Skip to main content

CJI Chandrachud: గణనీయంగా పెరుగుతున్న మార్కెట్లు.. సెబీ, శాట్ జాగ్రత్త!!

ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్‌ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ రెగ్యులేటర్‌–సెబీ, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు (శాట్‌) కీలక సూచనలు చేశారు.
CJI Chandrachud Advises SEBI, SAT On Market Surge

ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి,  వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్‌ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్‌ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్‌ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. 
    
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచ్చిన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు.  

Finance Ministry: జీఎస్‌టీతో భారీగా తగ్గిన ఉత్పత్తుల ధరలు

శాట్‌ కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభం.. 
నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ రూపొందించిన శాట్‌ కొత్త వెబ్‌సైట్‌ను భారత్‌ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్‌ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 

Published date : 06 Jul 2024 01:40PM

Photo Stories