Skip to main content

Encounter: కశ్మీర్‌లో ఉగ్రకాల్పులు.. నలుగురు సైనికుల వీరమరణం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి.
4 Indian Army Personnel Killed in Clash with Terrorists in Jammu and Kashmir

జూలై 15వ తేదీ దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్‌ బ్రిజేశ్‌ థాపా, నాయక్‌ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్‌కుమార్‌ సింగ్‌ నరుకాగా గుర్తించారు. 

కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్‌కౌంటర్‌. ఇది తమ పనేనని పాక్‌ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ‘కశ్మీర్‌ టైగర్స్‌’ ప్రకటించుకుంది.

ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్‌బాగీ ప్రాంతంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెప్టెన్‌ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి.

దాంతో జూలై 15వ తేదీ మరోసారి చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్‌ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. 

Chandipura Virus: కలకలం రేపుతున్న చాందిపురా వైరస్.. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ!

ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి
ఏప్రిల్‌ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. 
ఏప్రిల్‌ 28: ఉధంపూర్‌ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. 
మే 4: పూంచ్‌ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్‌ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. 
జూన్‌ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. 
జూన్‌ 11, 12: కథువా జిల్లాలో ఎన్‌కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్‌ జవాను అమరుడయ్యాడు. 
జూన్‌ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. 
జూన్‌ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాల్చివేత. 
జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. 
జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. 
జూలై 15: దోడా ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం.

Anti Narcotics Helpline: యాంటి నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ ఇదే..

Published date : 17 Jul 2024 03:06PM

Photo Stories