Tokyo Paralympics 2020: పారాలింపిక్స్ హైజంప్‌లో రజతం నెగ్గిన భారత అథ్లెట్?
దాంతో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 10కి చేరింది. ఒకే ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే ప్రథమం. 2021, ఆగస్టు నెలలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు నెగ్గగా... తాజాగా టోక్యోలోనే జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ 10 పతకాలతో కొత్త చరిత్ర సృష్టించింది.
తంగవేలుకి రజతం, శరద్‌కు కాంస్యం...
టోక్యో పారాలింపిక్స్ పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–42 కేటగిరీలో మరియప్పన్ తంగవేలు రజతం నెగ్గగా... ఇదే విభాగంలో శరద్ కుమార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పురుషుల హైజంప్ టి–42 విభాగంలో పోటీపడిన తంగవేలు ప్లేయర్ 1.86 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజత పతకం సాధించాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో తంగవేలు(తమిళనాడు) స్వర్ణం గెలిచిన విషయం విదితమే.
టి–42 విభాగంలోనే పోటీపడిన మరో భారత హైజంపర్ శరద్ కుమార్ 1.83 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్య పతకాన్ని సాధించాడు. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల శరద్ రెండేళ్లుగా ఉక్రెయిన్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. టి–42 కేటగిరీలో కాళ్లలో లోపం, కాళ్ల పొడవులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేని వారు పాల్గొనవచ్చు.
షూటింగ్‌లో సింగ్‌రాజ్‌కు కాంస్యం...
షూటింగ్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. నాలుగేళ్ల క్రితమే షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సింగ్‌రాజ్ పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే పతకంతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సింగ్‌రాజ్ 216.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. చావో యాంగ్ (చైనా–237.9 పాయిం ట్లు) స్వర్ణం, జింగ్ హువాంగ్ (చైనా–237.5 పాయింట్లు) రజతం సాధించారు.
హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణానికి చెందిన 39 ఏళ్ల సింగ్‌రాజ్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. కోచ్‌లు ఓంప్రకాశ్, జేపీ నౌటియాల్, జాతీయ కోచ్ సుభాశ్ రాణా శిక్షణలో రాటుదేలిన సింగ్‌రాజ్ 2018లో ఆసియా పారాగేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాతి ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రజతం, స్వర్ణం గెలిచాడు. యూఏఈలో ఈ ఏడాది జరిగిన పారాస్పోర్ట్ వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో పారాలింపిక్స్–2020 హైజంప్‌లో రజతం నెగ్గిన భారత అథ్లెట్?
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : మరియప్పన్ తంగవేలు(టి–42 కేటగిరీ)
ఎక్కడ : టోక్యో, జపాన్