Ozone Layer: ఓజోన్‌కు మొదటిసారి రంధ్రం ఎప్పుడు పడిందో తెలుసా... ఇప్పుడు స్వయంగా చికిత్స చేసుకుంటున్న ఓజోన్..!
ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే ఇందుకు కారణం.
ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్ అసెస్‌మెంట్ ప్యానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తారు. ఓజోన్ పొర పూడుకుపోవడం 2022లో మొదలైందని నివేదిక తెలిపింది. ఓజోన్ రంధ్రం 2022 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 13 మధ్య సగటున 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయింది.
క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇదే క్రమంలో తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా పూడుకుంటుందని నివేదిక వెల్లడించింది. మాంట్రియల్ ప్రోటోకాల్ సత్ఫలితాలనిస్తోంది. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. మరో నాలుగు దశాబ్దాల్లో 1980 నాటి స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉష్ణోగ్రత 2100 నాటికి 0.3 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గేలా హైడ్రో ఫ్లోరో కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించుకోవాలని మాంట్రికల్ ప్రోటోకాల్ నిర్ధేశిస్తోంది. ఓజోన్ స్వయం చికిత్సను చూస్తుంటే కాప్ సదస్సులు సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను గణ నీయంగా తగ్గించగలిగితే మునుపుటిస్థితి ఓజోన్ పొర చేరుకునేందుకు ఎంతో సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు.