EAMCET 2022: పరీక్ష ప్రారంభం.. ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’, ఫలితాల సమాచారం..
పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను EAMCET కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని తెలంగాణ EAMCET కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ జూలై 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు.
చదవండి: ఎంసెట్‌లో సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..
ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల
జూలై 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని జూలై 30న విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు.