VC's Report: యూనివర్సిటీలపై వైస్ చాన్స్‌లర్ల నివేదిక.. కీలక అంశాలు ఇవే!
![universities are struggling shortage faculty](/sites/default/files/images/2025/01/29/universities-1738136696.jpg)
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై వర్సిటీల్లో సమస్యలపై చర్చించారు. అన్ని వర్సిటీల్లోనూ దాదాపు ఒకే రకమైన సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఈ సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించారు. దీనిని త్వరలో సీఎంకు అందివ్వనున్నారు.
సమస్యలెన్నో..
రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 74 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంజూరైన మొత్తం పోస్టులు 2,825 కాగా, ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ సిబ్బంది 873 మంది మాత్రమే. మిగతా వాళ్లంతా తాత్కాలిక ఉద్యోగులే. దీంతో బోధనలో జవాబుదారీతనం లోపించి, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలున్నాయి.
చదవండి: THE World University Rankings: టైమ్స్ జాబితాలో చోటు సాధించిన భారతీయ సంస్థలు ఇవే..
పోస్టుల భర్తీపై గత ప్రభుత్వం నియమించిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్థానంలో ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధ్యాపకుల కొరత కారణంగా ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలతో పోటీ పడలేని స్థితి ఉంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు తీసుకొచ్చినా ప్రాజెక్టులు రావడం లేదు. ఉస్మానియా వర్సిటీలో పరిశోధనలు. పరిశోధన ప్రాజెక్టులూ తగ్గిపోయాయి.
2020–21లో రూ.52.45 కోట్ల ప్రాజెక్టులొస్తే.. 2022–23 నాటికి రూ.24.75 కోట్లకు తగ్గింది. రెండేళ్లలోనే 53 శాతం పడిపోయాయి.
శాపంగా మారిన నిధుల కొరత
చాలా యూనివర్సిటీల్లో నిధుల కొరత ఉంది. పాలమూరు వర్సిటీకి రూ.10 కోట్లు కేటాయించినా,ఇస్తున్నది మాత్రం రూ.7 కోట్ల లోపే. ఇక్కడ ఏడు విభాగాలకు 84 పోస్టులు మంజూరైతే 17 పోస్టుల్లోనే అధ్యాపకులున్నారు. వీరిలో ఇద్దరు ప్రొఫెసర్లు.
నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు. కొత్తగా ప్రవేశపెట్టిన 11 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రెగ్యులర్ అధ్యాపకులే లేరు.
చదవండి: Courses Prohibition : 3 యూనివర్సిటీల్లో 5 ఏళ్లపాటు ఈ కోర్సులు నిషేధం.. కారణం..!
94 మంది తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. తెలంగాణ వర్సిటీలో 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైనా, ఉన్నది 61 మంది మాత్రమే. 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్న ఈ వర్సిటీలో అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టకొస్తున్నారు. కాకతీయ వర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఏడాదికి రూ.150 కోట్లు అవసరం.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ కింద రూ.97 కోట్లు మాత్రమే వస్తోంది. దీంతో అంతర్గత సమీకరణల ద్వారా రూ.53 కోట్లు సమకూర్చుకుంటున్నారు. ఇక్కడ 405 రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు ఉంటే, అందుబాటులో ఉన్నది 83 మందే. మరో 190 మందిని కాంట్రాక్టు, 201 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సులను కలుపుకుంటే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలి.
![]() ![]() |
![]() ![]() |
సాంకేతిక విద్యకు అగచాట్లు
ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు వస్తు న్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు మౌలిక వసతులు, బోధనా నైపుణ్యం గల సిబ్బంది లేకపోవటంతో ప్రభుత్వ వర్సిటీల్లో నిర్వహించలేకపోతున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో 410 మంది అధ్యాపకులుండాలి. కానీ 169 మందే ఉన్నారు. 241 పోస్టులు ఖాళీ.
కొత్త ఏఐ కోర్సులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ఏటా రూ.200 కోట్లు అవసమని ఇక్కడి ఉన్నతాధికారులు చెబుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో చాలాకాలంగా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ లేదు. ఇక్కడ 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
Tags
- Universities
- faculty
- vice chancellor
- Faculty Posts
- Educational standards
- Common Recruitment Board
- Private and Deemed Universities
- AI
- Cyber Security
- Osmania University
- Telangana News
- Vice Chancellors Report
- Vice-Chancellor's Report to University Council
- Vice-Chancellor's Report to Chief Minister
- Vice-Chancellor's Report to CM Revanth Reddy
- artificial intelligence
- data science