Global Investors' Meet 2022: ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే జీఐ సదస్సులో మోదీ వ్యాఖ్యలు
విధాన స్థాయిలో విపరీతమైన అలసత్వం, నిర్ణయాల్లో అయోమయం వంటివాటికి బీజేపీ హయాంలో పూర్తిగా తెర దించి పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.నవంబర్ 2న బెంగళూరులో మొదలైన మూడు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ఇన్వెస్ట్ కర్నాటక–2022ను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 8,400 కోట్ల డాలర్ల మేరకు ఎఫ్‌డీఐలు వచ్చాయి. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధ భయాల వేళ ఇది చాలా పెద్ద ఘనత. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ ఒడిదొడుకులమయంగా సాగుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఆర్థికంగా అద్భుతాలు చేసి చూపుతోంది. మన ఆర్థిక వ్యవస్థ పునాదులు అత్యంత పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. ఇటీవలి కాలంలో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన సన్నద్ధత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పాయి’’ అన్నారు.
Also read:PM Modi : మన ఉక్కు పరిశ్రమ శక్తికి ఐఎన్‌ఎస్ విక్రాంతే తార్కాణం
వహ్వా కర్నాటక!
పదేళ్ల క్రితం దాకా భారత్‌లో పరిస్థితి పూర్తి చాలా నిరాశాజనకంగా ఉండేదని మోదీ అన్నారు. ‘‘మేమొచ్చాక యువతకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించాం. సాహసోపేతమైన సంస్కరణలు, భారీ మౌలిక వ్యవస్థలు, అత్యున్నత నైపుణ్యాల కలబోతగా నూతన భారత నిర్మాణం సాధ్యపడింది. సంప్రదాయేతర ఇంధన రంగంలో భారత విజయాలు ప్రపంచమంతటికీ ఉదాహరణగా నిలిచాయి. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలుండటం వల్ల కర్నాటకకూ డబుల్ ఇంజన్ సామర్థ్యం సమకూరింది. ఫలితంగా చాలా రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోంది. పరిశ్రమల నుంచి ఐటీ, బయోటెక్, స్టార్టప్‌లు, ఇంధన రంగాల దాకా రికార్డు స్థాయి ప్రగతి చరిత్రను లిఖిస్తూ తోటి రాష్ట్రాలకే గాక పలు ఇతర దేశాలకు కూడా సవాలు విసులుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, టెక్నాలజీ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా మొట్టమొదట గుర్తొచ్చేది ‘బ్రాండ్ బెంగళూరు’’ అని కొనియాడారు. ‘బిల్డ్ ఫర్ ద వరల్డ్’ నినాదంతో సదస్సును నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Also read: Rozgar Mela: 10 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి: ప్రధాని మోదీ