Mithali Raj Retirement: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటన.. అత్యంత అరుదైన రికార్డులు ఇవే..
![india women's cricket mithali raj](/sites/default/files/images/2022/06/09/mital6-1654753674.png)
అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ సీనియర్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా జూన్ 8వ తేదీన (బుధవారం) ప్రకటన విడుదల చేశారు. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు.
23 ఏళ్లుగా..
ఈ మేరకు ‘‘ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతి సవాలు నుంచి గొప్ప అనుభవం గడించాను. ప్రతి ప్రయాణం లాగే ఇది కూడా ఏదో ఒకరోజు ముగించాల్సిందే కదా!
మిథాలీ భావోద్వేగ నోట్..
![mithali raj story](/sites/default/files/inline-images/mithali-raj1.jpg)
ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టును గెలిపించాలని భావించేదానిని. ఇప్పుడిక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు రావాలి. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి’’ అంటూ మిథాలీ భావోద్వేగ నోట్ షేర్ చేశారు.
వీరికి ప్రత్యేక ధన్యవాదాలు..
ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి, కార్యదర్శి జై షాకు మిథాలీ ధన్యవాదాలు తెలిపారు. క్రికెటర్‌గా తన ప్రయాణం ముగిసినా ఆటలో ఏదో విధంగా భాగస్వామ్యం అవుతానంటూ భవిష్యత్ ప్రణాళికల గురించి హింట్ ఇచ్చారు. భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. తనకు అండగా నిలిచి ఆదరాభిమానాలు చూపిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రికార్డులు ఇవే..
![Mithali Raj announced retirement from international cricket](/sites/default/files/inline-images/Mitali%20raj.jpg)
2019లో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ తాజాగా వన్డే, టెస్టులకు కూడా గుడ్ బై చెప్పారు. 1999లో అరంగ్రేటం చేసిన మిథాలీ రాజ్.. భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎదిగారు. 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల రికార్డు కూడా మిథాలీ పేరిటే ఉంది. భారత్ తరఫున 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడారు.
టి20 రికార్డుల ఇలా..
మహిళా క్రికెట్‌లో టి20లు ప్రారంభమైన 2006 నుంచి టీమిండియా 104 మ్యాచ్‌లు ఆడితే అందులో 89 మ్యాచ్‌ల్లో మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. టి20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగుల (84 ఇన్నింగ్‌సల్లో 2,364 పరుగులు; సగటు 37.5, అత్యధిక స్కోరు 97 నాటౌట్) ఘనత మిథాలీ పేరిటే ఉంది. 2006లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన ఆమె చివరి మ్యాచ్‌నూ అదే ఇంగ్లండ్‌పై 2019, మార్చిలో గువాహటిలో ఆడింది. ఈ క్రమంలో 32 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించింది. వీటిలో 2012, 2014, 2016 ప్రపంచ కప్‌లున్నాయి.
అతి చిన్న వయసులో, పెద్ద వయసులో.. అరుదైన రికార్డులు..:
![mithali raj biography](/sites/default/files/inline-images/mithali-raj-fb1.jpg)
మిథాలీ రాజ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (84 బంతుల్లో 68; 8 ఫోర్లు) చేసిన ఆమె.. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత లేటు వయసులో ఈ ఘనత సాధించిన భారత మహిళా బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించింది.యాదృచ్చికంగా ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత చిన్న వయసులో, ఇదే ప్రత్యర్ధిపై (దక్షిణాఫ్రికా) హాఫ్ సెంచరీ (2000 వన్డే ప్రపంచకప్‌లో) చేసిన భారత మహిళా బ్యాటర్ రికార్డు కూడా మిథాలీ పేరిటే నమోదై ఉంది. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో అతి చిన్న వయసులో, అతి పెద్ద వయసులో ఒకే ప్రత్యర్ధిపై హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా మిథాలీ రాజ్ రికార్డుల్లోకెక్కింది.