Skip to main content

Union cabinet reshuffle: న్యాయశాఖ నుంచి కిరణ్‌ రిజిజు ఔట్‌

కేంద్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రుల్లో ఇద్దరి శాఖలను మార్చుతూ న‌రేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్‌ రిజిజును ఆ బాధ్యతల నుంచి తొలగించారు. కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌కు న్యాయమంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు.
Kiren Rijiju, Arjun Meghwal
Kiren Rijiju, Arjun Meghwal

ఇక రిజిజుకు భూ విజ్ఞానశాస్త్ర శాఖ (Ministry of Earth Sciences) బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి గురువారం ప్రకటన వెలువడింది.

➤☛ ఇక‌పై సెకండ్ ఇయ‌ర్ నుంచి బ్రాంచి మార‌తామంటే కుద‌ర‌దు.. స్ప‌ష్టం చేసిన కేంద్రం

ప్రస్తుతం అర్జున్‌ మేఘ్వాల్‌ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాజాగా అద‌న‌పు బాధ్య‌త‌ల‌తో ఇకపై న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా వ్యవహరించనున్నారు. కేబినెట్‌ హోదా లేకుండా న్యాయశాఖను స్వతంత్ర మంత్రికి అప్పగించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు భూవిజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ చూస్తుండగా.. ఆ శాఖను కిరణ్‌ రిజిజుకు అప్పగించారు.

central cabinet

జితేంద్ర సింగ్‌ వద్ద ఇప్పటికే శాస్త్ర, సాంకేతికాభివృద్ధితోపాటు పలు శాఖలు ఉన్నాయి. అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌.. రాజస్థాన్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

➤☛ రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!

జడ్జీల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కిరణ్‌ రిజిజు గతేడాది నవంబరులో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని అప్పట్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల వేళ న్యాయశాఖ మంత్రి మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

Published date : 18 May 2023 05:31PM

Photo Stories