AICTE: పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి
విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగాఉండేలా చూడాలని పేర్కొంది. తొలిదశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్) నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది.
ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకూ ఎక్కువగా బట్టీ విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్‌లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఏఐసీటీఈ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు.
చదవండి: AICTE: ‘ప్రొఫెషనల్’గా బోధన!
ఇవీ సూచనలు..
కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజనీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి.
ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి.
అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి.