Skip to main content

AICTE: కంప్యూటర్‌ కోర్సుల బోధనకు.. అధ్యాపకులంతా అర్హులే

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కంప్యూటర్‌ కోర్సులను ఏ బ్రాంచీ అధ్యాపకులైనా బోధించే వెసులుబాటు ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దేశంలోని అన్ని యూనివర్సిటీలనూ ఆదేశించింది.
Technological Education,  Various branches benefitting from computer courses , Computer Courses, All India Council of Technical Education (AICTE), Faculty teaching engineering computer courses,

కొత్తగా వచ్చిన కోర్సుల బోధన కోసం ఇప్పటికే వాటిని పూర్తిచేసిన వారే ఉండాలన్న నిబంధన సరికాదని పేర్కొంది. దీనివల్ల ఎక్కడా ఫ్యాకల్టీ లభించని పరిస్థితి తలెత్తుతుందని, కంప్యూటర్‌ కోర్సుల బోధనకు సమస్య తలెత్తుతుందని స్పష్టం చేసింది.

సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్‌ ఆధారిత బ్రాంచీలకు డిమాండ్‌ పెరుగుతోందని.. వాటిలో ఫ్యాకల్టీకి సంబంధించి కొన్నేళ్లు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ను కూడా బోధనకు వినియోగించుకోవాలని సూచించింది. 

చదవండి: AICTE: పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి

వర్సిటీలు వేధిస్తున్నాయన్న ఫిర్యాదులతో.. 

కొన్నేళ్లుగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ వంటి ఇంజనీరింగ్‌ కోర్సులకు డిమాండ్‌ తగ్గుతూ.. కంప్యూటర్‌ ఆధారిత టెక్‌ కోర్సుల్లో చేరేవారు పెరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఈసారి 58శాతం విద్యార్థులు కంప్యూటర్‌ కోర్సుల్లోనే చేరారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్‌ బాగా పెరిగింది.

అయితే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఈ కోర్సుల బోధనపై పలు షరతులు పెట్టాయి. సదరు సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారినే ఫ్యాకల్టీగా నియమించాలని స్పష్టం చేశాయి. కానీ చాలా కాలేజీలు ఇతర ఇంజనీరింగ్‌ కోర్సులు (సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సీఎస్‌ఈ) బోధిస్తున్న అధ్యాపకులను కొత్త కోర్సులకు ఫ్యాకల్టీగా నియమించాయి. ఈ అధ్యాపకులు కొత్త కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్‌ కోర్సులు చేసినవారేనని పేర్కొంటున్నాయి.

చదవండి: AICTE: ‘ప్రొఫెషనల్‌’గా బోధన!

కానీ దీనిని తాము అనుమతించబోమని, పీజీ చేసినవారిని నియమించాల్సిందేనని యూనివర్సిటీలు పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలపై వర్సిటీ అధికారుల వేధింపులు పెరిగాయంటూ కొందరు ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏఐసీటీఈ.. ఇతర కోర్‌ గ్రూపులు బోధించే వారినీ కొత్త కంప్యూటర్‌ కోర్సుల బోధనకు అనుమతించాలంటూ వర్సిటీలకు స్పష్టత ఇచ్చింది. 

ఆ కోర్సులు తప్పనిసరి 

ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచీలో బోధిస్తున్న అధ్యాపకుడైనా కొన్ని కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బోధించాలనుకుంటే మైనర్‌ డిగ్రీ కోర్సుగా దానిని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులను మూక్స్, స్వయం వంటి సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నాయి.

ఇతర ఇంజనీరింగ్‌ బ్రాంచీల అధ్యాపకులకు సాంకేతికతలు, బోధనపై అవగాహన ఉంటుందని.. అదనంగా సర్టిఫికెట్‌ కోర్సులు చేయడాన్ని అర్హతగా పరిగణించాలని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ సర్టిఫికెట్‌ కోర్సులకు 18 నుంచి 20 క్రెడిట్స్‌ ఉంటాయని, అవి బోధనకు సరిపోతాయని స్పష్టం చేసింది. 

20% అనుమతిస్తున్నాం 
ఇతర బ్రాంచీల వారిని ఇప్పటికే 20శాతం వరకూ కొత్త కోర్సుల ఫ్యాకల్టీగా అనుమతిస్తున్నాం. వంద శాతం అనుమతిస్తే బోధనలో నాణ్యత ఉండదని భావిస్తున్నాం. అయితే సంబంధిత సర్టిఫికెట్‌ కోర్సులు చేసిన వారిని అనుమతించాలని ఏఐసీటీఈ తెలిపింది. ఇందులో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. 
– ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ 

అందరినీ అనుమతించాలి 
కొత్త కంప్యూటర్‌ కోర్సులు బోధించే నైపుణ్యం అలవరచుకున్న అందరినీ బోధనకు అనుమతించాలి. దీనికి వర్సిటీలు అభ్యంతరం చెప్పడం సరికాదు. వర్సిటీల తీరుతో ఫ్యాకల్టీ లభించక బోధన కుంటుపడుతుంది. సర్టిఫికెట్‌ కోర్సులు చేసిన కోర్‌ గ్రూప్‌ వారికీ కంప్యూటర్‌ అనుబంధ కోర్సులపై పట్టు ఉంటుంది. 
– వి.బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Published date : 24 Nov 2023 11:29AM

Photo Stories