Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 5th కరెంట్ అఫైర్స్
Prime Minister Israel: ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు.
Also read: Lula da Silva: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో డ సిల్వా జయకేతనం
ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు
ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి.
Korea: ఉభయ కొరియాల మధ్య... ఉద్రిక్తతలు మరింత తీవ్రం
సియోల్: ఉభయకొరియాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తరకొరియా నవంబర్ 5న సరిహద్దు ప్రాంతాల్లోకి 180 యుద్ధ విమానాలను తరలించింది. దక్షిణ కొరియా కూడా దీటుగా అత్యాధునిక ఎఫ్–35 ఫైటర్ జెట్లు సహా 80 మిలటరీ ఎయిర్ క్రాఫ్టులను మోహరించింది. ఉత్తర కొరియా నవంబర్ 3న రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించడం, వాటిలో ఒకటి దక్షిణకొరియా సరిహద్దుల్లో పడటం తెలిసిందే. ప్రతిగా దక్షిణ కొరియా కూడా మూడు గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించింది. నవంబర్ 3న కూడా ఉత్తరకొరియా ఆరు క్షిపణులు ప్రయోగించడంతో జపాన్ అప్రమత్తమైంది. అమెరికా, దక్షిణ కొరియా 240 యుద్ధ విమానాలతో చేస్తున్న సంయుక్త విన్యాసాలు నవంబర్ 4తో ముగియాల్సి ఉంది. తాజా పరిణామాలతో వాటిని నవంబర్ 5 వరకు కొనసాగించనున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ తప్పిదానికి పశ్చాత్తాప పడతాయంటూ బెదిరించింది. కానీ, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించలేదు. అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందడంతోపాటు ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఇటువంటి తెగింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: ICBM: ఆగని ఉత్తర కొరియా క్షిపణులు
Pension Scheme: పెన్షన్ (సవరణ) పథకం సబబే
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, పెన్షన్ నిధిలో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. 2014 నాటి సవరణ ప్రకారం ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్‌నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్‌ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్ 4న విచారణ జరిపింది. పెన్షన్ పథకంలో చేరలేకపోయిన ఉద్యోగులు 6 నెలల్లోగా చేరొచ్చంది. రూ.15,000 వేతనం దాటినవారు 1.16 శాతాన్ని పెన్షన్ పథకంలో జమ చేయాలన్న నిబంధన చెల్లదని స్పష్టం చేసింది.
Chengdu Korea: భారత పురుషుల స్క్వాష్ జట్టు ఆసియాలో తొలిసారి స్వర్ణం సాధించింది
చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. నవంబర్ 4న జరిగిన ఫైనల్లో భారత్ 2–0 తేడాతో కువైట్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. తొలి మ్యాచ్‌లో రమీత్ టాండన్ 11–5, 11–7, 11–4తో అలీ అరామెజిపై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ 11–9, 11–2, 11–3తో అమ్మార్ అల్టమిమిని చిత్తు చేశాడు. ఫలితం తేలడంతో అభయ్ సింగ్, ఫలా మొహమ్మద్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్‌ను నిర్వహించలేదు. గతంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ రెండు సార్లు రన్నరప్‌గానే నిలిచింది. సెమీఫైనల్లో మలేసియా చేతిలో 1–2తో ఓడిన భారత మహిళల జట్టుకు కాంస్యం లభించింది.
Pro Hockey League:భారత్ ఘనవిజయం
భువనేశ్వర్: ఆద్యంతం అటాకింగ్‌తో ప్రత్యర్థిపై చెలరేగిన భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో కీలక విజయాన్ని నమోదు చేసింది. నవంబర్ 4న జరిగిన మ్యాచ్‌లో భారత్ 7–4 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి క్వార్టర్‌లో కివీస్ ఆధిక్యం ప్రదర్శించినా, ఆ తర్వాత భారత్ జోరు ముందుకు నిలవలేకపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ (7వ నిమిషం, 19వ ని.) సాధించగా, కార్తీ సెల్వమ్ (17వ ని., 38వ ని.) మరో రెండు గోల్స్ కొట్టాడు. రాజ్‌కుమార్ పాల్ (31వ ని.), సుఖ్‌జీత్ సింగ్ (50వ ని.), జుగ్‌రాజ్ సింగ్ (53వ ని.) భారత్‌కు మిగతా గోల్స్ అందించారు. న్యూజిలాండ్ తరఫున సైమన్ చైల్డ్ (2వ ని.), స్యామ్ లేన్ (9వ ని.), స్మిత్ జేక్ (14వ ని.), నిక్‌వుడ్స్ (54వ ని.) గోల్స్ చేశారు.
Telanganaలో 3 నేషనల్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. నవంబర్ 12న రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఈ రోడ్ల పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేయటం ఇదే మొదటిసారి. గతంలో మనోహరా బాద్ కొత్తపల్లి రైల్వే లైన్‌కు గజ్వేల్ కేంద్రంగా మోదీ శంకుస్థాపన చేశారు. రోడ్డు పనులకు ఆ శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పుడు మొదటిసారి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు.
Also read: IFR Japan: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు భారత యుద్ధ నౌకలు
మెదక్– సిద్దిపేట–ఎల్కతుర్తి మధ్య 134 కి.మీ. నిడివితో విస్తరించే ఎన్‌హెచ్–265 డీజీ పనులు ప్రారంభిస్తారు. రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో విస్తరించే ఈ పనులకు రూ.1461 కోట్లు వ్యయం అంచనా. రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో విస్తరించే బోధన్–బాసర–భైంసా రోడ్డు పనులు ప్రారంభిస్తారు. 56 కి.మీ. నిడివితో ఉండే ఈ రోడ్డు విస్తరణకు రూ.644 కోట్లు ఖర్చు కానున్నాయి. 17 కి.మీ. నిడివితో ఉండే సిరోంచ–మహదేవ్‌పూర్ సెక్షన్ పరిధిలో ఆత్మకూరు వరకు జరిగే రోడ్డు పనులను కూడా ప్రారంభిస్తారు. పేవ్డ్ షోల్డర్స్‌తో కూడిన ఈ రెండు వరసల రోడ్డు విస్తరణకు రూ.163 కోట్లు వ్యయం కానుంది.
Women's startup: తెలంగాణ మహిళా వ్యవస్థాపకులకు జాతీయస్థాయి గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఐదుగురు మహిళా స్టార్టప్ వ్యవస్థాపకు లకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నీతి ఆయోగ్‌లోని అటల్ ఇన్నొవేషన్ మిషన్ నవంబర్ 4న 75 మంది విజయవంతమైన మహిళా వ్యవస్థాపకుల (స్టార్టప్స్) వివరాలతో ‘ఇన్నొవేషన్ ఫర్ యు’ అనే కాఫీటేబుల్ బుక్‌ను విడు దలచేసింది. అంత్యేష్టి ఫ్యునరల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ వ్యవస్థాపకు రాలు శ్రుతిరెడ్డి రాపోలు, ఆటోక్రసీ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు సంతోషి బుద్ధిరాజు, గరుడాస్ట్ర ఏరో ఇన్వెంటివ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు CEO శ్వేత గెల్లా, నేచర్స్ బయో ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు ప్రతిభా భారతి, నియో ఇన్వెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు CEO శ్రీవల్లి శిరీష తమ తమ నూతన ఆవిష్కరణలతో కాఫీటేబుల్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ పుస్తకాన్ని జాతి భవిష్యత్తు నాయకులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న మహిళలందరికీ అంకితం ఇస్తున్నామని ఆవిష్కర్త, అటల్ ఇన్నొవేషన్ మిషన్ డైరెక్టర్ చింతన్ వైష్ణవ్ తెలిపారు.
Also read: CRPF: ఇద్దరు సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు తొలిసారిగా ఐజీ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యారు
IIT Hyd: స్థానిక పదార్థాలతో సరికొత్త కాంక్రీట్ అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్, పరిశోధన విభాగం సరికొత్త కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. స్థానికంగా లభించే ఫ్లైయాష్ (బొగ్గును మండించాక మిగిలే బూడిద), ఇసుక, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (నిప్పుల కొలిమిల్లో వివిధ మిశ్రమాలను మండించాక మిగిలే పదార్థం), మైక్రో సిలికా (ఓ రకమైన బూడిద), నీరు, స్టీల్ ఫైబర్ (పలచని స్టీల్ ముక్కలు), పాలీప్రొలిన్ ఫైబర్స్ (ఓ రకమైన ప్లాస్టిక్ పీచు) వంటి వాటిని ఉపయోగించి ఈ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రకటించింది. దీనికి అల్ట్రా హైపర్ఫార్మెన్స్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (యూహెచ్‌పీఎఫ్‌ఆర్‌సీ)గా పేరుపెట్టింది. సాధారణ కాంక్రీట్‌తో పోలిస్తే సుమారు రెండింతల తక్కువ వ్యయంలోనే దీన్ని తయారు చేసే అవకాశం ఉందని... బ్రిడ్జీలు, పొడవైన కట్టడాలకు అవసరమైన బీమ్‌లకు, స్తంభాలు, ఇతర నిర్మాణాలకు ఈ నూతన కాంక్రీట్‌ను ఉపయోగించుకోవచ్చని ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఫ్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాశ్ పేర్కొన్నారు.
Also read: IIT-Roorkee Researchers: శ్వాసతోనే క్యాన్సర్‌ను కనిపెట్టొచ్చు
హైదరాబాద్ ఐఐటీలోని క్యాస్టన్ ల్యాబ్‌లో ఈ నూతన కాంక్రీట్ పనితీరును పరీక్షించామన్నారు. డిజైన్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఈ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. నూతన కాంక్రీట్ 150 ఎంపీయూ కంప్రెసివ్ స్ట్రెంత్‌ను కలిగి ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి నిర్మాణ సామగ్రిని అభివృద్ధి చేయడమంటే ‘ఆత్మనిర్భర్ భారత్’ కల సాకారం దిశగా ముందడుగు వేయడమేనన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP