10th Class and Inter Exams Paper Leak : యథేచ్ఛగా మాస్ కాపీయింగ్... పేపర్ లీక్.. టెన్త్ నుంచి గ్రూప్ 2 దాకా ఇదే తీరు...?

విద్యార్థులు విద్యా వ్యవస్థపైనే నమ్మకం కోల్పోతున్నారు...
రాష్ట్రవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన నిర్వాకులే దీనికి నిదర్శనం. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కష్టపడి చదివిన విద్యార్థులు విద్యా వ్యవస్థపైనే నమ్మకం కోల్పోతున్నారని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. కనీసం ప్రశ్న పత్రాల ముద్రణ సరిగా ఉందో లేదో కూడా పరిశీలించకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు. కార్పొరేట్ కాలేజీల సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నా పత్రాన్ని మార్చేసిన ఘనత కూటమి సర్కారులోనే కనిపిస్తోందంటున్నారు.
విద్యార్థుల భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసేలా...
ఈ ఏడాది 10,58,893 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,49,884 మంది టెన్త్ విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలు రాసున్నారు. ప్రభుత్వ నిర్వాకాలు వారి భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏ పరీక్ష అయినా పకడ్బందీగా నిర్వహించారని, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
నారాయణ విద్యాసంస్థల నేతృత్వంలో..
2022లో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ విద్యాసంస్థల నేతృత్వంలో పేపర్ లీక్‌కు జరిగిన యత్నాలను సమర్థంగా అడ్డుకుని కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా, రికార్డు వేగంతో నిర్వహించి భర్తీ చేసిందని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మళ్లీ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మార్చి 17 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసేలా మాస్ కాపీయింగ్ వ్యవహారాలు పలు చోట్ల వెలుగు చూశాయి. మార్చి 21వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ, బీ కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్‌కు తెర తీశారు.
టీడీపీ అధికారంలో ఉండగా 1995లో పదో తరగతి ప్రశ్నపత్రం, 1997లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీకై విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలో పదో తరగతి పేపర్ లీకైంది.
పుస్తకాలు ముందుంచి జవాబులు రాస్తూ..
ఇక్కడ విద్యార్థులకు స్లిప్పులు అందించడం.. పుస్తకాలు ముందుంచి జవాబులు రాస్తూ ఉపాధ్యాయులు పట్టుబడ్డ వ్యవహారం బట్టబయలైంది. దీంతో 11 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు హెచ్‌ఎంలు, రికార్డు అసిస్టెంట్ సహా మొత్తం 15 మందిని సస్పెండ్ చేశారు.
➤☛ వైఎస్సార్ జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నపత్రం లీక్ చేసి వాట్సాప్‌లో తిప్పారు. ఈనెల 24న ఇక్కడ పదో తరగతి లెక్కల పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా కొద్దిసేపటికే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. స్కూల్లో ఓ వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పని చేస్తున్న వ్యక్తికి పంపినట్లు తేలింది. నిషిద్ధ ప్రాంతంలో వాటర్ బాయ్ వద్ద స్మార్ట్ ఫోన్ లభించడం విస్మయం కలిగిస్తోంది.
ఉత్తీర్ణత పెరగాలంటూ ఒత్తిళ్లు.. కానీ...
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అస్తవ్యస్థ నిర్ణయాలతో చదువులను నీరుగార్చిన ప్రభుత్వం పరీక్షల్లో మాత్రం అత్యధికంగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ ఉపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిచ్చింది. ఒకపక్క ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జూన్‌లో ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్ వరకు సాగదీసింది. అయినా నూరు శాతం పూర్తి చేయలేదు. మరోపక్క ‘అర్జెంట్ రిపోర్టు’ పేరుతో రోజూ మెస్సేజులు పంపుతూ బోధనను గాలికొదిలేసింది. తీరా పరీక్షల నాటికి ఫలితాల కోసం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటూ టీచర్ల మెడపై కత్తి వేలాడదీసింది! మీరు ఏం చేసినా సరే.. గతంలో కంటే ఎక్కువగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ హెచ్చరించింది. తన గొప్పల కోసం పాస్ శాతం పెరగాలని విద్యాశాఖ మంత్రి ఆదేశిస్తుండగా... ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ఆయా సబ్జెక్టుల్లో పర్సంటేజ్ పెరగకుంటే నోటీసులు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని స్లిప్పులు రాసే స్థితికి దిగజార్చారు.
ఇంటర్ పేపర్‌లో తప్పులు ఇలా..
➤☛ మార్చి 5న జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పేపర్‌లో ముద్రణ తప్పులు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం సృష్టించడంతో విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయారు. 8వ ప్రశ్న కింద ‘అడ్వర్టైజ్‌మెంట్ చదివి సమాధానాలు రాయాలని ఒక్క మార్కు ప్రశ్నలు ఐదు ఇచ్చారు. అయితే ప్రశ్నలో ఏముందో గుర్తించలేని రీతిలో ముద్రించారు.ఈ విషయాన్ని నెల్లూరులో గుర్తించి ఉన్నతాధికారులకు చేరవేసి సరిదిద్దేసరికి గంట సమయం గడిచిపోయింది. దీంతో కొన్ని చోట్ల బోర్డుపై రాయగా మరికొన్ని చోట్ల ప్రశ్నపత్రంలోని అంశాలను ఇన్విజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు. 13వ ప్రశ్న కూడా గందరగోళంగా ముద్రించడంతో విద్యార్థులు మొత్తం పది మార్కులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది.
➤☛ మార్చి 15వ తేదీన సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్‌లో 14వ ప్రశ్న అకడమిక్ సిలబస్ నుంచి ఇవ్వగా విద్యార్థులు జవాబులు రాశారు. తీరా గంట గడిచిన తర్వాత ప్రశ్నలో తప్పుందంటూ మార్పు చేశారు. ఓ కార్పొరేట్ కాలేజీ ముద్రించుకున్న సిలబస్‌కు అనుగుణంగా దీన్ని మార్చినట్లు తెలిసింది.
➤☛ మార్చి 11న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలోని పెనుమాక జూనియర్ కాలేజీలో ఓ ప్రైవేట్ కాలేజీకి మేలు చేసేలా మాస్ కాపీయింగ్ జరిగింది. 180 మంది విద్యార్థులకు ఇక్కడ సెంటర్ కేటాయించారు. ఇంటర్ రెండో ఏడాది గణితం, జువాలజీ, చరిత్ర పరీక్షలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఇక్కడ మాస్ కాపీయింగ్ ప్రారంభమైంది. ఈ ఘటన తాడేపల్లిలోని మంత్రి నివాసానికి కూతవేటు దూరంలో చోటు చేసుకోవడంతో రహస్యంగా ఉంచారు. సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, ఇని్వజిలేటర్లను మార్చి చేతులు దులుపుకొన్నారు.
➤☛ ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అరగంట ఆలస్యంగా పేపర్ ఇవ్వగా ఎలాంటి అదనపు సమయం ఇవ్వకుండా నిర్దిష్ట సమయానికే తిరిగి తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దీన్ని ఇంటర్ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు.
Tags
- ts 10th class public exam paper leak news today
- ap 10th class public exam paper leak
- ap 10th class public exam paper leak news in telugu
- inter exams paper valuation
- CBN
- CBN Cabinet
- appsc group 1 exam issue
- ap paper leak issue
- ap paper leak issue news in telugu
- ap 10th class paper leak issue
- ap 10th class paper leak issue news in telugu
- ap inter paper leak issue
- ap 10th class and inter paper leak issue