Skip to main content

Suhas Yathiraj: టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన జిల్లా కలెక్టర్‌?

టోక్యో పారాలింపిక్స్‌–2020లో ఐఏఎస్‌ అధికారి, నోయిడా జిల్లా కలెక్టర్‌ సుహాస్‌ యతిరాజ్‌ రజత పతకం సాధించాడు. టోక్యో వేదికగా 2021, సెప్టెంబర్‌ 5న జరిగిన బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–4 విభాగం ఫైనల్లో సుహాస్‌ 21–15, 17–21, 15–21తో రెండుసార్లు ప్రపంచ పారా చాంపియన్‌ లుకాస్‌ మజూర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడిపోయి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Suhas Yathiraj

 38 ఏళ్ల సుహాస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. కర్ణాటకలోని హసన్‌ ప్రాంతానికి చెందిన కంప్యూటర్‌ ఇంజినీర్‌ సుహాస్‌ 2007 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధనగర్‌ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కాలి పాదాల వైకల్యమున్నా... బ్యాడ్మింటన్‌ అంటే ఎనలేని ఆసక్తి. ప్రొఫెషనల్‌ పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా ఎదిగి.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. 2016లో బీజింగ్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యూరోక్రాట్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ‘యశ్‌ భారతి’ పురస్కారంతో సుహాస్‌ను సత్కరించింది. జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో టీమ్‌ విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. ఇలా అంతర్జాతీయ కెరీర్‌లో ఈ పారా షట్లర్‌ 5 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలు గెలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన జిల్లా కలెక్టర్‌?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 5
ఎవరు    : సుహాస్‌ యతిరాజ్‌
ఎక్కడ    : టోక్యో, జపాన్‌
ఎందుకు : బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–4 విభాగం ఫైనల్లో సుహాస్‌ 21–15, 17–21, 15–21తో లుకాస్‌ మజూర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడిపోయినందున... 
 

Published date : 07 Sep 2021 03:21PM

Photo Stories