Karnataka Assembly Election 2023 Updates: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు హామీలు ఇవే..
ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో హస్తం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 6 ముఖ్య హామీలు ఇవే.. :
1. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
2. గృహలక్ష‍్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల రూ.2,000
3. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్న భాగ్య పథకం ద్వారా రూ.10 కేజీల చొప్పున బియ్యం
4. నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల రూ.3,000 నిరుద్యోగ భృతి
5. డిప్లోమా పూర్తి చేసి నిరుద్యోలుగా ఉన్న యువతకు యువ నిధి పథకం ద్వారా ప్రతి నెల రూ.1500. 18-25 ఏళ్ల మధ్య వయస్కులకే ఇది వర్తిస్తుంది.
6. మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
Assembly Elections: దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. ఎవరెవరికంటే?
మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 130 స్థానాల్లో ఆదిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 67, జేడీఎఎస్ 21 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.
హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో తమకు గెలుపు సాధించిపెట్టిన వ్యూహాన్నే.. కాంగ్రెస్ కర్ణాటకలోనూ అమలు చేసింది. హిమాచల్ మాదిరిగానే ఇక్కడా ‘ఐదు గ్యారెంటీ’లను ప్రకటించింది. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. గృహలక్ష్మి పథకం కింద 1.5 కోట్ల గృహిణులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని, అన్నభాగ్య పథకం కింద నిరుపేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం అందిస్తామని హస్తం పార్టీ ప్రకటించింది.
☛☛ Aam Aadmi Party: జాతీయ పార్టీగా ఆమ్ఆద్మీ.. హోదా కోల్పోయిన మూడు పార్టీలివే..
యువ నిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్రులు, డిప్లొమా పట్టాదారులకు నెలకు రూ.3,000, రూ.1,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామని వాగ్దానాలు గుప్పించింది. భాజపా అమలుచేసిన జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని రద్దుచేసి కర్ణాటక విద్యావిధానం (కేఈపీ)ని అమలు చేస్తామని తెలిపింది.
భాజపా తీర్మానించిన ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దు తొలగించి, ఎస్‌సీలకు 17 శాతం, ఎస్‌టీలకు 7% రిజర్వేషన్ కల్పిస్తూ.. జనాభా ఆధారంగా రిజర్వేషన్ ప్రమాణాలను సవరిస్తామని పార్టీ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను 75%కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ ప్రకటించిన పలు ఉచితాలు, ఆకర్షణీయ పథకాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.
☛☛ Election Commission: దేశంలోని ఓటర్ల సంఖ్య 94.5 కోట్లు
దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతో పాటు దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటిచెప్పడం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’.. కర్ణాటకలో పార్టీకి కొత్త ఊపునిచ్చింది. మొత్తం 140 రోజులకు పైగా సాగిన ఈ యాత్రలో.. అత్యధికంగా 21 రోజులు రాహుల్ కర్ణాటకలో నడిచారు. చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటె నుంచి మొదలుపెట్టి మొత్తం 511 కి.మీ రాష్ట్రంలో పర్యటించారు.
మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి తదితర జిల్లాలో ఈ పర్యటన సాగింది. యాత్ర మధ్యలో వర్షంలోనూ రాహుల్ ఓ బహిరంగ సభలో ప్రసంగించిన ఫొటోలు అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మాండ్యలో జోడో యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
☛☛ Election Commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
కాంగ్రెస్‌లో అందరూ సీఎం అభ్యర్థులే..
గతంలో హస్తం పార్టీని ఉద్దేశిస్తూ భాజపా చురకలంటించిందిలా. తాజా ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ ఇలాంటి విమర్శలు గుప్పించే ప్రయత్నం చేసింది. కానీ, కాంగ్రెస్ వాటిని పారనివ్వలేదు. పార్టీలో అంతర్గతంగా విభేదాలు వచ్చినా.. వాటిని బయటికి రాకుండా పరిష్కరించుకుంది. ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఐకమత్యంగా కన్పించారు. ఇక, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డీకే సమర్థంగా వ్యవహరించారు.
పార్టీలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో సఫలమయ్యారు. పార్టీలో మంచి ట్రబుల్‌షూటర్‌గా పేరున్న శివకుమార్.. ఐటీ దాడులను ఎదుర్కొని నిలబడ్డారు. పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపారు. ఇక భాజపా డబుల్ ఇంజిన్ సర్కారు అన్నప్పుడల్లా.. తమది జోడెద్దుల(డీకే-సిద్ధూను ఉద్దేశిస్తూ) బండి అని కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం ఓటర్లను ఆకట్టుకుంది. బొమ్మై సర్కారుపై వచ్చిన వ్యతిరేకతను.. సిద్ధూ-డీకే తమకు అనుకూలంగా మల్చుకుని చేసిన ప్రచారం హస్తానికి కలిసొచ్చింది.
Remote voting: ఓటు వలస వెళుతుందా.. రిమోట్ ఓటింగ్‌పై పెరుగుతున్న రాజకీయ వేడి!
కర్నాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే..?
కర్నాటక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించి కాంగ్రెస్ సీట్ల వేటలో దూసుకెళుతోంది. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 113 సీట్లను కాంగ్రెస్ ఇప్పటికే అధిగమించింది. 150 సీట్ల దిశగా పయనిస్తోంది. అయితే సింగిల్‌గానే అధికారాన్ని ఏర్పాటుచేసే సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడంతో ఇప్పుడు అందరి కన్ను.. ముఖ్యమంత్రి పీఠంపై పడింది.
కాంగ్రెస్ అంటేనే క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఒంటరిగానే అధికారాన్ని ఏర్పాటుచేస్తుండడంతో సీఎం పదవి కోసం ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య అమాంతం పెరిగింది. అయితే వీరిలో ముగ్గురు పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, డీకె శివకుమార్ వీరి మధ్యే ముఖ్యమంత్రి పీఠం దోబూచులాడుతోంది. ఆదివారం(మే 14న) బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224 ఉన్నాయి. మెజారిటీ రావాలంటే ఏదైనా పార్టీకి 113 రావాలి. కాంగ్రెసు, బిజెపి రెండిటికీ అన్ని రావని, అధికారం అందుకోవడానికి తమపై ఆధారపడక తప్పదని, తాము కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తామని 1999లో ఆవిర్భవించిన జెడిఎస్ ఆశ పెట్టుకుని ఉంది. అయితే మే 13న వెలువడిన ఫలితాలు జేడీఎస్, బీజేపీ ఆశలపై నీళ్లు పోశాయి.
2018 ఎన్నికలలో బిజెపికి 104 సీట్లు వచ్చి ఆగిపోయాయి. దాంతో 80 సీట్ల కాంగ్రెసు, 37 సీట్ల జెడిఎస్ ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వం కుమారస్వామి సీఎంగా ఏర్పడింది. కానీ ఆపరేషన్ కమలం ద్వారా 16 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపు తిప్పుకోవడంతో 14 నెలలకే ఆ ప్రభుత్వం కుప్పకూలింది.
కర్నాటకలో పూర్తిగా రెండు కులాలే ఆధిపత్యం కొనసాగిస్తూ ఉన్నాయి. కర్నాటక రాజకీయాల్లో లింగాయత్‌లు, వొక్కళిగల పాత్రే కీలకం. కాంగ్రెస్ సీఎం రేసులో ముందున్న డీకే శివకుమార్ వొక్కళిగ సామాజిక వర్గానికి చెందినవారు. సిద్ధరామయ్య కురుబ కులానికి చెందినవారు. సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపిస్తే వొక్కళిగ ఓట్లు పడవేమోనని సందేహించిన కాంగ్రెసు పాత మైసూరు ప్రాంతానికి చెందిన వొక్కళిగ కులస్తుడైన డీకే శివకుమార్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేసి ముఖ్యమంత్రి రేసులో నిలిపింది. ఆయన వయసు 60.
2002లో మహారాష్ట్రలో విలాసరావు దేశ్‌ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి, 2017లో గుజరాత్ కాంగ్రెసు వాళ్లని రక్షించడానికి క్యాంప్ రాజకీయాలు నడిపి శివకుమార్ మంచి పేరు సంపాదించుకున్నారు. సోనియాగాంధీ నమ్మకబంటు అహ్మద్ పటేల్‌ను రాజ్యసభకు గెలిపించడానికి సర్వశక్తులు వినియోగించాడు.
ఇక ఖర్గే విషయానికి వస్తే ఈయన దళితుడు. ఈ ఎన్నికల్లో దళిత ఓట్లు కాంగ్రెస్‌కు ఎక్కువగా పడ్డాయని ఇప్పటికే కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఇది ఖర్గేకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం వస్తే అలంకార ప్రాయంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా వదిలేసేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.
మరికొద్ది గంటల్లో సీఎం ఎవరో తెలిసే అవకాశం ఉంది. అయితే డీకే, ఖర్గే, సిద్ధరామయ్య... ఈ ముగ్గురిలో అవకాశాలు మాత్రం డీకే, సిద్ధరామయ్యకు పుష్కలంగా ఉన్నాయి. డీకేకు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయి. జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి తర్వాత ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యకు సొంత పార్టీలోనే వ్యతిరేకులు అధికంగా ఉన్నారు. సిద్ధరామయ్యకు ప్రియాంకగాంధీ ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీఎం పదవి విషయమై డీకే, సిద్ధరామయ్య మధ్య సయోధ్య కుదరని పక్షంలో మధ్యే మార్గంగా దళితుడైన మల్లికార్జున ఖర్గేను కూడా సీఎంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు.