Skip to main content

Aam Aadmi Party: జాతీయ పార్టీగా ఆమ్ఆద్మీ.. హోదా కోల్పోయిన మూడు పార్టీలివే..

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించింది. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కనబర్చిన పనితీరు ఆధారంగా ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
Aam Aadmi Party

ఇదే సమయంలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ), ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లకు ఇప్పటిదాకా ఉన్న జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 10న‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌కు, ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమబెంగాల్‌లో ఆర్‌ఎస్సీ, మణిపూర్‌లో ఎంపీసీ పార్టీలకు ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నాగాలాండ్‌లో ఎన్సీపీ, మేఘాలయలో టీఎంసీలకు త్వరలో రాష్ట్ర పార్టీ హోదా కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. నాగాలాండ్‌లో లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌), మేఘాలయలో వాయిస్‌ ఆఫ్‌ ద పీపుల్‌ పార్టీ, త్రిపురలో తిప్రా మోతా పార్టీలకు ‘గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీ’ హోదా ఇస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు, సమీక్షల తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించింది. 

Assembly Elections: దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. ఎవరెవరికంటే?

ప్రస్తుతం జాతీయ పార్టీలు ఆరు.. 
ఎన్నికల సంఘం తాజా చర్యల మేరకు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉన్నట్టయింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. 
☛ జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్‌ కేజ్రీవాల్‌ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. అతి తక్కువ సమయంలోనే తమ పార్టీకి జాతీయ హోదా దక్కడం పట్ల కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. 
☛ 1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. 
☛ జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది. 
☛ శరద్‌పవార్‌ 1999లో కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్సరంలో జాతీయ హోదా లభించింది. తర్వాత ప్రభావం తగ్గిపోయింది. 

Project Tiger: ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’కు 50 ఏళ్లు..

ఏపీలో పోటీ చేయకపోవడంతో బీఆర్‌ఎస్‌కు హోదా రద్దు 
తెలంగాణ ఏర్పాటు నినాదంతో 2001లో టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) ఏర్పాటైంది. 2004 సాధారణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ హోదా కోసం తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ 16 చోట్ల బరిలోకి దిగింది. తెలంగాణలో ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతోపాటు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకశాతం ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికల తర్వాత రాష్ట్ర పార్టీ హోదా దక్కింది. 2009 సాధారణ ఎన్నికలతోపాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఇతర ఎన్నికల్లోనూ ఏపీలో బీఆర్‌ఎస్‌ పోటీ చేయలేదు. అయినా ఉమ్మడి రాష్ట్రంనాటి రాష్ట్ర హోదా గుర్తింపు.. విభజన తర్వాత కూడా ఏపీలో కొనసాగింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం సమీక్షలో ఆ హోదాను కోల్పోయింది. 

Weekly Current Affairs (National) Bitbank: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఏ నగరంలో ప్రారంభమైంది?

Published date : 11 Apr 2023 12:34PM

Photo Stories