Karnataka: కర్నాటక ముఖ్యమంత్రి ఈయనే...?
![Karnataka Assembly election](/sites/default/files/images/2023/05/14/congress-karnataka0-1684038182.jpg)
కాంగ్రెస్ అంటేనే క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఒంటరిగానే అధికారాన్ని ఏర్పాటుచేస్తుండడంతో సీఎం పదవి కోసం ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య అమాంతం పెరిగింది. అయితే వీరిలో ముగ్గురి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, డీకె శివకుమార్ వీరి మధ్యే ముఖ్యమంత్రి పీఠం దోబూచులాడనుంది. ఆదివారం(మే 14న) బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
Current Affairs: రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!
![Karnataka Assembly election](/sites/default/files/inline-images/Karnataka%20congress%20elections_0.jpg)
కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224. మెజారిటీ రావాలంటే ఏదైనా పార్టీకి 113 రావాలి. కాంగ్రెసు, బిజెపి రెండిటికీ అన్ని రావని, అధికారం అందుకోవడానికి తమపై ఆధారపడక తప్పదని, తాము కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తామని 1999లో ఆవిర్భవించిన జేడీఎస్ ఆశ పెట్టుకుని ఉంది. అయితే మే 13న వెలువడిన ఫలితాలు జేడీఎస్, బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి.
2018 ఎన్నికలలో బీజేపీకి 104 సీట్లు వచ్చి ఆగిపోయాయి. దాంతో 80 సీట్ల కాంగ్రెసు, 37 సీట్ల జేడీఎస్ ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేశారు. కానీ, ఆపరేషన్ కమలం ద్వారా 16 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపు తిప్పుకోవడంతో 14 నెలలకే ఆ ప్రభుత్వం కుప్పకూలింది.
చదవండి: 1.6 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన ఎన్ఐటీ అమ్మాయి
![Karnataka Assembly election](/sites/default/files/inline-images/Karnatka-Election-counting_650x400_0.jpg)
కర్నాటకలో పూర్తిగా రెండు కులాలే ఆధిపత్యం కొనసాగిస్తూ ఉన్నాయి. కర్నాటక రాజకీయాల్లో లింగాయత్‌లు, వొక్కళిగల పాత్రే కీలకం. కర్ణాటక జనాభాలో లింగాయతులు 17%, వొక్కళిగలు 15% ఉన్నారు. రాజకీయంగా లింగాయతుల తర్వాత ద్వితీయస్థానం వొక్కళిగలదే. కాంగ్రెస్ సీఎం రేసులో ముందున్న డీకే శివకుమార్ వొక్కళిగ సామాజిక వర్గానికి చెందినవారు. సిద్ధరామయ్య కురుబ కులానికి చెందినవారు. సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపిస్తే వొక్కళిగ ఓట్లు పడవేమోనని సందేహించిన కాంగ్రెసు పాత మైసూరు ప్రాంతానికి చెందిన వొక్కళిగ కులస్తుడైన డీకే శివకుమార్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేసి ముఖ్యమంత్రి రేసులో నిలిపింది. ఆయన వయసు 60.
![Karnataka Assembly election](/sites/default/files/inline-images/Siddaramaiah_Shivakumar_04_0.jpg)
2002లో మహారాష్ట్రలో విలాసరావు దేశ్‌ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి, 2017లో గుజరాత్ కాంగ్రెసు వాళ్లని రక్షించడానికి క్యాంప్ రాజకీయాలు నడిపి శివకుమార్ మంచి పేరు సంపాదించుకున్నారు. సోనియాగాంధీ నమ్మకబంటు అహ్మద్ పటేల్‌ను రాజ్యసభకు గెలిపించడానికి సర్వశక్తులు వినియోగించాడు.
MBBS Seats: విద్యార్థులకు గుడ్ న్యూస్... ప్రతి నలుగురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు
ఇక ఖర్గే విషయానికి వస్తే ఈయన దళితుడు. ఈ ఎన్నికల్లో దళిత ఓట్లు కాంగ్రెస్‌కు ఎక్కువగా పడ్డాయని ఇప్పటికే కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఇది ఖర్గేకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం వస్తే అలంకార ప్రాయంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా వదిలేసేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.
![Karnataka Assembly election](/sites/default/files/images/2023/05/18/dk-shiva-kumar-and-sidha-ramaiah0-1684394159.jpg)
మరికొద్ది గంటల్లో సీఎం ఎవరో తెలిసే అవకాశం ఉంది. అయితే డీకే, ఖర్గే, సిద్ధరామయ్య... ఈ ముగ్గురిలో అవకాశాలు మాత్రం డీకే, సిద్ధరామయ్యకు పుష్కలంగా ఉన్నాయి. డీకేకు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయి. జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి తర్వాత ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యకు సొంత పార్టీలోనే వ్యతిరేకులు అధికంగా ఉన్నారు. సిద్ధరామయ్యకు ప్రియాంకగాంధీ ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీఎం పదవి విషయమై డీకే, సిద్ధరామయ్య మధ్య సయోధ్య కుదరని పక్షంలో మధ్యే మార్గంగా దళితుడైన మల్లికార్జున ఖర్గేను కూడా సీఎంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు.