GSLV-F14: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్14 ప్రయోగం విజయవంతం
ఫిబ్రవరి 17వ తేదీ (శనివారం) శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ విజయవంతంగా శాటిలైట్‌ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది.
కాగా.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఈ రోజు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లిన జీఎస్ఎల్వీ-F14 రాకెట్ ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 19 నిమిషాల్లోనే నింగిలోని నిర్ణీత కక్షకు రాకెట్ చేరుకునేలా సైంటిస్ట్‌లు రూపకల్పన చేశారు.
గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్–3డీ, ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్‌శాట్–3డీఎస్‌ని పంపారు. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులపై అధ్యయనం చేయనుంది.