Skip to main content

AP Mega DSC 2024 Problems : ఇక‌ మెగా డీఎస్సీ లేనట్టేనా..! అలాగే ప్ర‌భుత్వ‌ టీచ‌ర్లుకు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏరు దాట‌క ముందు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉంది కూట‌మి సర్కారు తీరు.
AP Mega DSC 2024 Problems

అధికారంలోకి రాక ముందు భారీగా టీచ‌ర్లు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని చెప్పి.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నామ‌మాత్రంగా టీచ‌ర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చారు. మ‌రో ర‌కంగా చెప్పాలంటే.. ఇక మెగా డీఎస్సీ లేనట్టే. 

☛➤ TS DSC 2024 Exam Answer Key Mistakes : తెలంగాణ డీఎస్సీ-2024 'కీ' లో ఇన్ని త‌ప్పులా..? ఈ 18 ప్ర‌శ్న‌ల‌కు మార్కుల‌ను..

విద్యార్థుల‌కు ఇచ్చే రూ.15000 కూడా లేన‌ట్టే..!

ap school students rs 15000

అలాగే ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 117 జీఓ అంశంతో పాటు జీపీఎస్‌ గెజిట్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఇక.. తల్లికి వందనం అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కూటమి నేతలు.. ఇప్పుడు పట్టించుకోకపోవడంతో తల్లులందరూ పెదవి విరుస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ నీకు 15 వేలు.. నీకు 15వేలు అంటూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పిన మాటలకు విద్యార్థుల తల్లులు ఆశపడి తమ పిల్లలను ఈసారి ప్రభుత్వ బడుల్లో కాకుండా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పించారు. అయితే ఈసారి ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయడం కుదరదు అని మంత్రి లోకేష్‌ ఏకంగా అసెంబ్లీలోనే చెప్పడంతో తల్లులంతా అవాక్కయ్యారు. మీ పిల్లల ఫీజులు చెల్లించండి.. లేదంటే టీసీలు తీసుకొని మళ్లీ ప్రభుత్వ బడుల్లో చేర్పించండి అంటూ వారిపై ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

ప్ర‌భుత్వ స్కూల్స్‌లో భారీగా ప‌డిపోయిన విద్యార్థుల సంఖ్య‌..?
సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆ నిర్ణయాల కారణంగానే ఈసారి ప్రభుత్వ బడిలో చేరిన వారి సంఖ్య (23 శాతం) కన్నా టీసీలు తీసుకెళ్లిన వారి సంఖ్య మూడింతలు (77 శాతం) ఉందని టీచర్లు అంటున్నారు. ఈ విద్యాసంవత్సరం మొదట్లో జూన్‌లో చేపట్టిన నేనూ బడికి పోతా.. కార్యక్రమానికి కూడా పెద్దగా స్పందన రాలేదని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 1,200 మంది దాకా మిగులు టీచర్లు ఉన్నారంటున్నారు.

కూటమి నేతలు ఇంత దారుణంగా మోసం చేస్తార‌ని..
పాత పెన్షన్‌ హామీ అమలుపై అధికారంలోకి వచ్చిన నెల రోజులకే కూటమి ప్రభుత్వం మాట మార్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. గత ప్రభుత్వం సీపీఎస్‌ స్థానంలో ఇచ్చిన గ్యారంటీ పెన్షన్‌ స్కీం(జీపీఎస్‌) జీఓ నెం.54ను కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం ఏకంగా రాజముద్రతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా గెజిట్‌ కాపీలను తగలబెడుతూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ నిరసనలకు దిగిన విషయం విదితమే. కూటమి నేతలు ఇంతగా మోసం చేస్తారని తాము అనుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

☛➤ TS DSC 2024 Results : టీఎస్ డీఎస్సీ -2024 ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..! సెప్టెంబరు 5వ తేదీలోపు..

మిగులు పోస్టులను కూడా..
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జీఓ నం.117 విషయంలో మాట మార్చింది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని ఉద్యోగ సంఘాల మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత అశోక్‌బాబు ఇటీవల మాట్లాడటంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును ఎలా రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే జీఓ నం.117ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి... ఇప్పుడు టీచర్ల సర్దుబాటులో పాఠశాలల విలీనం ప్రస్తావనే లేకుండా మిగులు పోస్టులను నిర్ణయించడమేమిటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మిగులు టీచర్లను.. 
సాధారణంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన తర్వాతనే మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తారు. అయితే దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అది కూడా విద్యా సంవత్సం మధ్యలో సర్దుబాటు చేయడం ఏంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

వీటిని బహిష్కరిస్తామని..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌ హామీలు గుప్పించారు. అయితే ఇప్పుడు టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు బాబు సర్కారు శ్రీకారం చుట్టడం చూస్తే మెగా డీఎస్సీని కాలయాపన చేసేందుకేనని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం కొన్నింటిపై మాత్రమే సానుకూలంగా స్పందించిందని, ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాకపోతే మరోసారి సర్దుబాటును బహిష్కరిస్తామని టీచర్లు హెచ్చరిస్తున్నారు.

ఈ నిర్ణయాలు.. ఏ ఒక్కటీ సరిగ్గా లేవ్‌..
విద్యా వ్యవస్థకు సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏ ఒక్కటీ సరిగా లేవు. జీపీఎస్‌ రద్దు, 3, 4, 5 తరగతుల విలీనం వంటి అంశాలపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీచర్ల సర్దుబాటు విషయంలో కూడా ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోంది. ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నీ వైఎస్సార్‌టీఎఫ్‌ సమర్థించదు.
        – పీవీ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌టీఎఫ్‌

కొన్ని తరగతుల విలీనానికి..
ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించాం. ఉపాధ్యాయులు దీనిపై ఎలాంటి సందేహాలు, అనుమానాలు పెట్టుకోవద్దు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొన్ని తరగతుల విలీనానికి సంబంధించిన జీఓ నం.117, జీపీఎస్‌కు సంబంధించిన జీఓ నెం.54 అంశాలు ప్రభుత్వ పరిధిలోనివి. వాటిపై కూడా ప్రభుత్వం పునరాలోచిస్తోంది.
               – మీనాక్షి, జిల్లా విద్యాశాఖ అధికారి

తల్లికి వందనం కూడా ఈ విద్యా సంవత్సరంలోనే ఇవ్వాలి..
ఉపాధ్యాయుల సర్దుబాటులో ప్రధానంగా 117 జీఓను రద్దు చేయాలి. ఉపాధ్యాయ సంఘాలతో పాటు టీచర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలి. జీపీఎస్‌పై ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శాశ్వతంగా ఉపసంహరించుకోవాలి. తల్లికి వందనం కూడా ఈ విద్యా సంవత్సరంలోనే ఇవ్వాలి. అది కూడా ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకే ఇస్తే మంచిది.
                                                        – హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఎస్‌టీయూ

☛➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

Published date : 20 Aug 2024 10:43AM

Photo Stories