Skip to main content

Global Investors Summit: పారిశ్రామిక ప్రగతి ఇప్పటివరకు ఒక లెక్క... ఇకపై ఇంకో లెక్క

‘మనసుంటే మార్గం ఉంటుంద’నే మన తెలుగువాళ్ల నానుడి జగన్‌ ప్రభుత్వ వ్యవహార శైలికి చక్కగా నప్పుతుంది. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటేనే సాధ్యం అనేది ఈ గ్లోబల్‌ యుగంలో అవాస్తవం అని వైసీపీ ప్రభుత్వం నిరూపిస్తోంది.
Gudivada Amarnath

ఆయా ప్రాంతాలలో ఉన్న వనరుల లభ్యతను అధ్యయనం చేసి... మూడు ప్రాంతాలలో స్థానిక పరిస్థితులకు అనుకూలమైన పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలోనే రెండో అతి పొడవైన కోస్తా తీరాన్ని కలిగి ఉన్న ఏపీ... అద్భుతమైన వ్యూహంతో దానిని అభివృద్ధి వనరుగా మార్చుకో చూడటం ఇందుకు ఒక ఉదాహరణ. విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా ఇటువంటి ఎన్నో వనరుల వినియోగాన్ని సాకారం చేయబోతోంది ఏపీ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం....
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవానికి అంకురార్పణ జరుగుతోంది. పారిశ్రామిక ప్రగతి ఇప్పటివరకు ఒక లెక్క... ఇకపై ఇంకో లెక్క. గత ప్రభుత్వాలకు అసాధ్యమైన పారిశ్రామిక అభివృద్ధిని చేసి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. మనసుపెట్టి ప్రయత్నిస్తే పరిశ్రమలు రాష్ట్రానికి పరుగులు తీస్తాయన్న గట్టి నమ్మకంతో తన శ్రేణులను నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని చిన్నచూపు చూశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు పరిశ్రమలను తీసుకురావాలన్న ఆలోచన ఆయా ప్రభుత్వాలకు కలగకపోవడం వల్లే ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధిలో వెనకబడి పోయాయి. రాష్ట్ర విభజన తర్వాత అయినా రెండు ప్రాంతాలపై దృష్టి సారించిన దాఖలా గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఫలితంగా వేలాది మంది వలసపోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి పదునైన ప్రణాళిక రచించారు. 

చ‌ద‌వండి: అంబానీ, అదానీల పెట్టుబ‌డులు ఎంతంటే...
15 వేల కోట్లతో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం
రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని ఎలా ఉపయోగించుకోవాలో గత ప్రభుత్వాలకు తెలియలేదు. తీరం వెంబడి పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్రహించిన ముఖ్యమంత్రి  ఇప్పటివరకు అడ్రస్‌ లేకుండా పడి ఉన్న ‘మ్యారిటైమ్‌ బోర్డు’ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ బోర్డు ద్వారా 15 వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో... పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి పునాది వేశారు. ఇవి సాకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. గత ప్రభుత్వం పోర్టుల పేర్లు చెప్పి పునాదిరాళ్లు వేసి ప్రచారం చేసుకుందే తప్ప... ఒక పోర్టు పని కూడా ప్రారంభించలేక పోయింది. 

Global Investors Summit


ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూనే....
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలాన్ని కరోనా మింగేసింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూనే భవిష్యత్తు ప్రణాళికలపై విస్తృతమైన ఆలోచనలు చేస్తూ వచ్చింది.  రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు’ను విశాఖలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించింది. 

చ‌ద‌వండి: మొద‌టిరోజే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానం...
ముఖ్యమంత్రి  స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 26 చార్టెడ్‌ ఫ్లైట్‌లలో పారిశ్రామిక ప్రముఖులు తరలి వస్తున్నారంటే ఈ సదస్సుకున్న ప్రాముఖ్యత  ఏమిటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి జగన్‌ నాయకత్వం, వాణిజ్యవేత్తలతో ఆయన నెరపే స్నేహపూర్వక శైలి, పారదర్శక పరిపాలన, కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో అన్ని అనుమతులు పొందగలగడం... పెట్టుబడిదారులు ఏపీ వైపున‌కు రావడానికి కారణాలు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
సౌందర్యానికి పుట్టినిల్లు...
ఈ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు విశాఖలో నిర్వహించడానికి ప్రత్యేక కారణాలు లేకపోలేదు. సౌందర్యానికి పుట్టినిల్లు అయిన ఈ నగరాన్ని దేశ పటంలో అగ్రవగామిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. భారతదేశానికి గేట్‌ వేగా నిలిచిన విశాఖ... పారిశ్రామిక నగరంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఈ నగరానికి మరిన్ని పరిశ్రమలను తీసుకువస్తే, పారిశ్రామిక రాజధానిగా వెలుగొందుతుందన్నది ఆయన ఆలోచన. పరిపాలన రాజధానిని విశాఖకు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఆయన ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 
రెండవ పెద్ద పారిశ్రామిక నగరం
తూర్పు తీరంలో రోడ్డు, రైలు, జల, వాయు రవాణా నెట్‌ వర్క్‌ సౌకర్యం కల్గిన రెండవ పెద్ద పారిశ్రామిక నగరం విశాఖ. అద్భుతమైన సహజ నౌకాశ్రయం ఇక్కడే ఉంది. విశాఖ నుంచి దేశ నలుమూలకూ ప్రయాణించేందుకు అనువైన ఫోర్‌ వే నెట్‌ వర్క్‌ మార్గం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పోర్ట్‌లు, సముద్ర వాణిజ్యం, సెజ్‌లు, కారిడార్లు, భారీ పరిశ్రమలు, విద్యుత్తు పరిశ్రమలు, సర్వీసు సెక్టార్, వేలల్లో చిన్న తరహా పరిశ్రమలు, రక్షణ, ఫార్మా, ఆయుర్వేదం, ఐటీ, వ్యవసాయం, గిరిజన ఉత్పత్తులు, మైనింగ్‌ పరిశ్రమలు, విద్యా హబ్, హెల్త్‌ టూరిజం, అంతర్జాతీయ పర్యాటక రంగాల నుంచి విశాఖకు ఎంతో ఆదాయం లభిస్తోంది. 

చ‌ద‌వండి: త్వరలో విశాఖ నుంచే పరిపాలన..: సీఎం వైఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం  2019 జూన్‌ నుంచి  2022 డిసెంబర్‌ వరకూ వివిధ ఔట్‌రీచ్‌ కార్యక్రమాలను నిర్వహించింది. 2019 ఆగస్ట్‌లో నిర్వహించిన తొలి ఔట్‌ రీచ్‌లో 34 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, కాన్సులేట్‌ జనరళ్లు భాగస్వాములయ్యారు. 2022 ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 17 వరకు దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాల్గొంది. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లోనూ ముఖ్యమంత్రి నాయకత్వంలో  మంత్రులు– అధికారుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపన కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్షంగా 38,000 మందికి ఉపాధి కల్పించే 4 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది.

2019–2022లో 60.5 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం 21 భారీ, మెగా ప్రాజెక్టులకు తగిన ప్రోత్సా హకాలను మంజూరు చేసింది. వాటిలో జిందాల్‌ స్టీల్‌ పవర్‌ లిమిటెడ్, ఇండోసొల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జేఎస్‌ డబ్ల్యూ స్టీల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి మేజర్‌ పరిశ్రమలు ఏపీలో ఈ మూడేళ్ల కాలంలో కొలువుదీరాయి.

చ‌ద‌వండి: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నంబర్‌ వన్

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందించి అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందజేస్తోంది. ‘పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020–23’,‘ఆంధ్ర ప్రదేశ్‌ లాజిస్టిక్స్‌ పాలసీ 2022–27’, ‘ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతి ఎక్స్‌ పోర్ట్స్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27’ వంటి అనేక విధానాలను రూపొందించి జగన్‌ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకూ, ఇప్పటికే స్థాపించినవాటికీ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రోత్సాహ కాలు అందిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోంది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఎంఎస్‌ఎమ్‌ఈలు ఎదుర్కొన్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రూ. 962.42 కోట్ల ‘రీస్టార్ట్‌’ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఇది సుమారు 8 వేల ఎమ్మెస్‌ఎమ్‌ఈలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడటానికి సహాయపడింది.

చ‌ద‌వండి: అతిథుల‌కు పసందైన రుచులతో విందు

అనుకూలమైన పారిశ్రామిక విధానాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ‘వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం’ వంటి పథకాలను రూపొందించింది ప్రభుత్వం. ఈ పాలసీ ప్రధాన లక్ష్యం... పరిశ్రమలకు, ప్రత్యేకించి షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు వంటివారితో సహా నిరుపేద వర్గాలచే ప్రారంభించబడిన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అదనపు ప్రోత్సాహాన్ని అందించడం. 

గత పాలకులు... ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని వెలగబెట్టినవారు సమతుల అభివృద్ధికి ఏమాత్రం కృషిచేయని నేపథ్యంలో వైసీపీ... ఏపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి తనదైన విజన్‌తో ముందుకు దూసుకుపోతుందనేది పై వివరాల వల్ల అర్థమవుతోంది. ఈ పురోగామి ప్రయాణంలో విశాఖ సమ్మిట్‌ కేవలం ఒక మజిలీ మాత్రమే!
- గుడివాడ అమర్‌నాథ్‌.. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మ్రంతి

Published date : 03 Mar 2023 06:23PM

Photo Stories