Skip to main content

Tenth Exam Paper Leak : టెన్త్ క్లాసు ప్రశ్నపత్రం మ‌ళ్లీ లీక్‌...? పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల‌కే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో టెన్త్ క్లాసు ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన విష‌యం తెల్సిందే. అయితే.. ప‌రీక్ష పేప‌ర్ల లీక్‌ల ప‌ర్వం మాత్రం ఆగ‌డం లేదు. ఎక్క‌డోఒక చోట ప్ర‌శ్న‌ప్ర‌త్రం లీక్ అవుతూనే ఉంది.
telangana tenth class public exam paper Leak

తాజాగా పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. ఈ లీకైన‌ ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టడంతో యువకులు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను టెస్ట్‌పేపర్‌లోని నుంచి చించి వాటిని ఒకే పేపర్‌లో వచ్చే విధంగా జిరాక్స్‌లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేశారు.

గోప్యంగా విచార‌ణ‌..
టెన్త్‌ తెలుగు పేపర్‌ లీకైన విషయం శాలిగౌరారంలో వెలుగులోకి రావడంతో అధికారులు మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై గోప్యంగా విచారణ జరిపారు. మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తహశీసీల్దార్‌ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు చేరుకొని విచారణ జరిపారు. అనంతరం నకిరేకల్‌కు చేరుకొని నకిరేకల్‌లోని గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓతో పాటు డీఈఓ భిక్షపతి, తహసీల్దార్‌ జమురుద్దీన్‌, ఎంఈఓ నాగయ్య విచారణ జరిపారు. 

☛➤ Tenth Class Paper Evaluation and Result Date : పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్.. అలాగే రిజ‌ల్డ్స్ ఎప్పుడంటే...?

సస్పెండ్‌తో స‌రిచేసి..
గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పరీక్ష కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు ఇనిజిలెటర్లను విధుల్లో నుంచి రిలీవ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు, సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చీఫ్‌ సూపరింటెండెంట్‌ను, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ను పరీక్ష విధుల నుంచి తొలగించింది. ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

ఉన్నతాధికారుల ఆదేశంతో..
పరీక్ష సమయం 12.30 గంటలకు ముగిసినప్పటికీ అధికారులు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నాపత్రం లీకైన‌ సంఘటనపై విచారణ జరుపడంతో 1.15 గంటలకు విద్యార్థులను బయటికి పంపారు. లీకైన పేపర్‌ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లో క్షుణ్ణంగా విచారణ జరిపారు. వాట్సప్‌లో లీకైన పేపర్‌ సీరియల్‌ నెంబర్‌ను, మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్‌ సీరియల్‌ నంబర్లను సరి చూశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపించారు.

మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో..
ఇదిలా ఉంటే మరో కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. తెలుగు పేపరుకు బదులు విద్యార్థులకు హిందీ పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత తప్పిదాన్ని గుర్తించిన అధికారులు సరైన పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. కానీ అప్పటికీ రెండు గంటలు గడిచిపోయింది. ఈ సంఘటన మంచిర్యాలలోని బాయ్స్ హైస్కూల్లో చోటుచేసుకుంది.

అనంతరం విషయం తెలిసి ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన జిల్లా కలెక్ట్ కుమార్ దీపక్ విద్యాధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నాపత్రాల గందరగోళంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

Published date : 22 Mar 2025 04:30PM

Photo Stories