Paris Paralympics: పారిస్ పారాఒలింపిక్స్.. పతాకధారులుగా భాగ్యశ్రీ, సుమిత్
ఇటీవల పారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా.. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు అక్కడే పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పాల్గొంటారు.
మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగి 19 పతకాలు (5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) సాధించగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు.
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలో మన అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.
ఫ్లాగ్ బేరర్లుగా భాగ్యశ్రీ, సుమిత్..
పారిస్ పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. టోక్యో పారాలింపిక్స్ ఎఫ్64 విభాగంలో స్వర్ణం నెగ్గిన సుమిత్ అంటిల్.. గత ఏడాది ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం సాధించాడు. మహిళల ఎఫ్34 కేటగిరీలో పోటీపడుతున్న భాగ్యశ్రీ ఆసియా పారా క్రీడల్లో రజతం సాధిచింది.
Paris Olympics: ముగిసిన ఒలింపిక్స్.. ఎక్కువ పతకాలు సాధించిన దేశాలివే! 2028 ఒలింపిక్స్ ఎక్కడంటే..