COP27: వాతావరణ మార్పులు, దుష్పరిణామాలపై చర్చలు
వాతావరణ మార్పులు, దుష్పరిణామాలు, నియంత్రణ చర్యలు, గత ఒప్పందాల అమలు తీరుపై రెండు రోజులపాటు విస్తృతంగా చర్చించనున్నారు. కాప్–27లో భాగంగా ఈ నెల 7, 8న జరిగే సమావేశాలకు పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. వాతావరణ మార్పుల నియంత్రణే లక్ష్యంగా గతంలో కాప్ సదస్సులు జరిగాయి. అయితే, ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. అగ్రదేశాల సహాయ నిరాకరణే ఇందుకు కారణం. తాజా సదస్సులో ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
Also read: Global Investors' Meet 2022: ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే జీఐ సదస్సులో మోదీ వ్యాఖ్యలు
తరానికి ఒకసారి వచ్చే అవకాశం
వాతావరణ మార్పులు భూగోళంపై సమస్త జీవజాలానికి విసురుతున్న పెను సవాళ్లపై ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ చైర్మన్ హోయిసంగ్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాప్–27లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. భూతాపాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సన్నద్ధం కావాలని, హరితగృహ(గ్రీన్ హౌజ్) వాయువుల ఉద్గారాన్ని తక్షణమే తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. మన జీవితాలను, మన భూగ్రహాన్ని కాపాడుకొనేందుకు తరానికి ఒకసారి వచ్చే అవకాశం ఇదేనని చెప్పారు.
Also read: UNSC: ఉగ్ర ‘టూల్‌కిట్’లో సోషల్ మీడియా
ఇంకెన్ని హెచ్చరికలు కావాలి?
గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ప్రపంచదేశాలు చెప్పుకోదగ్గ పురోగతి సాధించాయని కాప్–26 అధ్యక్షుడు, బ్రిటిష్ రాజకీయవేత్త అలోక్ శర్మ తెలిపారు. కర్బన ఉద్గారాల నియంత్రణపై మరిన్ని లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, 2015 పారిస్ ఒప్పందంలోని నిబంధనలను ఖరారు చేయడం, బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవడం వంటివి ఈ లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు (2.7 ఫారన్‌హీట్) పరిమితం చేయాలన్న ఆశయాన్ని కొనసాగించాలని కోరారు. పారిస్ ఒప్పందంలో ఇదే అత్యంత కీలక లక్ష్యమని గుర్తుచేశారు. ఉష్ణోగ్రత పెరుగుదలను కచ్చితంగా నియంత్రించాలని, దీన్ని పారిశ్రామిక విప్లపం నాటికంటే ముందున్న ఉష్ణోగ్రతకు తీసుకురావాలన్నారు. అయితే, ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు కొన్ని బడా దేశాలు తూట్లు పొడుస్తున్నాయని అలోక్ శర్మ తీవ్రంగా ఆక్షేపించారు.
Also read: Web 3.0: వెబ్ 3.0పై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు
ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ దండయాత్ర వల్ల అంతర్జాతీయంగా సంక్షోభాలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. పలు దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని వాపోయారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ అంశాలపై దృష్టి పెట్టేలా సామర్థ్యం పెంచుకోవాలన్నారు. మాటలు కట్టిబెట్టి కార్యాచరణలోకి దిగాలన్నారు. ప్రపంచ దేశాల అధినేతలకు ప్రపంచ నుంచి ఇంకా ఎన్ని మేల్కొల్పులు, హెచ్చరికలు అవసరం? అని అలోక్ శర్మ ప్రశ్నించారు. సదస్సులో యూఎన్ క్లైమేట్ చీఫ్ సైమన్ స్టియిల్ మాట్లాడారు. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆతిథ్య దేశమైన ఈజిప్ట్ విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ చెప్పారు. కాప్–27 అధ్యక్షుడిగా షౌక్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రతిజ్ఞల దశ నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణ దిశగా ముందుకెళ్లాలని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిస్సీ పిలుపునిచ్చారు.
Also read: One Nation One Uniform : పోలీసులకి ఒకే యూనిఫాం ఉండాలి : మోదీ
2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి
న్యూఢిల్లీ: పారిశ్రామిక విప్లవం (1850–1900) కంటే ముందునాటి సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండనుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఫలితంగా 2015 నుంచి 2022 దాకా.. ఎనిమిదేళ్లు ‘అత్యంత వేడి’ సంవత్సరాలుగా రికార్డుకెక్కుతాయని తెలియజేసింది. ఈజిప్ట్ లో జరుగుతున్న కాప్–27 సదస్సు సందర్భంగా నవంబర్ 6న ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 1993 నుంచి ఇప్పటిదాకా సముద్ర నీటి మట్టం రేటు రెండింతలు పెరిగిందని వెల్లడించింది. 2022 సంవత్సరం ఐదు లేదా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులో చేరుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 5th కరెంట్ అఫైర్స్