Skip to main content

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు ఏడు పతకాలు

పారాలింపిక్స్‌లో సెప్టెంబ‌ర్ 2వ తేదీ భారత క్రీడాకారులు రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండుతో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు.
Nitesh Kumar and Sumit Antil Lead India to Historic Golds at Paralympics

పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 కేటగిరీలో నితేశ్‌ కుమార్‌ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్‌ బెథెల్‌ (బ్రిటన్‌)తో జరిగిన ఫైనల్లో నితేశ్‌ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. 

పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 కేటగిరీలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ సుహాస్‌ యతిరాజ్‌ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్‌ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. 

మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎస్‌యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా.. మనీషా రామదాస్‌ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్‌ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. 

కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్‌ రొసెన్‌గ్రెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్‌ సుకాంత్‌ కదమ్‌ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.  

Paralympics: పారాలింపిక్స్‌లో వరుసగా ఐదోసారి పసిడి పతకం సాధించిన‌ రౌవా తిలీ

‘సూపర్‌’ సుమిత్‌ 
అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌64 కేటగిరీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ సుమిత్‌ అంటిల్‌ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్‌ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది.
అంతకుముందు పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌56 కేటగిరీలో భారత అథ్లెట్‌ యోగేశ్‌ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్‌ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు.  
 
శీతల్‌–రాకేశ్‌ జోడీకి కాంస్యం 
ఆర్చరీ మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో శీతల్‌ దేవి–రాకేశ్‌ కుమార్‌ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్‌–రాకేశ్‌ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్‌–రాకేశ్‌ ద్వయం ‘షూట్‌ ఆఫ్‌’లో ఇరాన్‌ చేతిలో ఓడిపోయి ఫైనల్‌ చేరలేకపోయింది. షూటింగ్‌లో నిహాల్‌ సింగ్, అమీర్‌ అహ్మద్‌ భట్‌ మిక్స్‌డ్‌ 25 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. 

సెప్టెంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది. 

Paris Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు 4 పతకాలు..

Published date : 03 Sep 2024 01:42PM

Photo Stories