PM Vishwakarma Yojana: ‘పీఎం విశ్వకర్మ యోజన’కు దరఖాస్తుల ఆహ్వానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో రుణాల కోసం అర్హులైన సంప్రదాయ చేతివృత్తిదారుల, హస్తకళల నిపుణులు, కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు నవంబర్ 17 శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. వడ్రంగి, బంగారం పని చేసేవారు, వివిధ రకాల చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద 5 శాతంతో రూ. 3లక్షల వరకు రుణ సహాయం అందించనున్నట్లు తెలిపారు. విశ్వకర్మ యోజన కింద ఆర్థిక సహాయం పొందేందుకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలన్నారు. ఇప్పటికే పీఎంఈజీపీ, పీఎం స్వానిధి, ముద్ర వంటి రుణాలు పొందిన వారికి ఈ పథకం వర్తించదన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, చిరునామా ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డుతో పాటు ఇతర ప్రభుత్వం ఆమోదం పొందిన డాక్యుమెంట్లు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ ఫోన్ నంబర్ జత చేసి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ కార్యాలయంలోని కామన్ సర్వీస్ సెంటర్స్, pmviswakarma.gov.in వెబ్‌సైట్ నందు సంప్రదించాలని తెలిపారు.
చదవండి: Free Coaching : ఉచిత సివిల్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి