Skip to main content

Assembly Elections: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. హరియాణాలో బీజేపీ అనూహ్య విజయం సాధించ‌గా, జ‌మ్మూకశ్మీర్‌లో ఎన్‌సీ–కాంగ్రెస్‌ కూటమి గెలుపొందింది.
Haryana Assembly Election Result 2024

హరియాణా అసెంబ్లీ ఫలితాల్లో.. బీజేపీ 48, కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ 2, స్వతంత్రులు 3 గెలిచాయి.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఫలితాల్లో.. నేషనల్ కాన్ఫరెన్స్ 42, బీజేపీ 29, కాంగ్రెస్ 6, పీడీపీ 3, జేపీసీ 1, సీపీఎం 1, ఆమ్ ఆద్మీ పార్టీ 1, స్వతంత్రులు 7  గెలిచాయి.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌–కాంగ్రెస్‌ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి.  
 
పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్‌లనే నమ్ముకున్న కాంగ్రెస్‌ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.

బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది.  అక్టోబ‌ర్ 8వ తేదీ వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. 

Siachen Base Camp: సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించిన ద్రౌపది ముర్ము

కాంగ్రెస్‌ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్‌ ఓడినట్లు వార్తలొచ్చాయి. 
ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్‌ చౌతాలా సారథ్యంలోని జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది.   

మల్లయోధురాలి గెలుపు పట్టు 
బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ(లాద్వా), కాంగ్రెస్‌ నేత భూపీందర్‌ సింగ్‌ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్‌ ఫొగాట్‌ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌నివాస్‌ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్‌ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

13 మంది మహిళల విజయం 
90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్‌ ఫొగాట్, సావిత్రి జిందాల్‌సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు.   

Unemployment Stats: భార‌త్‌లో అత్యధిక/అత్యల్ప నిరుద్యోగిత రేటు ఉన్న టాప్ 10 రాష్ట్రాలు ఇవే.. 

Published date : 09 Oct 2024 12:32PM

Photo Stories