Skip to main content

Electric Buses: పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద.. హైదరాబాద్‌కు 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులు

పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద కేంద్రం రెండు రాష్ట్రాల‌కు ఎలక్ట్రిక్‌ బస్సులు ఆమోదం తెలిపింది.
Electric Buses In Bengaluru, Hyderabad

హైదరాబాద్‌లో డీజిల్‌ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు భారీగా రాబోతున్నాయి. పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులు ఇవ్వాలని గత సెప్టెంబర్‌లో తెలంగాణ ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేసింది. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తాజాగా ఆర్టీసీ కోరిన బస్సులకు సబ్సిడీ మొత్తాన్ని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 

త్వరలో ఈ బస్సుల సరఫరాకు టెండర్లు పిలవనున్నారు. జూన్‌ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సరఫరా ప్రారంభించనున్నారు. టెండర్‌ దక్కించుకునే సంస్థ విడతలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టి, గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు (జీసీసీ) విధానంలో నిర్వహిస్తుంది.  

ప్రస్తుతానికి రెండు నగరాలకే.. 
దేశవ్యాప్తంగా 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 9 నగరాల్లో వీలైనన్ని ఎక్కువ ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలని కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ–డ్రైవ్‌ పథకం మొదటి విడతలో లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడత 2026 మార్చి వరకు కొనసాగనుంది.

E-Waste Business: దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వ్యర్థాల ఉత్పత్తి.. భారీ లాభాలు..!

ఇందులో మొత్తం 14,028 బస్సులను సరఫరా చేయా లని నిర్ణయించింది. ఇందుకోసం 4,391 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 2,800 బస్సులు ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ దరఖాస్తు చేసింది. బెంగళూరు సిటీ కోసం కర్ణాటక ఆర్టీసీ 7 వేల బస్సులు కోరింది.

కేంద్రం ఈ రెండు నగరాలకు 9,800 బస్సుల సబ్సిడీ మొత్తానికి ఆమోదం తెలిపింది. ఈ పథకంలో పేమెంట్‌ సెక్యూరిటీ మెకానిజం అనే అంశాన్ని కేంద్రం పొందుపరిచింది. జీసీసీ పద్ధతిలో ప్రైవేటు సంస్థ ఈ బస్సులను ఆర్టీసీ పరిధిలో నిర్వహిస్తుంది. ఆ బస్సులు తిరిగిన దూరం ఆధారంగా అద్దెను ఆ సంస్థకు ఆర్టీసీ చెల్లించాలి.

ఒకవేళ నెల రోజులపాటు ఆర్టీసీ చెల్లించలేకపోతే, ఆ మొత్తాన్ని కేంద్రం చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తు పేమెంట్‌ సెక్యూరిటీ మెకానిజం నుంచి ఆ మొత్తాన్ని తీసేసుకుంటుంది. అంతమేర సొమ్మును తిరిగి మూడు నెలల్లో రాష్ట్రం ఆ మెకానిజంలో భర్తీ చేయాల్సి ఉంటుంది.

నగరానికి సరఫరా అయ్యే 2,800 బస్సులకు సాలీనా అద్దె దాదాపు రూ.120 కోట్లు ఉంటుందని ఆర్టీసీ అంచనా వేసింది. రూ.1.85 కోట్ల విలువైన ఒక్కో బస్సుపై గరిష్టంగా 30 శాతం వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తోంది.

Micro Irrigation Scheme: సూక్ష్మ సేద్యం రైతులకు 100 శాతం సబ్సిడీ ఖరారు

Published date : 22 Feb 2025 10:14AM

Photo Stories