State High Court: GO 111లోని ఆంక్షలు అమల్లోనే..
కొన్ని వెసులుబాటులు కల్పిస్తూ, జలాశయాల రక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో 69 జారీ చేసినా క్రితం జీవో అమల్లోనే ఉందని స్పష్టం చేసింది. జీవో నంబర్ 111 ఎత్తివేత, జంట జలాశయాల రక్షణకు సంబంధించి దాఖలైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కౌంటర్ దాఖలు చేసింది. జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు రక్షణ కల్పించాల్సి ఉండగా.. ఆక్రమణలు, నిర్మాణాలు చోటుచేసుకున్నాయన్నారు. ఇది జీవో 111ను, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లేనని డా.జీవానందరెడ్డి 2007లో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సెప్టెంబర్ 13న విచారణ చేపట్టగా.. ప్రభుత్వం తరఫున మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేశారు.
Also read: SCO Summit: ఎస్సీఓ సదస్సుకు జిన్‌పింగ్, మోదీ, పుతిన్ సైతం హాజరయ్యే అవకాశం
కౌంటర్ అఫిడవిట్‌లోని వివరాలు
‘ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన జీవో 69 ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమల్లోనే ఉంటాయి. జంట జలాశయాల ఎఫ్‌టీఎల్‌కు 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాలకు వర్తించే ఆంక్షలన్నీ కొనసాగుతాయి. జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యర్థ, మురుగు జలాలు చేరకుండా ఏర్పాట్లు, వాటి మళ్లింపునకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ, గ్రీన్ జోన్ల ఏర్పాటు, లే–అవుట్లు, కొత్త నిర్మాణాలకు అనుమతులు.. తదితర అంశాలపై కమిటీ నివేదిక అందజేయనుంది’అని వివరించింది.