Modi Congratulates Sunank : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై అంగీకారం
ప్రపంచంలో రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ కలిసి పనిచేయాలని, ఇరు దేశాల నడుమ రక్షణ, ఆర్థికపరమైన భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. రెండు దేశాలు కలిసికట్టుగా సాధించబోయే ఘనత కోసం తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తనను అభినందించినందుకు గాను ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ గురువారం ఫోన్‌లో రిషి సునాక్‌తో మాట్లాడి, అభినందించారు. ‘‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై రిషి సునాక్ ట్విట్టర్‌లో స్పందించారు. కొత్త పాత్రలో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, బ్రిటన్–భారత్ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్‌తో మోదీ మాట్లాడడం ఇదే మొదటిసారి.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP