Skip to main content

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు 73 దేశాల దౌత్యవేత్తలు.. ఇదే తొలిసారి!

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళా విశిష్టతను యావత్‌ ప్రపంచం గుర్తించింది.
Diplomats of 73 Nations to Experience Maha Kumbh Mela 2025

దీంతో పవిత్ర త్రివేణీ సంగమం ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. తొలిసారిగా 73 దేశాల నుంచి దౌత్యవేత్తలు సంగమంలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.
 
త్రివేణీ సంగమానికి వస్తున్న దౌత్యవేత్తల విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచమంతా ప్రత్యర్థులుగా భావిస్తున్న రష్యా, ఉక్రెయిన్ రాయబారులు కూడా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

ఈ మహాకుంభమేళా కార్యక్రమం గంగా నది ఒడ్డున జరుగుతున్న విభిన్న సంస్కృతులు, భావజాలాల సామరస్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ కార్యక్రమంలో అమెరికా, బంగ్లాదేశ్ దౌత్యవేత్తలు కూడా పాల్గొననున్నారు.

మీడియాకు కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మహా కుంభమేళాలో పాల్గొననున్నారు. ఈ విషయమై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ పంపింది. 

ఈ దౌత్యవేత్తలంతా బడే హనుమాన్ ఆలయం తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు. వీరు ముందుగా పడవలో సంగమ తీరం చేరుకుని, పుణ్యస్నానం చేసి, బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు.

Mauni Amavasya: మౌని అమావాస్యా.. ఆ రోజు అనుసరించాల్సిన పద్ధతులు ఇవే.. కుంభమేళాలో ఇది అత్యంత ప్రత్యేకమైన రోజు! ఆ రోజు ఎప్పుడంటే..?

అనంతరం డిజిటల్ మహాకుంభ్ కేంద్రాన్ని సందర్శించి, కుంభమేళా పరమార్థాన్ని తెలుసుకోనున్నారు. తరువాత వీరంతా యూపీ స్టేట్ పెవిలియన్, అఖాడా, యమునా కాంప్లెక్స్, అశోక స్తంభం తదితర ‍ప్రదేశాలను సందర్శించనున్నారు. కాగా బమ్రౌలి విమానాశ్రయంలోని ప్రత్యేక వీఐపీ లాంజ్‌లో విదేశీ అతిథులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. 140 ప్రత్యేక పడవలను కూడా ఏర్పాటు చేశారు.

కుంభమేళాకు హాజరుకానున్న దౌత్యవేత్తలు.. ఈ దేశాల వారే..
మహా కుంభమేళాకు.. జపాన్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, జర్మనీతో పాటు అర్మేనియా, స్లోవేనియా, హంగేరీ, బెలారస్, సీషెల్స్, మంగోలియా, కజకిస్తాన్, ఆస్ట్రియా, పెరూ, గ్వాటెమాల దేశాలకు చెందిన దౌత్యవేత్తలు తరలి వస్తున్నారు. 

అలాగే.. మెక్సికో, అల్జీరియా, దక్షిణాఫ్రికా ఎల్ సాల్వడార్, చెక్ రిపబ్లిక్, బల్గేరియా, జోర్డాన్, జమైకా, ఎరిట్రియా, ఫిన్లాండ్, ట్యునీషియా, ఫ్రాన్స్, ఎస్టోనియా, బ్రెజిల్, సురినామ్, జింబాబ్వే దేశాల రాయబారులు కూడా కుంభమేళాకు హాజరుకానున్నారు. 

అదేవిధంగా.. మలేషియా, మాల్టా, భూటాన్, లెసోతో, స్లోవాక్, న్యూజిలాండ్, కంబోడియా, కిర్గిస్తాన్, చిలీ, సైప్రస్, క్యూబా, నేపాల్, రొమేనియా, వెనిజులా, అంగోలా, గయానా, ఫిజి, కొలంబియా, సిరియా, గినియా, మయన్మార్, సోమాలియా, ఇటలీ, బోట్స్వానా, పరాగ్వే, ఐస్లాండ్, లాట్వియా, నెదర్లాండ్స్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, థాయిలాండ్, పోలాండ్, బొలీవియా దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కుంభమేళాను సందర్శించనున్నారు.

Maha Kumbh 2025:: మహా కుంభమేళాలో 'ఒకే ప్లేట్, ఒకే బ్యాగ్'

Published date : 25 Jan 2025 03:01PM

Photo Stories