PM Vishwakarma: ‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం
రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారుచేసేవారు, తాళాలు తయారుచేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు తదితర సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి ప్రయోజనం కల్పించాలని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Amrit Bharat station Scheme: రూ.24,470 కోట్లతో రేల్వేస్టేషన్ల పునర్నిర్మాణం
విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు’ అందజేస్తారు. రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కల్పిస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లబ్దిదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సై తం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది.
శిక్షణ కాలంలో రోజుకి రూ.500 స్టైపెండ్
పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్‌డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. లబ్దిదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంత్రాలు, పరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వివరించారు. గురు–శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని స్పష్టం చేశారు. తొలుత 18 రకాల సంప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు.
Cinematograph (Amendment) Bill, 2023: సినిమాటోగ్రఫీ(చట్ట సవరణ) బిల్లు–2023