Skip to main content

Manish Narwal: పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన మనీశ్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత షూటర్‌ మనీశ్‌ నర్వాల్‌ స్వర్ణం పతకం సాధించాడు.
Manish Narwal

 పారాలింపిక్స్‌లో భాగంగా జపాన్‌ రాజధాని టోక్యోలో సెప్టెంబర్‌ 4న జరిగిన షూటంగ్‌ పోటీల్లో మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో 19 ఏళ్ల మనీశ్‌ నర్వాల్‌ 218.2 పాయింట్లు స్కోరు చేసి పారాలింపిక్‌ రికార్డు సృష్టించడంతోపాటు అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారతీయ షూటర్‌ సింగ్‌రాజ్‌ అధానా 216.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలవడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో సింగ్‌రాజ్‌కిది రెండో పతకం కావడం విశేషం. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సింగ్‌రాజ్‌ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.

రెండో క్రీడాకారుడిగా... 
తాజా ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా, ఓవరాల్‌గా మూడో భారత ప్లేయర్‌గా సింగ్‌రాజ్‌(హరియాణా) గుర్తింపు పొందాడు. 1984 పారాలింపిక్స్‌లో అథ్లెట్‌ జోగిందర్‌ సింగ్‌ బేడీ మూడు పతకాలు గెల్చుకోగా... ప్రస్తుత పారాలింపిక్స్‌లో మహిళా షూటర్‌ అవనీ లేఖరా రెండు పతకాలు సాధించింది.

ఫుట్‌బాలర్‌ కావాలనుకొని...
హరియాణాకు చెందిన 19 ఏళ్ల మనీశ్‌ జన్మతః కుడి చేతి వైకల్యంతో జన్మించాడు. తొలుత ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అయితే కుడి చేతి వైకల్యం కారణంగా ఎక్కువ రోజులు ఫుట్‌బాల్‌లో కొనసాగలేకపోయాడు. అనంతరం షూటింగ్‌లో ప్రాక్టీస్‌ చేసిన మనీశ్‌... 2018లో ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం, రజతం సాధించాడు. ఆ తర్వాత 2019 వరల్డ్‌ పారా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌–2020లో స్వర్ణం గెలిచిన భారతీయ షూటర్‌? 
ఎప్పుడు : సెప్టెంబర్‌ 4
ఎవరు : మనీశ్‌ నర్వాల్‌(మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌)
ఎక్కడ : టోక్యో, జపాన్‌
 

Published date : 06 Sep 2021 07:14PM

Photo Stories