Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 22nd కరెంట్ అఫైర్స్
RYTHU BIMA: రైతు బీమాకు రూ. 1,450 కోట్లు.. ఒక్కో రైతుకు రూ.3,830 చొప్పున చెల్లింపు
ఈ ఏడాదికి సంబంధించిన రైతు బీమా ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఒక్కో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు చెల్లించింది. గతేడాది కంటే ఎక్కువగా రైతులు ఈ పథకం కింద నమోదు అయ్యారు. గతేడాది 35.64 లక్షల మంది లబి్ధదారులు ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 37.77 లక్షలకు చేరినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే అదనంగా 2.13 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.
Also read: Dalit Bandhu: దళితబంధు 600కోట్లు.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు
2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.
బీమా పరిధిలోని రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు (నామినీ) పరిహారంగా ఎల్‌ఐసీ రూ.5 లక్షలు అందజేస్తుంది.
Also read: Telangana : తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు.. అలాగే పార్లమెంట్ కొత్త భవనానికి కూడా..
గతేడాది కంటే ప్రీమియం తగ్గుదల
గతేడాది కంటే ప్రీమియం సొమ్మును తగ్గించేలా ఎల్‌ఐసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. గతేడాది ఒక్కో రైతుకు రూ.4,110 చొప్పున చెల్లించగా, ఈ ఏడాది రూ.3,830 మాత్రమే చెల్లించారు. ఆ ప్రకారం గతేడాది 35.64 లక్షల మంది రైతులకు రూ.1,465 కోట్లు చెల్లించగా, ఈసారి 37.77 లక్షల మంది రైతులకు రూ.1,450 కోట్లు చెల్లించారు.
Fed Rate Hike: ఫండ్స్ రేటు 0.75 శాతం పెంపు
ధరల అదుపే లక్ష్యంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3–3.25 శాతానికి ఎగశాయి. వెరసి వరుసగా మూడోసారి రేట్లను పెంచింది. గత నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణ కట్టడికే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ప్రాధాన్యత ఇచ్చినట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు.
Also read: Financial Year:ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం అప్
ఈ నేపథ్యంలో డాలరు ఇండెక్స్ 110ను అధిగమించగా.. ట్రెజరీ ఈల్డ్స్ 3.56 శాతాన్ని తాకాయి. అయితే 2022 జనవరి–మార్చిలో 1.6 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ ఏప్రిల్–జూన్‌లోనూ 0.6 శాతం నీరసించింది.
PLI scheme: ‘సోలార్’కు రెండో విడత పీఎల్‌ఐ.. రూ.19,500 కోట్లను ప్రకటించిన ప్రభుత్వం
అధిక సామర్థ్యాలు కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ స్కీమ్) కింద మరో రూ.19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 65 గిగావాట్ల అధిక సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది.
ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 21న నిర్ణయాలు తీసుకుంది.
దేశీ అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం మొదటి విడత రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను సోలార్ మాడ్యూళ్ల తయారీకి ప్రకటించింది. ఇప్పుడు దేశీ అవసరాలతోపాటు.. దేశం నుంచి ఎగుమతులు పెంచే లక్ష్యంతో రెండో విడత కింద రూ.19,500 కోట్లను ప్రకటించింది.
Also read: National Logistics Policy 2022: దేశంలో నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం.. 5,000కు పైగా ‘స్కిల్ హబ్స్’
ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.94,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి, పరోక్షంగా 7.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా వేస్తోంది.
National Logistics Policy: రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు
రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడం, దేశీయంగా ఈ రంగానికి సంబంధించి వ్యయాలు తగ్గింపు లక్ష్యంగా రూపొందించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి కేంద్రం కేబినెట్ సెప్టెంబర్ 20న ఆమోదముద్ర వేసింది. దేశమంతటా ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా సరకు రవాణాకూ తాజా పాలసీ వీలు కల్పిస్తుంది.
Also read: FM Nirmala Sitharaman: ఫైనాన్షియల్ రంగంపై నిరంతర అప్రమత్తత: ఎఫ్‌ఎస్‌డీసీ
పాలసీని గత వారం ప్రధాన నరేంద్రమోదీ ఆవిష్కరిస్తూ, ‘‘ప్రస్తుతం జీడీపీ అంకెలతో పోల్చితే 13–14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలను వీలైనంత త్వరగా సింగిల్ డిజిట్‌కు తీసుకురావాలని మనమందరం లక్ష్యంగా పెట్టుకోవాలి’’ అని ఉద్ఘాటించారు.
సెమీకండక్టర్ పీఎల్‌ఐలో మార్పులు
సెమీకండక్టర్ ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీమ్‌లో ప్రధాన మార్పులకు కేంద్ర మంతిమండలి ఆమోదముద్ర వేసింది. టెక్నాలజీ నెట్‌వర్క్ చైన్‌లో చిప్ ఫ్యాబ్‌లకు సంబంధించి ప్రాజెక్టు వ్యయాల్లో 50 శాతం ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Also read: WPI: టోకు ద్రవ్యోల్బణం తగ్గినా, ‘తీవ్రమే’ ఆగస్టులో 12.41 శాతం
భారత్‌లో సెమీకండక్టర్స్, డిస్‌ప్లే తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.76,000 కోట్ల విలువైన పీఎల్‌ఐ పథకాన్ని గత ఏడాది డిసెంబర్‌లో కేంద్రం ప్రకటించింది.
PM కేర్స్ ట్రస్టీగా రతన్ టాటా
కరోనా నేపథ్యంలో అత్యవసర సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏర్పా టైన పీఎం కేర్స్ నిధికి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా ట్రస్టీలుగా వ్యవహరించనున్నారు.
Also read: AP ఉప సభాపతిగా ‘కోలగట్ల’ ఏకగ్రీవం
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన ట్రస్టు బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పీఎంఓ వెల్లడించింది. ప్రస్తుత ట్రస్టీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులతో అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. మాజీ కాగ్ రాజీవ్ మెహర్షి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి, పారిశ్రామికవేత్త ఆనంద్ షా సభ్యులుగా ఉంటారు.
Supreme Court: కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్ష ప్రసారాలు
సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి.
Also read: Supreme Court New Chief Justice: సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా లలిత్
గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
Russia-Ukraine War: రష్యా కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు
ఉక్రెయిన్‌లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశించారు. సెప్టెంబర్ 21న ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో పాటు మొత్తం పాశ్చాత్య దేశాల సంఘటిత యుద్ధ వ్యవస్థతో తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. ‘‘పోరు బాగా విస్తరించింది. సరిహద్దుల్లోనూ, విముక్త ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. దాంతో ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘‘రష్యాను బలహీనపరిచి, విభజించి, అంతిమంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Also read: SEO Summit 2022: అనుసంధానమే బలం SCO సభ్యదేశాలకు మోదీ పిలుపు
1991లో సోవియట్ యూనియన్‌ను ముక్కలు చేశామని ఇప్పుడు బాహాటంగా ప్రకటించుకుంటున్నాయి. రష్యాకూ అదే గతి పట్టించాల్సిన సమయం వచ్చిందంటున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ భూభాగాలను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల ఆయుధ వ్యవస్థలనూ వాడుకుంటామంటూ నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఇది అన్యాపదేశంగా అణు దాడి హెచ్చరికేనంటూ యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యా అంతటి దుస్సాహసం చేయకపోవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. పుతిన్ ప్రకటనను రష్యా బలహీనతకు ఉదాహరణగా, దురాక్రమణ విఫలమవుతోందనేందుకు రుజువుగా అమెరికా, బ్రిటన్ అభివర్ణించాయి.
ఉక్రెయిన్‌తో పోరులో ఇప్పటిదాకా 5,937 మంది రష్యా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ అంతకు పదింతల మంది సైనికులను కోల్పోయిందని చెప్పుకొచ్చారు.
YSR ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం..
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాల విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2022ను బుధవారం ఉభయ సభల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టారు.
Also read: Andhra Pradesh Economy: తొలిసారిగా రూ.2 లక్షలు దాటిన ఏపీ తలసరి ఆదాయం
1986 నవంబర్ 1వ తేదీన ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1998 జనవరి 8వ తేదీన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పేరు మార్చారు. ప్రస్తుతం దానిని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు ప్రవేశ పెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
Also read: State High Court: GO 111లోని ఆంక్షలు అమల్లోనే..
ఇతర బిల్లులు
దీంతో పాటు ఏపీ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ), ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సవరణ బిల్లు– 2022కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.
బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టిన మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టుల ద్వారా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారన్నారు. ఈ క్రమంలో సీఆర్‌డీఏ చట్టంలో పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చిందని తెలిపారు. పేదలకు సీఆర్‌డీఏ పరిధిలో స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి వీలుగా చట్టంలో సవరణలు చేస్తున్నామన్నారు. రాజధాని పరిధిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలక మండళ్లు, లేక ప్రత్యేకాధికారుల సిఫారసుతో మాస్టర్ ప్లాన్‌లో సవరణలు చేసేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు. మరో వైపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు–2022ను సభల్లో ఆమోదించారు.
Also read: DPIIT's July report: పెట్టుబడుల ఆకర్షణలో APనే అగ్రగామి
భూముల రీసర్వే చేస్తున్న నేపథ్యంలో భూ యాజమాన్య హక్కుకు సంబంధించి కేంద్రం సూచనలకు అనుగుణంగా కొత్త బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కొత్త చట్టం ద్వారా భూ యజమానులకు కచ్చితమైన టైటిల్ రిజిస్టర్ నిర్వహిస్తారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సవరణ, ఏపీ కార్మిక సంక్షేమ నిధి రెండో సవరణ, ఏపీ మున్సిపల్ లాస్ సవరణ బిల్లు–2022తో కలిపి మొత్తం తొమ్మిది బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP