మెంట్ల జోరు!

ఐఐటీ–హైదరాబాద్‌ దూకుడు.. ఓయూ వెనక్కు 

జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్‌ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్‌ వరంగల్‌లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్‌లో వెనుకబడింది. ఫలితంగా నిట్‌ వరంగల్‌ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్‌ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు ఓవరాల్‌ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. 

చదవండి: Driver-less Vehicles: డ్రైవర్‌ లేకుండా వాహనాలపై ఐఐటీహెచ్‌ ప్రయోగాలు

ఇంజనీరింగ్‌లో వెనుకబాటుతనం 

ఇంజనీరింగ్‌ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్‌ సరి­కొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్‌ అనుబంధ కాలేజీలున్న జేఎన్‌టీయూ–హెచ్‌ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్‌ వరంగల్‌ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీ జాతీయస్థా­యి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్‌ఐటీ హైదరా బా­ద్‌ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది.

చదవండి: సరికొత్త కోవిహోం కిట్‌ను రూపొందించిన ఐఐటీ? 

అధ్యాపకుల కొరతే కారణం: ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ 

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.

చదవండి: ఐఐఐటీహెచ్‌లో రూ.110 కోట్లతో ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్’

ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ 

దేశంలో టాప్‌–40 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీ­యగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్రమాణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. 

Published date : 06 Jun 2023 02:40PM

Photo Stories