Skip to main content

Australian Open: టౌన్‌సెండ్‌ - సినియకోవా జోడీకి డబుల్స్‌ టైటిల్

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో గతంలో ఒక్కసారి కూడా మూడో రౌండ్‌ దాటి ముందుకెళ్లలేకపోయిన అమెరికా క్రీడాకారిణి టేలర్‌ టౌన్‌సెండ్‌ ఈసారి మాత్రం డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Siniakova and Townsend Win Women's Doubles Title in Australian Open 2025

కాటరీనా సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో జత కట్టి తన కెరీర్‌లో రెండోసారి గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది.

గత ఏడాది వింబుల్డన్‌ టోర్నీలో సినియకోవాతో కలిసి మహిళల డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన టౌన్‌సెండ్‌ ఈసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. జ‌న‌వ‌రి 26న‌ జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ టౌన్‌సెండ్ సినియకోవా ద్వయం 6-2, 6-7 (4/7), 6-3తో సె సు వె (చైనీస్‌ తైపీ)-ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జోడీపై గెలిచింది. 

ప్రైజ్‌మనీ..
టౌన్‌సెండ్‌-సినియకోవాలకు.. 8,10,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ.4 కోట్ల 41 లక్షలు).. సెసు వెృఒస్టాపెంకోలకు 4,40,000 డాలర్లు (రూ.2 కోట్ల 39 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. సినియకోవా కెరీర్‌లో ఇది 10వ గ్రాండ్‌స్లామ్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌. 

గతంలో ఆమె బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో కలిసి 2022, 2023 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో.. 2018, 2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో.. 2018, 2022 వింబుల్డన్‌ టోర్నీలో.. 2022 యూఎస్‌ ఓపెన్‌లో.. కోకో గాఫ్‌ (అమెరికా)తో కలిసి 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో.. టౌన్‌సెండ్‌తో కలిసి 2024 వింబుల్డన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది.  
 
తొలి స్విట్జర్లాండ్‌ ప్లేయర్‌గా బెర్నెట్‌..

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బాలుర సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి స్విట్జర్లాండ్‌ ప్లేయర్‌గా హెన్రీ బెర్నెట్‌ గుర్తింపు పొందాడు. జూనియర్‌ బాలుర సింగిల్స్‌ ఫైనల్లో 18 ఏళ్ల బెర్నెట్‌ 6-3, 6-4తో బెంజమిన్‌ విల్‌వెర్త్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. 

గతంలో స్విట్జర్లాండ్‌ తరఫున జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో హెయింజ్‌ గుంతార్ట్‌ (1976 ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌), రోజర్‌ ఫెడరర్‌ (1998 వింబుల్డన్‌), రోమన్‌ వాలెంట్‌ (2001 వింబుల్డన్‌), స్టానిస్లాస్‌ వావ్రింకా (2003 ఫ్రెంచ్‌ ఓపెన్‌), డొమినిక్‌ స్ట్రయికర్‌ (2020 ఫ్రెంచ్‌ ఓపెన్‌) విజేతలుగా నిలిచారు.  

Published date : 28 Jan 2025 03:44PM

Photo Stories